సెంచరీ కొట్టేలా.. మిరాయ్ సోమవారం టెస్ట్ పాస్!
యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన మిరాయ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట కొనసాగిస్తోంది.
By: M Prashanth | 16 Sept 2025 11:12 AM ISTయంగ్ హీరో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన మిరాయ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట కొనసాగిస్తోంది. విడుదలైన మొదటి వీకెండ్‌లోనే అద్భుతమైన కలెక్షన్లు సాధించి, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఫ్యామిలీస్, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు సమానంగా ఆదరిస్తుండటంతో సినిమా హౌస్‌ఫుల్ షోలతో నడుస్తోంది.
ఇప్పటికే వీకెండ్ వసూళ్లలో రూ.82 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్న ఈ సినిమా, సోమవారం కలెక్షన్లతో ట్రేడ్ సర్కిల్స్‌కి సర్ ప్రైజ్ ఇచ్చింది. సాధారణంగా సోమవారం కలెక్షన్లు తగ్గిపోవడం కామన్. కానీ మిరాయ్ మాత్రం పూర్తి భిన్నంగా ప్రదర్శన చూపించి రూ.10 కోట్లకు పైగా గ్రాస్‌ను సొంతం చేసుకుంది.
ఒక్క రోజులోనే ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఈ సినిమా మీద ఉన్న హైప్, కంటెంట్ స్ట్రెంగ్త్‌కు నిదర్శనం అని చెప్పొచ్చు. మరో సెన్సేషనల్ పాయింట్ ఏమిటంటే.. సోమవారం మాత్రమే బుక్ మై షో యాప్ ద్వారా 1.23 లక్షల టిక్కెట్లు బుక్ అయ్యాయి. వీకెండ్ తర్వాత కూడా ఇంత భారీ డిమాండ్ రావడం అసాధారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో సినిమా మొత్తం గ్రాస్ ఇప్పటి వరకు రూ.92 కోట్లకు పైగా చేరింది.
రాబోయే ఒకటి రెండు రోజుల్లోనే సినిమా 100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. తేజ సజ్జా వరుసగా రెండు పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. హనుమాన్ తర్వాత వచ్చిన ఈ మిరాయ్ కూడా ఇండస్ట్రీకి పెద్ద ఊపిరి పోసేలా నిలిచింది. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎలా హౌస్‌ఫుల్ షోలతో స్పందిస్తారో మరోసారి నిరూపితమైంది.
ప్రత్యేకంగా అడ్వెంచర్, సూపర్ హీరో కాన్సెప్ట్, ఫ్యామిలీ ఎమోషన్ల మేళవింపుతో సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రేడ్ విశ్లేషకులు కూడా ఈ సక్సెస్‌ని చాలా పాజిటివ్‌గా చూస్తున్నారు. ఇటీవల పెద్ద సినిమాలు వరుసగా నిరాశపరిచిన సమయంలో మిరాయ్ ఒక ఊపిరి తీసుకొచ్చిందని భావిస్తున్నారు. సోమవారం కలెక్షన్ల తర్వాత సినిమా మరిన్ని లాభాలను తెచ్చిపెట్టడం ఖాయం అని నమ్ముతున్నారు. మొత్తం మీద, సోమవారం టెస్ట్ పాస్ అయిన మిరాయ్ ఇప్పుడు 100 కోట్ల మార్క్ ని అందుకునే దిశగా దూసుకెళ్తోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.
