Begin typing your search above and press return to search.

మైకేల్ జాక్సన్ కేసు వెనుక అసలు నిజాలు?.. ట్రైలర్‌తో పెరిగిన ఆసక్తి

ఇప్పుడు రిలీజైన డాక్యుసిరీస్ ట్రైలర్ చూస్తే, కోర్టు విచారణలో పాల్గొన్న జ్యూరీ సభ్యులు, లాయర్లు, జర్నలిస్టులు, ప్రత్యక్ష సాక్షుల వాఖ్యాలతో అప్పటి పరిస్థితులను మళ్లీ తెరపైకి తీసుకురాబోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   21 May 2026 12:55 PM IST
మైకేల్ జాక్సన్ కేసు వెనుక అసలు నిజాలు?.. ట్రైలర్‌తో పెరిగిన ఆసక్తి
X

ప్రపంచాన్ని తన సంగీతంతో ఊపేసిన పాప్ దిగ్గజం మైకేల్ జాక్స‌న్ గురించి చర్చలు ఎప్పుడూ జ‌రుగుతూనే ఉంటాయి. ఆయన పాటలు, డ్యాన్స్ స్టెప్పులు, స్టేజ్ ప్రెజెన్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో, ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ వచ్చిన వివాదాలు కూడా అంతే పెద్ద చర్చకు దారి తీశాయి. ఇప్పుడు మైకేల్ జాక్సన్: ది వెర్డిక్ట్ పేరుతో రూపొందిన కొత్త డాక్యుసిరీస్ మళ్లీ అదే ప్రశ్నను ప్రపంచం ముందుకు తెస్తోంది.

ఇప్పటికే బయోపిక్‌తో మైకేల్ జాక్సన్ పేరు మరోసారి గ్లోబల్ ట్రెండ్‌గా మారిన సమయంలో, ఇప్పుడు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఆయన లైఫ్ లోని అత్యంత వివాదాస్పద అధ్యాయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఎంటర్టైన్‌మెంట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. 2003లో బాలల లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న మైకేల్ జాక్సన్ ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా భారీ మీడియా ట్రయల్‌ను ఎదుర్కొన్నారు. కోర్టు చివరకు ఆయనను నిర్దోషిగా ప్రకటించినప్పటికీ, ప్రజల మదిలో ఆ కేసు మిగిల్చిన ముద్ర మాత్రం పూర్తిగా చెరిగిపోలేదు.

ఇప్పుడు రిలీజైన డాక్యుసిరీస్ ట్రైలర్ చూస్తే, కోర్టు విచారణలో పాల్గొన్న జ్యూరీ సభ్యులు, లాయర్లు, జర్నలిస్టులు, ప్రత్యక్ష సాక్షుల వాఖ్యాలతో అప్పటి పరిస్థితులను మళ్లీ తెరపైకి తీసుకురాబోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఈ సిరీస్ కేవలం ఒక కేసు గురించే కాదు, ప్రపంచవ్యాప్తంగా స్టార్‌డమ్ ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతగా మార్చేస్తుందో చూపించే ప్రయత్నంలా కూడా కనిపిస్తోంది. ప్రపంచం మొత్తం అభిమానించే స్థాయికి ఎదిగిన వ్యక్తి ప్రతి కదలిక వార్త అవుతుంది. ప్రతి ఆరోపణ సంచలనం అవుతుంది. ప్రతి వ్యక్తిగత విషయం ప్రజా చర్చగా మారుతుంది. మైకేల్ జాక్సన్ జీవితం అందుకు పెద్ద ఉదాహరణగా నిలిచింది.

ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కూడా అదే ఆసక్తిని మార్కెట్‌గా మార్చుకుంటున్నాయి. నిజ జీవిత వివాదాలు, సెలబ్రిటీ స్కాండల్స్, కోర్టు కేసులు, మీడియా ట్రయల్స్ ఆధారంగా రూపొందుతున్న డాక్యుసిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మైకేల్ జాక్సన్ లాంటి గ్లోబల్ ఐకాన్ చుట్టూ ఉన్న మిస్టరీ, అభిమానుల ఎమోషన్, విమర్శలు.. ఇవ‌న్నీ ఉండ‌టంతో ఈ సిరీస్‌పై మరింత ఆసక్తి పెరుగుతోంది. ఒకవైపు అభిమానులు ఆయనపై వచ్చిన ఆరోపణల వెనుక నిజాలు బయటకు రావాలి అంటుంటే, మరోవైపు విమర్శకులు ఒక లెజెండ్ వ్యక్తిగత జీవితాన్ని మరణానంతరం కూడా వదలడం లేదంటూ స్పందిస్తున్నారు.