ఇకపై సినిమా ఇండస్ట్రీలో అలాంటివి బంద్: మంత్రి కోమటిరెడ్డి
దీనిపై తదుపరి విచారనను అక్టోబర్ 9కి కోర్టు వాయిదా వేసింది. అయితే దీనిపై తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు.
By: M Prashanth | 26 Sept 2025 11:33 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు వీలు కల్పిస్తూ.. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవోను రిలీజ్ కు ముందు రోజు తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. దీనిపై తదుపరి విచారనను అక్టోబర్ 9కి కోర్టు వాయిదా వేసింది. అయితే దీనిపై తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు.
ఇకపై తెలంగాణలో రేట్ల పెంపు, ప్రీమియర్స్ కు అనుమతి ఇవ్వం అని ఆయన చెప్పారు. ఆ రోజు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ నేను చెప్పడం జరిగింది. ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు. రేట్లు పెంచే సిస్టమ్ కూడా ఉండదు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అందరూ మాకు సమానమే. ఆ విధాంగానే ముందుకు వెళ్తామని ఆ రోజు నేను ఆన్ రికార్డ్ అనౌన్స్ చేయడం జరిగింది. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇచ్చారు. కానీ రీసెంట్ గా ఆ జీవోను హైకోర్టు రద్దు చేయడం శుభపరిణామమే.. అని మంత్రి మీడియాతో చెప్పారు.
అయితే సినిమాటోగ్రపీ మంత్రిగా తమ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కోర్టు రద్దు చేయం శుభపరిణామం అనడంపైనా ఆయన వివరణ ఇచ్చారు. అప్రిషియేషన్ అంటే దీనిపై నేను ఎక్కువ దృష్టి పెట్టలేదు. ఈ మధ్యలో మూడు రోజులు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో ఉన్నాను. అందుకే అప్పుడు ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ నేను వ్యక్తిగతంగా, సినిమాటోగ్రఫీ మంత్రిగా అసెంబ్లీ లో అనౌన్స్ చేశాను కాబట్టి.. ఇలాంటి అనుమతులు ఇవ్వకూడదనేది నా భావన.. అని కోమటిరెడ్డి అన్నారు.
చిన్న సినిమా నిర్మాతలకు కచ్చితంగా రాయితీలు ఇస్తాం. కానీ టికెట్ రేట్లు పెంచాలని, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వాలని నిర్మాతలు అడగకండి. ఈ విషయంపై మా దగ్గరకు రాకండి. దీనికి అప్లై కూడా చేయకండి అని విజ్ఞప్తి చేస్తున్నా. మీకు కూడా ఒత్తిడి తీసుకురాకండి. మధ్య తరగతిపై అధిక భారం పడనివ్వం. వాళ్లకు ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమా. అందుకే సినిమా నుంచి వాళ్లను దూరం చేయకండి. అని మంత్రి తెలిపారు.
కాగా, గతేడాది పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో అప్పట్లో దీనిపై పెద్ద వివాదమే జరిగింది. ఈ విషయంలో హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు, జైలుకు తీసుకెళ్లడం, విడుదల అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. ఆ తర్వత తెలంగాణలో ఏ సినిమాకు కూడా స్పెషల్ ప్రీమియర్ షోలు, టికెట్ల పెంపు ఉండదని అప్పట్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా అసెంబ్లీలో చెప్పారు.
కానీ, ఆ తర్వాత పలు సినిమాల విషయంలో ఈ నిబంధన అమలు కాలేదు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత కూడా పలు సినిమాలకు ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. తాజాగా ఓజీ సినిమాకు కూడా అలాంటి పర్మిషనే ఇవ్వడమే కాకుండా రిలీజ్ కు ఒక రోజు ముందు ప్రీమియర్స్ కు సైతం అనుమతి ఇచ్చింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా.. కోర్టు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
