Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్‌: మైఖేల్ జాక్స‌న్ మ‌ళ్లీ పుట్టాడు

పాప్ కింగ్ మైఖేల్ జాక్స‌న్ బ‌యోపిక్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. మోస్ట్ అవైటెడ్ బయోపిక్ `మైఖేల్` మొదటి అధికారిక ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది.

By:  Sivaji Kontham   |   7 Nov 2025 10:27 AM IST
ట్రైల‌ర్‌: మైఖేల్ జాక్స‌న్ మ‌ళ్లీ పుట్టాడు
X

పాప్ సామ్రాజ్య‌పు రారాజు మైఖేల్ జాక్సన్ పై బ‌యోపిక్ తెర‌కెక్కించ‌డం ఎంత‌టివారికైనా అది ఒక సాహ‌సం లాంటిది. అసాధార‌ణ‌మైన డ్యాన్సింగ్ ప్ర‌తిభ‌, అజేయ‌మైన కెరీర్‌, మాద‌క‌ద్ర‌వ్యాల వ్య‌స‌నం, దానికి మించి లెక్క‌లేన‌న్ని లైంగిక వివాదాలు జాక్స‌న్ చుట్టూ ఉన్నాయి. బ‌యోపిక్ అంటే అన్నిటినీ ఈ సినిమాలో నిజాయితీగా చూపించాలి. అందుకే ఇది నిజంగా దుస్సాహ‌సం. కానీ అలాంటి సాహ‌సానికి పూనుకుంది లైన్స్ గేట్ సంస్థ‌. పాప్ కింగ్ మైఖేల్ జాక్స‌న్ బ‌యోపిక్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. మోస్ట్ అవైటెడ్ బయోపిక్ `మైఖేల్` మొదటి అధికారిక ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది.

ఈ ట్రైల‌ర్ ఆద్యంతం జాక్స‌న్ అద్భుత విన్యాసాలను చూఛాయ‌గా ప‌రిచ‌యం చేసారు. పాప్ కింగ్ ఒక సాధార‌ణ కిడ్ గా ప్రారంభించి, నెమ్మ‌దిగా అత‌డు ఎలా పాప్ ప్ర‌పంచంలో త‌న‌ను తాను ఆవిష్క‌రించుకున్నాడో చెబుతూ ఒక‌ నిమిషం ట్రైలర్ ర‌క్తి క‌ట్టించింది. ట్రైల‌ర్ ఆద్యంతం జాక్స‌న్ పాత్ర‌ధారి మెరుపు విన్యాసాలు క‌ట్టి ప‌డేస్తున్నాయి. అత‌డే ఇత‌డా? అనిపించేంత‌గా కొత్త ఆర్టిస్టు జాఫ‌ర్ అద్భుత‌మైన డ్యాన్సుల‌తో ఆక‌ట్టుకున్నాడు.

''మీరు దీని కోసం చాలా కాలంగా వేచి ఉన్నారని నాకు తెలుసు'' అనే వాక్యంతో ట్రైల‌ర్ ప్రారంభమవుతుంది.. వాయిస్ లో ..``ట్రాక్‌లు త‌యార‌య్యాయి.. పాటలు సిద్ధంగా ఉన్నాయి,.. ఇక‌పై వాటి నుండి తీసుకుందాం..`` అనే సంభాష‌ణ క‌థా గ‌మ‌నాన్ని సూచిస్తుంది. గ్లాడియేటర్, స్కైఫాల్ ఫేమ్ జాన్ లోగన్ `మైఖేల్‌` క‌థ‌ను అందించారు. జాక్సన్ పాత్ర‌లో జాఫ‌ర్ అనే యువ‌కుడు న‌టించాడు. ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ జీవిత కథను కేవ‌లం సంగీతం అనే కోణంలోనే కాకుండా చాలా కోణాల‌లో ఆవిష్క‌రించ‌నున్నారు. మైఖేల్ జాక్సన్ ఆరంభంలో `ఫైవ్‌` టీమ్ కి కెప్టెన్ అయినా, ఆ త‌ర్వాత అంచెలంచెలుగా ఎదిగేందుకు అత‌డు చేసిన అసాధార‌ణ కృషి ఎలాంటిదో తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు.

జాక్స‌న్ కెరీర్ ప్రారంభ ద‌శ‌ నుండి కొన్ని పాపుల‌ర్ డ్యాన్స్ బిట్స్ ని హైలైట్ చేస్తూ ట్రైల‌ర్ ని ర‌క్తి క‌ట్టించారు. ఈ చిత్రం ప్రేక్షకులకు మైఖేల్ జాక్సన్‌కు మునుపెన్నడూ లేని కోణంలో చూపించ‌నుంది. మైల్స్ టెల్లర్, లారెంజ్ టేట్, లారా హారియర్ త‌దిత‌రులు సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 24న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.