Begin typing your search above and press return to search.

ఆ విషయంలో 'మిరాయ్‌' కేస్‌ స్టడీ..!

తేజ సజ్జా హీరోగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన 'మిరాయ్‌' సినిమాకు బిగ్ ఓపెనింగ్‌ దక్కింది.

By:  Ramesh Palla   |   13 Sept 2025 4:28 PM IST
ఆ విషయంలో మిరాయ్‌ కేస్‌ స్టడీ..!
X

తేజ సజ్జా హీరోగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన 'మిరాయ్‌' సినిమాకు బిగ్ ఓపెనింగ్‌ దక్కింది. మొదటి రోజు వందల కోట్ల వసూళ్లు నమోదు కాకపోయినప్పటికీ వారు పెట్టిన బడ్జెట్‌కి, ఆ సినిమా స్టార్‌ కాస్ట్‌కి వచ్చిన మొదటి రోజు వసూళ్లు ఖచ్చితంగా వందల కోట్లతో సమానం అనడంలో సందేహం లేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. మిరాయ్‌ సినిమా భారీ బడ్జెట్‌ మూవీ కాకపోయినా కూడా ఆ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉందంటూ ప్రేక్షకులు, విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మౌత్‌ పబ్లిసిటీతో సినిమాకు మంచి స్పందన వచ్చింది. మొదటి రోజు సినిమా దాదాపుగా రూ.27.5 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. చిత్ర యూనిట్‌ సభ్యులు సైతం ఇవే లెక్కలు చెబుతున్నారు.

మిరాయ్‌ మొదటి రోజు కలెక్షన్స్‌

సినిమా చూడ్డానికి భారీ బడ్జెట్‌తో తీసినట్లు ఉన్నప్పటికీ ఇది మీడియం బడ్జెట్‌ మూవీనే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను రూ.60 కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేసినట్లు విడుదలకు ముందు ప్రచారం జరిగింది. ఆ బడ్జెట్‌ నిజం అయితే మొదటి రోజు రూ.27.5 కోట్ల వసూళ్లు రావడం చాలా పెద్ద విషయం. ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాలకు కూడా ఈ స్థాయి వసూళ్లు సాధ్యం కావడం లేదు. స్టార్‌ హీరోల సినిమాలకు మొదటి వారం టికెట్ల రేట్లు విపరీతంగా పెంచుతున్నారు. అలా పెంచినప్పటికీ మొదటి వారంలో ఈ స్థాయి వసూళ్లను దక్కించుకోవడంలో వారి సినిమాలు కుప్పిగంతులు వేస్తున్నాయి. కానీ మిరాయ్ మాత్రం ఒక్క పైసా కూడా టికెట్ల రేట్లు పెంచకుండానే ఈ స్థాయి ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ను రాబట్టింది. మిరాయ్‌ వంటి మీడియం స్టార్‌ కాస్ట్‌ ఉన్న సినిమా ఈ స్థాయి ఓపెనింగ్‌ను దక్కించుకోవడం కచ్చితంగా ఆలోచించదగ్గ విషయం అనడంలో సందేహం లేదు.

తేజ సజ్జా మిరాయ్‌ రూ.100 కోట్లకు చేరువ...

మిరాయ్‌ సినిమాకు సైతం టికెట్ల రేట్లు భారీగా పెంచి ఉంటే ఖచ్చితంగా ఓపెనింగ్‌ కలెక్షన్స్ ఈ స్థాయిలో ఉండేవి కావేమో అనేది కొందరి అభిప్రాయం. టికెట్ల రేట్లను పెంచడం వల్ల అభిమానులు కాకుండా సామాన్యులు థియేటర్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. టికెట్ల రేట్లు పెంపు లేకపోవడం వల్లే మిరాయ్‌ సినిమాను మొదటి రోజే అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి మరీ చూశారు.. ఈ వీకెండ్‌లో చూసేందుకు తమ టికెట్లను బుక్ చేసుకున్నారు, ముందు ముందు చూస్తారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమాకు వచ్చిన టాక్‌తో పాటు, టికెట్ల రేట్లు నార్మల్‌గా ఉండటం వల్ల మొదటి వీకెండ్‌లోనే ఈ సినిమా రూ.100 కోట్లకు చేరువ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా వసూళ్లపై టికెట్ రేట్ల పెంపు చాలా ప్రభావం చూపిస్తుందని ఈ సినిమా నిరూపించింది.

టాలీవుడ్‌ నిర్మాతలకు సూచన..

పెద్ద హీరోల సినిమాలను మొదటి షో ను అభిమానులు చూస్తారు, ఆ తర్వాత అయినా సామాన్యులు చూడాల్సిందే. సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చినా కూడా చాలా మంది రెగ్యులర్‌ ఆడియన్స్ సినిమాను చూసేందుకు టికెట్ల రేట్ల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్యామిలీతో ఇప్పుడు సినిమాకు వెళ్తే దాదాపుగా వెయ్యి రూపాయలు అదనంగా చెల్లించాలి, తర్వాత వెళ్తే అప్పుడు ఆ వెయ్యి సేవ్‌ అవుతాయి అనుకుంటాడు. ఆ వారం తర్వాత ఆ సగటు ప్రేక్షకుడు సినిమా గురించి మరచి పోయి, మరో సినిమా వస్తే దాని ఆలోచనలో పడుతాడు. కనుక టికెట్‌ రేట్‌ పెంపు అనేది ఖచ్చితంగా ఓపెనింగ్స్ పై చాలా ప్రభావం చూపిస్తుంది. నిర్మాతలు సినిమాకు ఎక్కువ పెట్టాం కనుక ఎక్కువ రేటుకు టికెట్‌ అమ్ముకుంటాం అని అంటున్నారు. కానీ అది వారికే నష్టంను మిగుల్చుతుంది. మిరాయ్‌ సినిమాను ఒక కేస్‌ స్టడీగా తీసుకుని ఇకపై అయినా నిర్మాతలు తమ సినిమాల టికెట్ల రేట్లు పెంచకుండా ఉండటం అన్ని విధాలుగా మంచిది అనే అభిప్రాయం ను సినీ ప్రేమికులు, విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.