మిరాయ్‌లో ప్రభాస్ వాయిస్ ఓవర్ వెనుక ట్విస్ట్?
మన పురాణాలు, ఇతిహాసాల గొప్పదనాన్ని చెబుతూ.. కథా నేపథ్యాన్ని వివరించిన తీరు ప్రభాస్ అభిమానులనే కాక సామాన్య ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.
By: Garuda Media | 14 Sept 2025 1:13 AM ISTటాలీవుడ్ లేటెస్ట్ హిట్ మిరాయ్‌లో అదనపు ఆకర్షణలు చాలానే ఉన్నాయి. ఈ సినిమాలో రానా దగ్గుబాటి చివర్లో ఒక క్యామియోలో కనిపించాడు. దానికి మంచి స్పందనే వచ్చింది. నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్ చేయగా.. అది సినిమాలో పెట్టలేదు. ఇక సినిమా ఆరంభంలో ప్రభాస్‌తో వాయిస్ ఇప్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మన పురాణాలు, ఇతిహాసాల గొప్పదనాన్ని చెబుతూ.. కథా నేపథ్యాన్ని వివరించిన తీరు ప్రభాస్ అభిమానులనే కాక సామాన్య ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. విశేషం ఏంటంటే.. ప్రభాస్ తన సొంత సినిమాలకు మించి దీనికి డబ్బింగ్ బాగా చెప్పాడనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. మామూలుగా ప్రభాస్ డైలాగ్ డెలివరీలో వేగం ఉండదు. కొంచెం పట్టి పట్టి డైలాగ్స్ చెబుతున్నట్లుంటుంది. వాయిస్ కొంచెం రఫ్‌గా కూడా ఉంటుంది. కానీ మిరాయ్ వాయిస్ ఓవర్ మాత్రం కొంచెం భిన్నంగా సాగింది. మాట కొంచెం స్పీడుగా ఉంది. మృదుత్వం కూడా పెరిగింది. వాయిస్ ఓవర్ విన్న వాళ్లు ప్రభాస్‌లో వచ్చిన ఈ మార్పుకు ఆశ్చర్యపోయి ఉంటారనడంలో సందేహం లేదు. కానీ ఈ మార్పు వెనుక పెద్ద ట్విస్ట్ ఉందని సమాచారం.
మిరాయ్ వాయిస్ ఓవర్లో వినిపించింది ప్రభాస్ ఒరిజినల్ గొంతు కాదట. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో ప్రభాస్ వాయిస్‌ను రీక్రియేట్ చేశారని ఒకప్రచారం జరుగుతోంది. ప్రభాస్ అనుమతితోనే ఇలా చేశారని.. చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ఈ వర్క్ చేయడంతో మంచి ఔట్ పుట్ వచ్చిందని అంటున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం బయట పెట్టట్లేదు.
మిరాయ్ సక్సెస్ మీట్లో కూడా అందరూ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పడం గమనార్హం. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఏఐతోనే ప్రభాస్ వాయిస్‌ను క్రియేట్ చేశారన్నది అర్థమైపోతుంది. మరి దీని గురించి పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు, ఇంటర్వ్యూల్లో చిత్ర బృందం ఓపెన్ అవుతుందేమో చూడాలి.
