మ్యూజిక్ సెన్సేషన్‌ని పెళ్లాడిన పాపులర్ గాయని!
ప్రముఖ పాప్ సింగర్ మైలీ సైరస్ తన చిరకాల ప్రియుడు, సంగీతకారుడు మాక్స్ మొరాండోను వివాహం చేసుకున్నట్లు సమాచారం. అమెరికాలోని కాలిఫోర్నియా, పామ్ స్ప్రింగ్స్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. మైలీ షేర్ చేసిన పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అతిథులంతా బ్లాక్ డ్రెస్ కోడ్‌లో వేడుకకు హాజరయ్యారు.
By: Sivaji Kontham | 23 Nov 2026 5:52 PM ISTప్రముఖ అంతర్జాతీయ పాప్ సింగర్, గ్రామీ విజేత మైలీ సైరస్ తన చిరకాల ప్రియుడు, మ్యూజిక్ సెన్సేషన్ మాక్స్ మొరాండో ను వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం పామ్ స్ప్రింగ్స్‌లోని ఒక అత్యంత విలాసవంతమైన రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. `ఫ్లవర్స్` వంటి వరల్డ్ బెస్ట్ హిట్ సాంగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మైలీ సైరస్ తన పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా ఈ శుభవార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.
ఈ వివాహ వేడుకకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అలనాటి దిగ్గజ గాయకుడు ఫ్రాంక్ సినాట్రాకు గతంలో సొంతమైన చారిత్రక రిసార్ట్‌లో వీరి పెళ్లి వేడుక జరిగింది. మైలీ సైరస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో తెల్లటి గులాబీల మధ్య ఈ నూతన దంపతులు ఎంతో రొమాంటిక్‌గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా.. ఈ వివాహానికి హాజరైన అతిథులందరూ ప్రత్యేకంగా `ఆల్-బ్లాక్`- పూర్తి నలుపు రంగు డ్రెస్ కోడ్‌ను పాటించడం ఈ వేడుకకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మైలీ సైరస్ - లాస్ ఏంజిల్స్ రాక్ బ్యాండ్ `లిల్లీ` డ్రమ్మర్ అయిన మాక్స్ మొరాండోల ప్రేమకథ నాలుగేళ్ల క్రితం ఒక బ్లైండ్ డేట్‌తో మొదలైంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సంగీతం పరంగా అభిరుచులు కలవడంతో వీరి బంధం మరింత బలపడింది. 2025లో జపాన్ పర్యటనకు వెళ్లిన సమయంలో మాక్స్ మొరాండో మైలీకి ప్రపోజ్ చేయగా.. అప్పుడే వీరి నిశ్చితార్థం జరిగింది. తాజాగా పామ్ స్ప్రింగ్స్‌లో జరిగిన ప్రైవేట్ వేడుకతో ఈ జంట తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకుంది.
ప్రముఖ డిజైనర్ ఆంథోనీ వాకారిల్లో రూపొందించిన దుస్తులలో మైలీ మెరిసిపోగా.. మైలీ తండ్రి బిల్లీ రే సైరస్ సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. పెళ్లి ఫోటోలు బయటకు వచ్చిన క్షణం నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, హాలీవుడ్ సహా మ్యూజిక్ ఇండస్ట్రీ ప్రముఖులు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పెళ్లికి ముందు మైలీ ప్రేమాయణం గురించి కూడా ఆన్ లైన్ లో గుసగుసలు ఉన్నాయి. గతంలో నటుడు లియామ్ హెమ్స్‌వర్త్‌తో విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న మైలీ సైరస్, మాక్స్ మొరాండో రాకతో తన జీవితంలో కొత్త ఆనందాన్ని పొందారని సన్నిహితులు చెబుతున్నారు.
