'మేము COPలం' ట్రైలర్: కోడి ఎక్కడికెళ్ళింది?
అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎంటర్టైన్మెంట్, మిస్టరీ, రాజకీయాలు, మూఢ నమ్మకాలను కలిపిన ఆసక్తికర కథను చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
By: M Prashanth | 14 May 2026 4:15 PM ISTఓ గ్రామంలో కోడి పందేలు అంటే ప్రాణంగా భావించే ప్రజలు.. ఆ ఊరిలోనే అత్యంత విలువైన కోడి కనిపించకుండా పోవడం.. దానిని వెతకాల్సిన బాధ్యత ఇద్దరు అమాయక పోలీసులపై పడటం.. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా.. ఇప్పుడు ఆ బ్యాక్ డ్రాప్ తోనే జీ5 ఒరిజినల్ తెలుగు వెబ్ సిరీస్ మేము COPలం రూపొందుతోంది. మే 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎంటర్టైన్మెంట్, మిస్టరీ, రాజకీయాలు, మూఢ నమ్మకాలను కలిపిన ఆసక్తికర కథను చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. కథ మొత్తం ఒక కోడి చుట్టూనే తిరుగుతున్నప్పటికీ, ట్రైలర్ లో చూపించిన తీరు మాత్రం కంప్లీట్ ఎంటర్టైనింగ్ గా ఉంది. గ్రామంలో కోడి పందేలు ఎంతో పాపులర్ గా కాగా.. ఒక ప్రత్యేక కోడి మాయమవుతుంది.
ఆ కేసును ఛేదించాల్సిన బాధ్యత రవి, మోహన్ సోతారి అనే ఇద్దరు పోలీసులపై పడుతుంది. అయితే వారు తెలివైన అధికారులకంటే, గందరగోళానికి గురయ్యే అమాయకుల్లా కనిపించడం ట్రైలర్ కు మెయిన్ అట్రాక్షన్ గా మారింది. ఒక్క కోడి కోసం మొదలైన అన్వేషణ క్రమంగా పెద్ద మిస్టరీగా మారుతుంది. గ్రామంలో బ్లాక్ మ్యాజిక్ ప్రచారం, రాజకీయ ఒత్తిళ్లు, గ్రామస్థుల భయాలు, హెచ్చరికలు ఉత్కంఠ పెంచుతున్నాయి.
అదే సమయంలో మనుషుల మధ్య జరిగే అపార్థాలు, విచిత్ర సంఘటనలు నవ్విస్తున్నాయి. బలవంతపు కామెడీ కంటే విలేజ్ స్టైల్ నేచురల్ ఎంటర్టైన్మెంట్ ను దర్శకుడు చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే వెబ్ సిరీస్ లో మెగా బ్రదర్ నాగబాబు గజపతి రాజు పాత్రలో కనిపించనుండగా, స్టార్ కమెడియన్ గెటప్ శ్రీను మోహన్ సోతారి పాత్రలో, రవితేజ నన్నిమాల రవి సోతారి పాత్రలో నటించారు.
గెటప్ శ్రీను, రవితేజ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ట్రైలర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే రీతూ చౌదరి, చరణ్ లక్కరాజు, సిరి పార్వతి, కిరీటి దామరాజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు ప్రదీప్ మద్దాలి గ్రామీణ వాతావరణాన్ని సహజంగా చూపించే ప్రయత్నం చేసినట్టు ట్రైలర్ లో కనిపిస్తోంది. ముఖ్యంగా గోదావరి నేటివిటీ, పలు సీన్ల చిత్రీకరణ సిరీస్ కు ప్రత్యేకతగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
కథకు అనుగుణంగా ఫోక్ టచ్, సస్పెన్స్ ఎలిమెంట్స్, గ్రామ రాజకీయాలు కలిపిన తీరు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. సిరీస్ ను బీవీఎస్ రవి నిర్మించగా, కథను శోభన్ చిట్టుప్రోలు అందించారు. స్క్రీన్ ప్లేను శోభన్ చిట్టుప్రోలు, చాణక్య వర్మ కలిసి రూపొందించారు. సినిమాటోగ్రఫీ కిషోర్ బోయిడపు అందించగా, సంగీతాన్ని సాకేత్ కొమందూరి సమకూర్చారు.
ఇప్పటికే తెలుగు ఓటీటీ సెక్టార్ లో గ్రామీణ కథలకు మంచి ఆదరణ లభిస్తున్న సమయంలో మేము COPలం కూడా అదే తరహాలో ఎంటర్టైన్మెంట్, మిస్టరీ, విలేజ్ ఎమోషన్స్ కలిపి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉన్న ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే.. సిరీస్ విడుదల తర్వాత అందరినీ ఆకట్టుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
