ఆస్మాన్ టీజర్: మేఘాంశ్ ఈసారి మిస్టరీ యాక్షన్
రెగ్యులర్ స్టైల్ లో కాకుండా పూర్తి భిన్నంగా, మేఘాంశ్ ఈసారి ఒక రస్టిక్ అండ్ ఇంటెన్స్ అవతారంలో కనిపిస్తున్నాడు.
By: M Prashanth | 16 Sept 2026 12:42 PM ISTదివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా రామ్ నందన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఆస్మాన్. శ్రీ క్లిన్ కారా సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రెగ్యులర్ స్టైల్ లో కాకుండా పూర్తి భిన్నంగా, మేఘాంశ్ ఈసారి ఒక రస్టిక్ అండ్ ఇంటెన్స్ అవతారంలో కనిపిస్తున్నాడు.
టీజర్ ఓపెనింగ్ చాలా మిస్టీరియస్‌గా ప్లాన్ చేశారు. గొంగళి పురుగు దశ నుంచి సీతాకోకచిలుకలా మారాలంటూ వినిపించే ఒక వాయిస్‌ఓవర్‌తో పాటు చర్చి, కొవ్వొత్తులు, రహస్య ప్రార్థనలు చేసే ఒక డార్క్ గ్రూప్ విజువల్స్ క్యూరియాసిటీ పెంచుతాయి. ఇట్స్ మై టైమ్ అంటూ మొదలయ్యే సీన్లు, ఎర్రటి ముసుగులు ధరించిన మనుషులు పంట పొలాల్లో నడిచే షాట్లు సినిమాలో ఏదో డార్క్ మిస్టరీ ఎలిమెంట్ ఉందని హైలెట్ చేస్తున్నాయి.
ఈ మిస్టరీ సెటప్ మధ్యలోకి హీరో మేఘాంశ్, హీరోయిన్ నడుమ సాగే లవ్ ట్రాక్‌ను పరిచయం చేశారు. ఆరంభంలో కలర్‌ఫుల్‌గా కనిపించిన వారి బంధం, ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ గొడవలు, కిడ్నాప్ తరహా సన్నివేశాలతో సీరియస్ గా మారుతుంది. చేతిలో కాగడా పట్టుకుని యాక్షన్ లోకి దిగే హీరో షాట్ మరో హైలెట్. లాగే అతడు వ్యవస్థపై తిరగబడే తీరును కూడా రివీల్ చేసినట్లు అనిపిస్తోంది.
యాక్షన్ పరంగా టీజర్ బాగానే సౌండ్ చేసింది. విలన్ గ్యాంగ్స్‌తో హీరో తలపడే స్టంట్ సీక్వెన్సులు, ఫైట్ కంపోజిషన్లు రా అండ్ రస్టిక్ టోన్‌లో సాగాయి. మేఘాంశ్ లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కాస్త రఫ్‌గా, ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాయి. తన వాళ్ల కోసం లేదా నమ్మిన సిద్ధాంతం కోసం అతడు చేసే వేట చుట్టూ యాక్షన్ డ్రామా నడిచేలా అనిపిస్తోంది. సాంకేతిక వర్గం అందించిన ఔట్‌పుట్ టీజర్‌కు మరో ప్లస్ పాయింట్.
ప్రశాంత్ విహారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ మిస్టీరియస్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. శోయాబ్ కెమెరా పనితనం, ధని ఏలే ఆర్ట్ వర్క్ సినిమాలోని డార్క్ అండ్ రా అట్మాస్ఫియర్‌ను సహజంగా తెరపైకి తీసుకొచ్చాయి. నిర్మాణ విలువలు సినిమా జానర్‌కు తగ్గట్లుగా రిచ్‌గానే ఉన్నాయి. ఓవరాల్‌గా ఆస్మాన్ టీజర్ ఒక మిస్టరీ కల్ట్ యాక్షన్ థ్రిల్లర్ అనే ఫీల్ ను కలిగించడంలో సక్సెస్ అయింది. అయితే ఈ రహస్య ముఠా నేపథ్యం, కథలోని అసలు కాన్‌ఫ్లిక్ట్ థియేటర్లలో ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేదే చూడాలి. రామ్ నందన్ స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటే మాత్రం, మేఘాంశ్ కెరీర్‌కు ఈ ప్రాజెక్ట్ మంచి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
