Begin typing your search above and press return to search.

హాలీవుడ్ లో విషాదం.. చిన్న వ‌య‌సులోనే మ‌ర‌ణించిన మైఖెల్ పాట్రిక్

హాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ద్వారా గుర్తింపు పొందిన ఐరిష్ న‌టుడు మైఖెల్ పాట్రిక్ క‌న్ను మూశారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   10 April 2026 3:57 PM IST
హాలీవుడ్ లో విషాదం.. చిన్న వ‌య‌సులోనే మ‌ర‌ణించిన మైఖెల్ పాట్రిక్
X

హాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ద్వారా గుర్తింపు పొందిన ఐరిష్ న‌టుడు మైఖెల్ పాట్రిక్ క‌న్ను మూశారు. గత కొంతకాలంగా మోటార్ న్యూరాన్ వ్యాధితో పోరాడుతున్న ఆయన, ఆరోగ్యం విషమించడంతో ఉత్తర ఐర్లాండ్‌లోని హాస్పిట‌ల్ లో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన భార్య నయోమీ షీహాన్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా వెల్లడించారు.

2023 ఫిబ్రవరిలో మైఖేల్‌కు మోటార్ న్యూరాన్ వ్యాధి నిర్ధారణ అయింది. ఈ వ్యాధి నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతూ క్రమంగా కండరాల పనితీరును దెబ్బతీస్తుంది. చేతులు, కాళ్లు బలహీనపడటం, నడవలేకపోవడం, మాటలో తడబాటు, శ్వాసలో ఇబ్బందులు వంటి లక్షణాలు దీనిలో కనిపిస్తాయి. వైద్య నిపుణుల ప్రకారం, ఈ వ్యాధి పూర్తిగా నయం అయ్యే అవకాశం లేకపోవడం వల్ల బాధితులు సాధారణంగా నిర్ధారణ తర్వాత కొద్ది సంవత్సరాల్లోనే మరణిస్తారు. మైఖేల్ కూడా ఈ ప్రాణాంతక వ్యాధితో ధైర్యంగా పోరాడినా చివరకు ఆరోగ్యం క్షీణించి, చిన్న వ‌య‌సులోనే మ‌ర‌ణించారు.

మరణానికి ముందు పదిరోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరి క్షణాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ప్రశాంతంగా కన్నుమూశారని ఆయన భార్య పేర్కొన్నారు. ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టులో, అతను గొప్ప నటుడే కాదు, గొప్ప మనిషి కూడా. అతని ధైర్యం, మనోబలం ఎంతో మందికి ప్రేరణ అని ఎమోష‌న‌ల్ గా రాసుకొచ్చారు.

మైఖేల్ పాట్రిక్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆరో సీజన్‌లోని ది బ్రోకెన్ మ్యాన్ ఎపిసోడ్‌. ఇందులో ఆయన వైల్డ్లింగ్ పాత్రలో కనిపించి తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. చిన్న పాత్ర అయినప్పటికీ, తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇదిలా ఉండగా, ఆయన కెరీర్ టెలివిజన్, థియేటర్ రంగాల్లో విస్తరించింది. బ్లూ లైట్స్, ది స్పెక్టాక్యుల‌ర్, దిస్ టౌన్ వంటి పలు టెలివిజన్ ప్రాజెక్టుల్లో నటించారు. అదేవిధంగా, షేక్స్ పియ‌ర్ నాటకాలలోనూ తన ప్రతిభను చాటుకుని రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు పొందారు.

మైఖేల్ వ్యక్తిత్వం, ఆయన సానుకూల దృక్పథం.. సహనటులు, అభిమానులపై గాఢమైన ముద్ర వేసింది. వ్యాధితో పోరాడుతున్న సమయంలో కూడా ఆయన చూపిన ధైర్యం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ కాలంలోనే తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మైఖేల్ పాట్రిక్ మృతి హాలీవుడ్ పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తున్నారు.