Begin typing your search above and press return to search.

వీడియో: మెగా బాస్ 158 ముహూర్తం.. ఇలా చూస్తే కుళ్లుకు చ‌స్తారు!

టాలీవుడ్ చిత్రసీమలో స్వయంకృషితో పైకి వచ్చి దశాబ్దాలుగా బాక్సాఫీస్ సెన్సేషన్‌గా నిలిచిన ఏకైక మేటి కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి.

By:  Sivaji Kontham   |   17 May 2026 11:47 PM IST
వీడియో: మెగా బాస్ 158 ముహూర్తం.. ఇలా చూస్తే కుళ్లుకు చ‌స్తారు!
X

టాలీవుడ్ చిత్రసీమలో స్వయంకృషితో పైకి వచ్చి దశాబ్దాలుగా బాక్సాఫీస్ సెన్సేషన్‌గా నిలిచిన ఏకైక మేటి కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. హార్డ్ వర్క్, అంకితభావం, తిరుగులేని కమిట్‌మెంట్‌కు ఆయన నిలువెత్తు నిదర్శనం. ప్రస్తుతం 60 ప్లస్ వయసులోనూ కుర్ర హీరోలకు సైతం పోటీనిస్తూ మెగా బాస్ చూపిస్తున్న జోష్, ఎనర్జీ చూస్తుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తన తదుపరి ప్రాజెక్టుల కోసం నిరంతరం ఫిజిక్‌ను మార్చుకుంటూ.. జిమ్‌లో ఆయన పడుతున్న శ్రమ చూసి అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.

ఏదీ సులువుగా రాదని, కష్టపడటం ఒక్కటే విజయానికి రాజమార్గమని నమ్మి దానిని ఆచ‌రించి ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు మెగా బాస్. తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన‌ ఓ అదిరిపోయే వర్కవుట్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ``ప్రతీ రోజు మన సరిహద్దులను దాటి ముందుకు సాగడానికి లభించే మరో అవకాశం`` అంటూ చిరంజీవి కొణిదెల పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తన తదుపరి చిత్రం కోసం మెగాస్టార్ ప్రిపరేషన్ ఏ రేంజ్‌లో ఉందో ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.

బ్లాక్‌బస్టర్ `వాల్తేరు వీరయ్య` తర్వాత మెగాస్టార్ చిరంజీవి- దర్శకుడు బాబీ కొల్లి (#ChiruBobby2) కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాత్కాలికంగా `మెగా 158` అని పిలుస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని.. చిరంజీవిని మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో చూపించడానికి బాబీ సర్వం సిద్ధం చేశారని తెలుస్తోంది.

నిజానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఏప్రిల్ 2026 లోనే జరగాల్సి ఉన్నా.. కొన్ని నిర్మాణపరమైన కారణాల వల్ల వాయిదా పడింది. అయితే అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మెగాస్టార్ స్వయంగా అధికారిక అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమా ఘనమైన ముహూర్తపు వేడుకను మే 21న నిర్వహించబోతున్నట్లు చిరంజీవి వెల్లడించారు. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం.

మెగాస్టార్ షేర్ చేసిన ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ``అన్నయ్యా.. మీ వయసుకు.. మీరు చేసే పనులకు ఏమైనా సంబంధం ఉందా? మీరు ఇలాంటి పోస్టులు పెడితే కొందరు కుళ్లుకుని ఏడుస్తారు`` అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతుంటే.. మరికొందరేమో కొత్త సినిమా లుక్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండాలని కోరుకుంటున్నారు. ఏదేమైనా మే 21న ఓపెనింగ్ కార్య‌క్ర‌మంతో టాలీవుడ్‌లో సరికొత్త ప్రకంపనలు సృష్టించడానికి మెగా బాస్ సిద్ధమైపోయారు. త‌దుప‌రి త‌న విశ్వంభ‌ర రిలీజ్ ప్ర‌మోష‌న్స్ కోసం చిరు బిగ్ ప్లానింగ్ తో ఉన్నార‌ని తెలుస్తోంది.