Begin typing your search above and press return to search.

మెగావర్స్‌లో ఊహించని కాంబినేషన్స్!

బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’కు వచ్చిన ఆదరణ నేపథ్యంలో చిరంజీవి హోస్ట్‌గా ‘మెగావర్స్’ టాక్ షోపై ఆసక్తి పెరుగుతోంది. ఇందులో సోలో ఎపిసోడ్‌లతో పాటు ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది సెలబ్రిటీలతో ప్రత్యేక ఎపిసోడ్‌లు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాగార్జున, కమల్ హాసన్ పేర్లు వినిపిస్తుండగా, హరీశ్ శంకర్ ప్రోమోలకు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   20 Nov 2026 10:52 PM IST
మెగావర్స్‌లో ఊహించని కాంబినేషన్స్!
X

తెలుగు ఓటీటీ ప్రపంచంలో టాక్ షోలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు, సినిమా విశేషాలు, సరదా సంభాషణలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ బ్లాక్ బస్టర్ ఆదరణ సంపాదించుకుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా మెగావర్స్ పేరుతో కొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో అన్‌స్టాపబుల్, మెగావర్స్ షోల మధ్య పోలికలు మొదలయ్యాయి.

బాలకృష్ణ తనదైన మాటతీరు, చమత్కారాలు, సెలబ్రిటీలతో సన్నిహితంగా మాట్లాడే విధానంతో అన్‌స్టాపబుల్‌ను విజయవంతం చేశారు. ఈ షోలో పలువురు స్టార్ హీరోలు, దర్శకులు, నటీనటులు పాల్గొని తమ జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అందుకే ఈ షోకు ఓటీటీలో మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇప్పుడు అదే స్థాయిలో మెగావర్స్ కూడా వినోదాన్ని అందిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే మెగావర్స్ విషయంలో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రణాళికలు.. ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో సెలబ్రిటీలతో సోలో ఎపిసోడ్స్ మాత్రమే కాకుండా, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అన్‌స్టాపబుల్‌లో ఒక్కొక్కరుగా కనిపించిన కొందరు సెలబ్రిటీలు ఇప్పుడు మెగావర్స్‌లో ఇతర స్టార్స్‌తో కలిసి సందడి చేయనున్నట్లు ఒక వార్త గట్టిగా వినిపిస్తోంది. అలాగే బాలయ్య షోలో ఇప్పటివరకు పాల్గొనని కొందరు ప్రముఖులకు కూడా ఈ కొత్త షోలో తీసుకోరానన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా అక్కినేని నాగార్జున, కమల్ హాసన్ పేర్లు మెగావర్స్‌కు సంబంధించి వినిపిస్తుండటం ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు మెగావర్స్ ప్రోమోల విషయంలో కూడా ఒక ఆసక్తికరమైన వార్త ప్రచారంలో ఉంది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ షో ప్రోమోలకు దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. తన సినిమాల్లో స్టార్ హీరోలను ఎనర్జిటిక్‌గా చూపించడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉంది. అదే తరహాలో చిరంజీవిని కొత్త లుక్‌లో, ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ప్రెజెంట్ చేస్తే ప్రోమోలకు మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. ఇక డిసెంబర్ నుంచి మెగావర్స్ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.