Begin typing your search above and press return to search.

లెజెండ‌రీ కమెడియన్ జ్ఞాపకాలు!

ఆ మహానటుడి వ్యక్తిగత జీవితం .. ఆయనతో ఉన్న అనుబంధం గురించి ఆయన మేనల్లుడు అకార్ అలీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

By:  Srikanth Kontham   |   24 July 2026 8:00 AM IST
లెజెండ‌రీ కమెడియన్  జ్ఞాపకాలు!
X

బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో హాస్యానికి సరికొత్త నిర్వచనం చెప్పిన లెజెండరీ నటుడు మహమూద్ అలీ. ఆయ‌న కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అలీ నటనలో వైవిధ్యం, అద్భుతమైన టైమింగ్ ప్రదర్శించిన సినిమాల్లో `పడోసన్` అత్యంత ప్రసిద్ధమైనది. ఇందులో ఆయన పోషించిన మాస్టర్ పిళ్లై పాత్ర ఇండస్ట్రీలో క్లాసిక్‌గా నిలిచింది. అలాగే `బంబై కా బాబూ`, `గుమ్నామ్` , `భూత్ బంగ్లా` ,`కున్వారా బాప్` వంటి చిత్రాలు ఆయ‌న్ని నటుడిగా .. దర్శకుడిగా ఎంత ప్రతిభావంతుడో నిరూపించాయి.

కేవలం నవ్వులు పంచడమే కాకుండా కొన్ని చిత్రాలలో భావోద్వేగాలతో కూడిన పాత్రలను పోషించి తనలోని నటుడిని పూర్తిస్థాయిలో ఆవిష్కరించిన ఘనత ఆయనది. తాజాగా మహమూద్ అలీకి సంబంధించిన అరుదైన జ్ఞాపకాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మహానటుడి వ్యక్తిగత జీవితం .. ఆయనతో ఉన్న అనుబంధం గురించి ఆయన మేనల్లుడు అకార్ అలీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మహమూద్ అలీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గుర‌య్యారు. మహమూద్ అలీతో గడిపిన ప్రతీ క్షణం ఎంతో ప్రత్యేకంగా ఉండేదని.. ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఎప్పుడూ బోరింగ్ వాతావరణం ఉండేది కాద‌ని అకార్ అలీ గుర్తుచేసుకున్నారు.

ఆన్-స్క్రీన్ పైనే కాకుండా? రియల్ లైఫ్‌లోనూ మహమూద్ అలీ ఉత్సాహంగా.. జోవియల్‌గా ఉండేవారని తెలిపారు. షూటింగ్ సెట్స్‌లో.. ఇంటి వద్ద కూడా అందరినీ నవ్విస్తూ వాతావరణాన్ని ఎంతో ఉల్లాసంగా ఉంచేవారన్నారు. వెండితెరపై హాస్యనటుడిగా తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న మహమూద్ అలీ తెర వెనుక మాత్రం ఎంతో గొప్ప మానవతావాదిగా ఉండేవారని కుటుంబ సభ్యులు తరచూ చెబుతుంటారు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండేవారని, ఎంతోమంది నూతన నటీనటులకు, టెక్నీషియన్లకు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అండగా నిలిచారని అకార్ అలీ కొనియాడారు. ఆయనలోని ఆ పెద్ద మనసే ఆయనను సాధారణ నటుడి నుంచి మహానటుడిగా మార్చిందని అభిప్రాయపడ్డారు.

అప్పట్లోనే విభిన్న పాత్రలు పోషించి హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న ఘనత మహమూద్ అలీకి దక్కుతుంది. ఆయన నటనలోని సహజత్వం, బాడీ లాంగ్వేజ్ , టైమింగ్ నేటి తరానికి కూడా మాన్యువల్ లాంటివని విశ్లేషకులు చెబుతుంటారు. తన మేనమామ నుంచి తాను నేర్చుకున్న విలువలు, జీవిత పాఠాలు తన జీవితంలో ఎంతో మార్పు తెచ్చాయని అకార్ అలీ గర్వంగా పంచుకున్నారు.

కాలం ఎంత మారినా,? ఎంతో మంది కొత్త హాస్యనటులు వస్తున్నప్పటికీ మహమూద్ అలీ సృష్టించిన మేజిక్ మాత్రం ఎప్పటికీ చెరగనిది. ఆయన చిత్రాలు నేటికీ ప్రేక్షకులకు నవ్వులను పంచుతూనే ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవితంలోని సరదా సంఘటనలు, కుటుంబ సభ్యులతో గడిపిన మధుర క్షణాలు ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా బయటకు రావడంతో అభిమానులకు వారిలో ఆరాధ్య నటుడి కోణం పరిచయమవుతోంది. వెండితెరను నవ్వులతో ముంచెత్తిన ఆ దిగ్గజ నటుడి ఘనకీర్తి తరాలు మారినా ఎప్పటికీ పదిలంగా ఉంటుం దనడంలో ఎలాంటి సందేహం లేదు.