Begin typing your search above and press return to search.

మెట్ గాలా-2026: అందని ద్రాక్షలా ఎంట్రీ పాస్.. టికెట్ ధరతో ఒక ఇల్లే కొనొచ్చు!

ప్రపంచ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వేడుకగా వెలుగొందే `మెట్ గాలా-2026`మరోసారి వార్తల్లో నిలిచింది.

By:  Sivaji Kontham   |   6 May 2026 7:00 PM IST
మెట్ గాలా-2026: అందని ద్రాక్షలా ఎంట్రీ పాస్.. టికెట్ ధరతో ఒక ఇల్లే కొనొచ్చు!
X

ప్రపంచ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వేడుకగా వెలుగొందే `మెట్ గాలా-2026`మరోసారి వార్తల్లో నిలిచింది. ఫ్యాషన్ ప్రపంచపు మహాకుంభమేళాగా పిలుచుకునే ఈ ఈవెంట్‌లోకి ప్రవేశించాలంటే సామాన్యులకు అది కలే అని చెప్పాలి. ఎందుకంటే ఈ వేడుకలో అడుగుపెట్టడానికి చెల్లించాల్సిన ఎంట్రీ ఫీజు ఎంతో వింటే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. ఒక మధ్యతరగతి కుటుంబం జీవితాంతం కష్టపడి కొనుక్కునే ఇంటి విలువతో సమానంగా ఇక్కడి టికెట్ ధర ఉండటం గమనార్హం.

ఈ మెట్ గాలా ఈవెంట్‌లోకి ప్రవేశించడానికి ఒక్కో వ్యక్తికి సుమారు 50 లక్షల రూపాయల (దాదాపు 50,000 డాలర్లు) పైగా ఖర్చవుతుందని సమాచారం. జర్నలిస్టులకు కొన్ని మినహాయింపులు ఉండవచ్చేమో కానీ.. అతిథులుగా వెళ్లాలనుకునే వారు మాత్రం భారీగా చేతి చమురు వదిలించుకోవాల్సిందే. ఎంట్రీ టికెట్ లేకుండా ఒక్క పిట్ట కూడా లోనికి జొరబడలేనంత కట్టుదిట్టంగా, అత్యంత ప్రత్యేకంగా ఈ వేడుకను నిర్వహిస్తారు. కేవలం డబ్బు ఉంటే సరిపోదు... ఆ సంవత్సరపు సాంస్కృతిక రంగంలో మీ ప్రభావం ఎంత ఉందనేది కూడా ఇక్కడ ముఖ్యం.

వార్షిక నిధుల సేకరణే లక్ష్యంగా ప్రారంభమైన ఈ వేడుక వెనుక ఒక బలమైన కారణం ఉంది. న్యూయార్క్ నగరంలోని `మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్` కు చెందిన కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్ తన నిర్వహణ ఖర్చులను తానే సేకరించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం 1948లో ఒక చిన్న విందుగా మొదలైన ఈ కార్యక్రమం.. నేడు ప్రపంచ స్థాయి ఫ్యాషన్ చిహ్నంగా మారింది. 1995 నుండి వోగ్ ఎడిటర్-ఇన్-చీఫ్ అన్నా వింటూర్ ఈ వేడుకను పర్యవేక్షిస్తూ.. అతిథుల జాబితాను ఖరారు చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు.

మెట్ గాలాలో కేవలం సినిమా తారలే కాదు.. క్రీడలు, సంగీతం, ఫ్యాషన్ .. ఇతర సాంస్కృతిక రంగాల ప్రముఖులు మెరుస్తారు. ప్రతి ఏటా ఒక ప్రత్యేకమైన థీమ్‌ను ఎంచుకోవడం ఇక్కడి మరో విశేషం. అతిథులు ఆ థీమ్‌కు అనుగుణంగా ధరించే వింతైన.. విభిన్నమైన దుస్తులు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తాయి. ఇది కేవలం గ్లామర్ షో మాత్రమే కాదు, ఫ్యాషన్‌ను ఒక కళగా, చరిత్రగా.. సృజనాత్మకతకు నిదర్శనంగా చూపే అద్భుతమైన వేదిక.

టాప్ డిజైనర్లు తమ ప్రతిభను ప్రపంచానికి చాటుకోవడానికి ఈ రెడ్ కార్పెట్‌ను ఒక అస్త్రంగా వాడుకుంటారు. గాలా రాత్రి ముగిసిన తర్వాత కూడా.. అక్కడ ప్రదర్శించిన విశేషమైన దుస్తులను మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. నిధుల సేకరణతో మొదలై గ్లోబల్ ఫ్యాషన్ క్యాలెండర్‌లోనే అత్యంత ఖరీదైన.. ఆసక్తికరమైన సాంస్కృతిక ఘట్టంగా మెట్ గాలా-2026 తన ప్రత్యేకతను చాటుకుంటోంది.