పక్క రాష్ట్రాల బాట పట్టిన హాట్ బ్యూటీ!
సక్సెస్ తర్వాత వెనుదిరగడం అన్నది ఏ నటి విషయంలోనూ పెద్దగా జరగదు. హిట్ ఇచ్చిన కిక్ లో మరో నాలుగు ప్రాజెక్ట్ లకు టపీ టపీ సైన్ చేస్తుంది.
By: Srikanth Kontham | 17 Dec 2025 8:30 AM ISTసక్సెస్ తర్వాత వెనుదిరగడం అన్నది ఏ నటి విషయంలోనూ పెద్దగా జరగదు. హిట్ ఇచ్చిన కిక్ లో మరో నాలుగు ప్రాజెక్ట్ లకు టపీ టపీ సైన్ చేస్తుంది. అడ్వాన్సులు అందుకుంటుంది. అవిసెట్స్ లో ఉండగానే పరభాషల వైపు ఆసక్తి చూపిస్తుంది. కానీ మెహరీన్ పిర్జాదా విషయంలో మాత్రం అలాంటి సన్నివేశం చోటు చేసుకోలేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ గాధ`తో వెండి తెరకు పరిచయమైన మెహరీన్ కు తొలి సినిమా తేడా కొట్టినా? కెరీర్ లో చెప్పుకో దగ్గ సక్సెస్ లు చాలా ఉన్నాయి. `మహానుభావుడు`, `రాజా ది గ్రేట్` తో బ్యాక్ టూ బ్యాక్ సక్సస్ లు అందుకుంది.
200 కోట్ల వసూళ్ల ప్రాంచైజీలో:
మధ్యలో వరుసగా కొన్ని పరాజయాలు ఎదురైనా గత రెండు విజయాలు మళ్లీ `ఎఫ్ 2` లో ఛాన్స్ కు బీజం వేసాయి.
అందులో వరుణ్ తేజ్ కు జోడీగా నటించి గ్రాండ్ విక్టరీ అందుకుంది. ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇదే ఊపులో ఆరేడు సినిమాలు చేసింది. వాటిలో `మంచి రోజులొచ్చాయి` ఒక్కటే సక్సెస్ అయింది. ఆ వెంటనే `ఎఫ్ 2`కి సీక్వెల్ గా తెరకెక్కిన `ఎఫ్ 3`లోనూ ఛాన్స్ అందుకుంది. ఈసినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇదీ 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ విజయం తర్వాత మెహరీన్ అనూహ్యంగా మాయమైంది.
వైఫల్యంతో కాదు సక్సస్ తో:
ఆ తర్వాత మళ్లీ మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. సక్సెస్ వచ్చిన తర్వాత సినిమా చేయని నటిగా మిగిలిపోయింది. చాలా మంది వైఫల్యంతో వెను దిరుగుతారు. కానీ మెహరీన్ మాత్రం సక్సెస్ తో వెనుదిరిగింది.
మరి అవకాశాలు వచ్చినా తానే నో చెప్పిందా? లేక ఛాన్సులు రాక ప్రత్యామ్నాయం చూసుకుందా? అన్నది తెలియదు. `ఎఫ్ 3` తర్వాత `స్పార్క్ లైఫ్` అనే ఓ చిన్న చిత్రం చేసింది. కానీ అది మెహరీన్ ఇమేజ్ తగ్గ చిత్రం కాదు. ఆ సినిమా గురించి జనాలకు కూడా తెలియదు. ఈ ఏడాది `ఇంద్ర `అనే తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
శాండిల్ వుడ్ లో ఎంట్రీ:
ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో అమ్మడిప్పుడు కన్నడలో అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడింది. `నీ సిగు వెరుగ్` అనే చిత్రంలో నటిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ప్రారంభమై నెలలు గడుస్తోంది. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. కొత్త ఏడాది ఆ సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకొస్తుందేమో చూడాలి. మరి ఇదే ఏడాది మళ్లీ టాలీవుడ్ కంబ్యాక్ ప్రయత్నాలు చేస్తుందా? అన్నది చూడాలి.
