Begin typing your search above and press return to search.

బాలలపై లైంగిక వేధింపులు.. ఈ బయోపిక్ సీక్వెల్‌లో చూపిస్తారా?

అయితే ఈ సీక్వెల్ చుట్టూ ఇప్పుడు నెటిజన్లలో.. సినీ వర్గాల్లో ఒక ప్రధానమైన సందేహం ఉరుముతోంది.

By:  Sivaji Kontham   |   23 May 2026 9:36 AM IST
బాలలపై లైంగిక వేధింపులు.. ఈ బయోపిక్ సీక్వెల్‌లో చూపిస్తారా?
X

పాప్ సామ్రాజ్య అధినేత మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన `మైఖేల్` బయోపిక్ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా 217 మిలియన్ డాలర్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టించినా.. అభిమానులను మాత్రం కొంతవరకు నిరాశపరిచింది. కేవలం జాక్సన్ క్రేజ్.. జాఫర్ జాక్సన్ అద్భుత నటన వల్లే సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయని.. కథనంలో చాలా లోపాలు ఉన్నాయని అభిమానులు వాపోయారు. ముఖ్యంగా మైఖేల్ జాక్సన్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన `బ్యాడ్ వరల్డ్ టూర్` లండన్ వెంబ్లీ స్టేడియం ప్రదర్శనతో మొదటి భాగాన్ని అకస్మాత్తుగా ముగించడంపై విమర్శలు వచ్చాయి. అయినా కానీ.. ఈ చిత్రం సాధించిన రికార్డు స్థాయి విజయంతో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ లయన్స్ గేట్ ఇప్పుడు ఈ బయోపిక్ సీక్వెల్ `మైఖేల్ 2` నిర్మాణాన్ని అధికారికంగా ఖరారు చేసింది.

మొదటి భాగంలో మైఖేల్ జాక్సన్ చిన్ననాటి ప్రస్థానం నుండి `జాక్సన్ 5` గ్రూప్ ద్వారా పాప్ కింగ్‌గా ఎదిగిన తీరును చూపించినా.. ఆయన కెరీర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వరల్డ్ చార్ట్ బస్టర్ సింగిల్ `డేంజరస్`, ఇన్విన్సిబుల్స్‌ ఆల్బమ్స్ కాలాలను నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ ఆసక్తే నెలకొంది. లయన్స్ గేట్ మోషన్ పిక్చర్ గ్రూప్ చైర్ ఆడమ్ ఫోగెల్సన్ ఇటీవల మే 21న జరిగిన స్టూడియో త్రైమాసిక ఆదాయాల సమావేశంలో మాట్లాడుతూ.. `మైఖేల్ 2` స్క్రిప్టు అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఈసారి కథనం కేవలం ఒకే క్రమంలో సాగకుండా... మొదటి భాగంలో వదిలేసిన లేదా సింపుల్ గా చూపించిన మైఖేల్ జీవితంలోని అద్భుతమైన ఎగ్జ‌యిట్ చేసే ఎలిమెంట్స్ ని కవర్ చేస్తూ కాలంలో వెనక్కి.. ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. స్క్రీన్ ప్లే ప‌రంగా మ్యాజిక్ ఆక‌ర్షిస్తుంద‌ని భ‌రోసానిచ్చారు.

అయితే ఈ సీక్వెల్ చుట్టూ ఇప్పుడు నెటిజన్లలో.. సినీ వర్గాల్లో ఒక ప్రధానమైన సందేహం ఉరుముతోంది. మైఖేల్ జాక్సన్ జీవితంలోని అత్యంత వివాదాస్పద అంశాలైన బాలలపై లైంగిక వేధింపుల ఆరోపణలను ఈ సీక్వెల్‌లో చూపిస్తారా లేదా అనేదే ఆ ప్రశ్న. జాక్సన్ జీవితంలో నెవర్లాండ్ రాంచ్ నిర్మాణం ఎంతటి సంచలనమో అక్కడ ఆయనపై వచ్చిన లీగల్ వివాదాలు కూడా అంతే సంచలనం. మొదటి భాగం ముగింపులోనే ఈ వివాదాలను ప్రస్తావించాలని మేకర్స్ భావించినా.. గతంలో ఈ ఆరోపణలు చేసిన జోర్డాన్ చాండ్లర్‌తో జరిగిన ఒక చట్టపరమైన ఒప్పంద నిబంధనల వల్ల ఆ సీన్లను తొలగించాల్సి వచ్చింది. ఇప్పుడు సీక్వెల్‌లో ఈ వివాదాల వెనుక ఉన్న అసలు నిజాలను చూపిస్తారా? లేక ఆంగ్ల మీడియా చేసిన అతిగా దీనిని చిత్రీకరిస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.

మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ సీక్వెల్‌కు సంబంధించిన దాదాపు 25 నుండి 30 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు స్టూడియో అధికారులు వెల్లడించారు. గతంలో `మైఖేల్` బయోపిక్‌ను మూడు భాగాలుగా తీయాలని భావించి చిత్రీకరించిన కొన్ని ముఖ్యమైన సీన్లు.. చట్టపరమైన మార్పుల వల్ల మొదటి భాగంలో ఉపయోగించని పుటేజీని ఇప్పుడు ఈ రెండో భాగంలో ఉపయోగించబోతున్నారు. మైఖేల్ జాక్సన్ సోదరుడి కుమారుడైన జుఫార్ జాక్సన్ ఈ చిత్రంలో మైఖేల్‌గా పరకాయ ప్రవేశం చేయగా.. ఈ వార‌సుడు కూడా అచ్చుగుద్దినట్లు తన బాబాయ్ మైఖేల్ జాక్సన్‌ను తలపిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.

భారతదేశంలోనే దాదాపు రూ. 74.32 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన `మైఖేల్` ఫ‌లితం ఊహించ‌నిది. ఈ చిత్రానికి సీక్వెల్ ఒక సరైన ముగింపుని ఇస్తుందని, రెండో భాగం భార‌త‌దేశంలోను సంచ‌ల‌నం సృష్టిస్తుంద‌ని మేకర్స్ నమ్ముతున్నారు. మైఖేల్ జాక్సన్ జీవితంలోని చీకటి కోణాలను, లీగల్ కాంట్రవర్సీలను, అంతర్జాతీయ మీడియా సృష్టించిన హడావిడిని ఈ సీక్వెల్‌లో ఎంతవరకు నిజాయితీగా చూపిస్తారనే దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఈ సరికొత్త నెక్స్ట్ జనరేషన్ బయోపిక్ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చి.. పాప్ కింగ్ జీవితంలోని అసలు నిజాలపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.