బర్త్ డే కు ఆ సాంగ్ వస్తే బ్లాస్టే!
మెగా157 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా, ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడులో జరుగుతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 6 Aug 2025 11:25 AM ISTఆరు పదుల వయసులో కూడా చిరంజీవి సినిమాల విషయంలో పరుగులు పెడుతున్నారు. రీసెంట్ గా విశ్వంభర సినిమాను పూర్తి చేసిన మెగాస్టార్, టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మెగా157 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా, ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడులో జరుగుతుంది.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మెగా157
ఎంతో వేగంగా సినిమాలను పూర్తి చేస్తాడనే పేరున్న అనిల్ రావిపూడి మెగా157ను తన గత సినిమాల కంటే వేగంగా పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. తన స్పీడుతో ఏకంగా మెగాస్టార్ నే ఆశ్చర్యపరుస్తున్నారు అనిల్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత అనిల్ చేస్తున్న సినిమా కావడంతో పాటూ మెగాస్టార్ చిరంజీవితో అనిల్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో మెగా157పై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి.
రీసెంట్ గానే కేరళ షెడ్యూల్ పూర్తి
మెగా157లో చిరంజీవికి జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు షెడ్యూల్స్ ను పూర్తి చేసిన అనిల్, రీసెంట్ గా కేరళలో ఓ షెడ్యూల్ ను ప్లాన్ చేసి అక్కడ చిరంజీవి, నయనతార పై ఓ కలర్‌ఫుల్ మెలోడీని కూడా షూట్ చేశారు. పెళ్లి సందడిగా సాగే ఈ డ్యూయెట్ ఓ సంబరంలా ఉంటుందని చిత్ర యూనిట్ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తోంది.
చిరూ బర్త్‌డే కానుకగా.. ఆ స్పెషల్ సాంగ్
భీమ్స్ సిసిరోలియా సంగీతం అందించిన ఈ సాంగ్ కు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా ఆ పాటలో చిరూ చాలా స్టైలిష్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. సాంగ్ లోని విజువల్స్ అందరినీ కచ్ఛితంగా అలరిస్తాయని మూవీ యూనిట్ ఎన్నో ఎలివేషన్స్ ఇస్తున్న ఆ సాంగ్ ను ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే కానుకగా రిలీజ్ చేసి తుఫాను సృష్టించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది.
సంక్రాంతి టార్గెట్ గా
అయితే చిరంజీవి బర్త్ డే కానుకగా ఈ సినిమా నుంచి ఓ చిన్న గ్లింప్స్ తో పాటూ టైటిల్, రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని ఇప్పటికే టాక్ వినిపిస్తుండగా, మరి సాంగ్ ను రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. 2026 సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా మెగా157ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
