సంక్రాంతి సంబరాలు: చిరంజీవి-రజనీ కూడబలుక్కున్నారు
పండుగ సందర్భంగా పోయెస్ గార్డెన్‌లోని తన ఇంటి వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానుల కోసం రజనీకాంత్ బయటకు వచ్చి అభివాదం చేశారు.
By: Sivaji Kontham | 16 Jan 2026 1:23 PM ISTఈసారి మెగా సంక్రాంతిని బెంగళూరు ఫామ్ హౌస్ లో కాకుండా, మెగాస్టార్ చిరంజీవి నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్ ఇంట్లో గ్రాండ్ గా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, సుస్మిత, నిహారిక, సాయిధరమ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ తదితర కజిన్స్ అంతా రుచికరమైన దోసెలతో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన వీడియో కూడా వైరల్ అయింది. మన శంకరవరప్రసాద్ గారు గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో చిరు రెట్టించిన ఉత్సాహంతో ప్రమోషన్స్ లో పాల్గొంటూనే ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
మరోవైపు చిరంజీవి స్నేహితుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ సంక్రాంతి -2026 వేడుకలను తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఘనంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజనీకాంత్ కుటుంబం కూడా బెంగళూరు సమీపంలోని ఫామ్ హౌస్ లో ఇలాంటి వేడుకలను జరుపుకోవడం నిత్యకృత్యం. కానీ ఈసారి అందుకు భిన్నంగా, చెన్నైలోని తన నివాసంలో రజనీకాంత్ తన ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. అయితే ఇంట్లో పాలు పొంగే సమయంలో కుటుంబమంతా కలిసి ఆనందంతో ప్లేట్లపై స్పూన్లతో శబ్దం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో రజనీకాంత్ ఎప్పటిలాగే ఎంతో నిరాడంబరంగా తెల్లటి సిల్క్ షర్ట్, పంచె (వేష్టి) ధరించి కనిపించారు.
పండుగ సందర్భంగా పోయెస్ గార్డెన్‌లోని తన ఇంటి వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానుల కోసం రజనీకాంత్ బయటకు వచ్చి అభివాదం చేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులే ఈ దేశానికి వెన్నెముక.. వారు సంతోషంగా ఉంటేనే దేశం బాగుంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
తలైవా 173 ప్రకటనతో ఉత్సాహం:
ఈ సంక్రాంతి పండుగ వేళ అభిమానులకు రజనీకాంత్ ఒక తీపి కబురు అందించారు. తన స్నేహితుడు కమల్ హాసన్ నిర్మాణంలో, సిబి చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కనున్న తన తదుపరి చిత్రం తలైవార్ 173 షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని అధికారికంగా ప్రకటించారు. మరోసారి రజనీ పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్ లో నటిస్తున్నాని వెల్లడించారు. మరోవైపు సూపర్ స్టార్ నటించిన `జైలర్ 2` చిత్రం 12 జూన్ 2026న విడుదల కానుంది. ఈసారి స్నేహితులు చిరంజీవి, రజనీ ఇద్దరూ తమ కుటుంబాలతో ఇంటి వద్దనే సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చూసిన అభిమానులు, ఇద్దరూ కూడబలుక్కున్నారు! అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. పండగల్లోనే కాదు, కలిసి ఓ మల్టీస్టారర్ లో నటించేందుకు కూడా ఆ ఇద్దరూ కూడబలుక్కుంటే బావుంటుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
