'మిస్ యూనివర్స్'గా మెక్సికో భామ.. కళ్లు చెదిరే అందం అంతే!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులను ఒకచోట చేర్చిన అంగరంగ వైభవమైన ఒక అద్భుత వేదికపై మిస్ యూనివర్శ్ కిరీటాన్ని ధరించిన ఫాతిమా బాష్ అందచందాలకు ఇప్పుడు ప్రపంచం మంత్రముగ్ధం అవుతోంది.
By: Sivaji Kontham | 21 Nov 2025 1:42 PM ISTజిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో, చివరికి ప్రపంచంలో.. దశల వారీగా వందల మందితో పోటీపడుతూ, ఎలాంటి మిస్సింగ్స్ లేకుండా అందాల మిస్సుగా కిరీటం గెలుచుకోవాలంటే ఎంతటి ప్రతిభ కావాలి? ఎలాంటి గట్స్ కావాలి?... ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా నిలిచింది ఈ మెక్సికో భామ ఫాతిమా బాష్. ఈ బ్యూటీ మిస్ యూనివర్స్-2025 కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ కిరీటం దక్కించుకోవడానికి ముందు తన దేశంలో తాను ఉన్న స్థలంలోను స్థానికంగా ఎన్నో విజయాలను నమోదు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులను ఒకచోట చేర్చిన అంగరంగ వైభవమైన ఒక అద్భుత వేదికపై మిస్ యూనివర్శ్ కిరీటాన్ని ధరించిన ఫాతిమా బాష్ అందచందాలకు ఇప్పుడు ప్రపంచం మంత్రముగ్ధం అవుతోంది. ఆమె ప్రతిభకు సాటి రారు ఎవరూ. దాదాపు ఐదు సంవత్సరాల విరామం తర్వాత మెక్సికో అందం మిస్ యూనివర్స్ టైటిల్‌ను తిరిగి పొందడం ఆ దేశంలో ఉత్సవాలకు దారి తీసింది.
ఫాతిమా బాష్ అంతర్జాతీయ పోటీ ప్రపంచంలో శిఖరాగ్రానికి చేరుకునేందుకు చూపించిన ప్రతిభపై ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఆమె అందరి మనుసులను గెలుచుకుంది. క్వీన్ ఫాతిమా బాష్ వంద మందికి పైగా పోటీదారులతో పోటీపడి ఈ కిరీటాన్ని దక్కించుకుంది. 2020లో మెక్సికో నుంచి ఆండ్రియా మెజా ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత ఐదేళ్లకు ఇది సాధ్యమైంది.
74వ ఎడిషన్ కిరీట ధారణ క్షణం చాలా అరుదైనది. ప్రస్తుత టైటిల్ హోల్డర్, డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజెర్ థెయిల్విగ్, అధికారికంగా తన వారసురాలికి మాంటిల్‌ను అందజేశారు. చివరి వరకూ బిగ్ ఫైట్ ఇచ్చిన థాయిలాండ్‌కు చెందిన ప్రవీణార్ సింగ్ మొదటి రన్నరప్ స్థానాన్ని సంపాదించారు. ఫాతిమా బాష్ విజయం వ్యక్తిగత విజయానికి సింబాలిక్ మాత్రమే కాదు.. అంతర్జాతీయ అందాల పోటీలలో స్థిరమైన శక్తి కేంద్రంగా మెక్సికో స్థానాన్ని మరోసారి బహిర్గతం చేసింది. ఆ దేశానికి కొత్త అధ్యాయం మరోసారి మొదలైందని అనుకోవచ్చు.
భారత్ కి ఈసారి కూడా నిరాశే
మిస్ యూనివర్శ్ 2025 పోటీలలో ఈసారి కూడా భారత్ కి నిరాశే ఎదురైంది. రాజస్థాన్ నుంచి పోటీబరిలో నిలిచిన మణిక విశ్వ కర్మ టాప్-12 వరకూ పోరాటంలో ముందుకు సాగింది. ఈ ఏడాది జైపూర్ లో జరిగిన పోటీలలో మిస్ ఇండియాగా కిరీటం గెలుచుకున్న మణిక విశ్వ కర్మ విశ్వసుందరి పోటీలో టాప్ 30 వరకూ సులువుగా దూసుకొచ్చారు. కానీ టాప్ 12లో అవకాశం కోల్పోయారు.
