ఇది లోపం కాదు నిర్లక్ష్యం.. ఇండిగోపై మెహ్రీన్ ఫైర్
నటనా వృత్తిలో, వ్యక్తిగత జీవితంలో డ్యాషింగ్ నిర్ణయాలతో ఆశ్చర్యపరిచిన మెహ్రీన్ ఫీర్జదా, ఇప్పుడు ఇండిగో ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యాన్ని నిలదీసే ప్రయత్నం చేసారు.
By: Sivaji Kontham | 5 Dec 2025 10:26 PM ISTనటనా వృత్తిలో, వ్యక్తిగత జీవితంలో డ్యాషింగ్ నిర్ణయాలతో ఆశ్చర్యపరిచిన మెహ్రీన్ ఫీర్జదా, ఇప్పుడు ఇండిగో ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యాన్ని నిలదీసే ప్రయత్నం చేసారు. ఇండిగో విమానాలు చాలా ఆలస్యంగా గమ్యాన్ని చేరుకుంటున్నా, యాప్ లో మాత్రం సమయానికి ప్రయాణీకులను దించేస్తున్నామని చూపించడాన్ని మెహ్రీన్ తప్పు పట్టారు. ఇది లోపం కాదు నిర్లక్ష్యం అని తీవ్రంగా విమర్శించారు.
తన ఎక్స్ ఖాతాలో ఇండిగో విమానాల ఆలస్యంపై అసహనం వ్యక్తం చేసింది మెహ్రీన్. పదే పదే ఆలస్యమవుతున్నా `సమయానికి` అని చూపిస్తోందని ఇండిగో ఎయిర్‌లైన్ యాప్‌పై మెహ్రీన్ పిర్జాదా నిరాశ వ్యక్తం చేశారు.
ఇండిగో నరకం చూపిస్తుస్తోంది.. ఇది ఆమోదయోగ్యం కాదు. మీరు బోర్డింగ్ సమయంలో విమానాలను రద్దు చేసే వరకు `సమయానికి` అని చూపిస్తూనే ఉండగా, ప్రయాణీకులు రోజుల తరబడి విమానాశ్రయాలలో ఇరుక్కుపోయారు.. ఇది లోపం కాదు నిర్లక్ష్యం`` అని ఫైర్ అయ్యారు.
డిజిసిఏ కొత్త నిబంధనల దృష్ట్యా విమాన సిబ్బంధిని, పైలెట్లను మ్యానేజ్ చేయడంలో తడబడిన ఇండిగో తన విమానాలను చాలా ఆలస్యంగా షెడ్యూలింగ్ చేస్తుండటంతో ప్రయాణీకులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇండిగో ప్రస్తుత పరిస్థితిపై విమానయాన రంగానికి చెందిన కీలక అధికారులు, పెద్దలు సమీక్షలు నిర్వహిస్తూ, పరిస్థితిని తిరిగి ట్రాక్ లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే ఇండిగో తప్పు దారి పట్టించే బదులు సరైన షెడ్యూల్ లను ప్రకటించాలని మెహ్రీన్ కోరుకుంది. ఇండిగో గందరగోళం సృష్టించిందని, ఇది చాలా దారుణమని కూడా విరుచుకుపడింది. మీ వల్ల విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన వారికి పరిహారం చెల్లించండి అని కూడా నిలదీసారు.. ఇండిగో ఈ పోస్ట్‌కి ప్రతిస్పందిస్తూ, ``మిస్ పిర్జాదా.. మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. ముందే చెప్పినట్టే, మీ విమానం ప్రస్తుతం సమయానికి నడుస్తోంది.. ఏవైనా షెడ్యూల్ మార్పులు ఉంటే వాటి గురించి మేము మీకు తెలియజేస్తాము. కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము... టీం ఇండిగో`` అంటూ రిప్లయ్ వచ్చింది.
ప్రస్తుత గందరగోళాన్ని సరిదిద్దేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దిద్దుబాటు చర్యలను అమలు చేయాలని ఇండిగోను ఆదేశించింది. ప్రయాణీకులు ఎయిర్‌లైన్ యాప్ ద్వారా ఆలస్యాలను ట్రాక్ చేయవచ్చని ..విమానం రద్దయిన సందర్భంలో వారికి డబ్బు పూర్తి వాపసులకు అర్హత ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు. మార్గమధ్యంలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు హోటల్ వసతి, సీనియర్ సిటిజన్లకు లాంజ్ యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. వేచి ఉన్నవారికి రిఫ్రెష్‌మెంట్‌లు అందిస్తామని కూడా ప్రకటించింది. గందరగోళాన్ని నివారించేందుకు. డిజిసిఏ తాత్కాళికంగా ఇండిగోకు కొన్ని సిబ్బంది విధి నిబంధనల నుండి ఒకేసారి తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది.
