Begin typing your search above and press return to search.

కొణిదెల ఫ్యామిలీ షో.. ఆఫ్టర్ ఏపీ అసెంబ్లీ కాంట్రవర్సీ.. పెద్దనయ్యా ఆశీస్సులు..

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ వంటి యువ హీరోలు హాజరయ్యారు.

By:  A.N.Kumar   |   30 Sept 2025 10:01 AM IST
కొణిదెల ఫ్యామిలీ షో.. ఆఫ్టర్ ఏపీ అసెంబ్లీ కాంట్రవర్సీ.. పెద్దనయ్యా ఆశీస్సులు..
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసిన కొణిదెల కుటుంబం, తాజాగా సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన సందర్భంగా ...పెద్దన్నయ్య చిరంజీవి విదేశాల నుంచి ఇండియా తిరిగి వచ్చాక కొణిదెల ఫామిలీ కోసం ప్రత్యేక ప్రదర్శన చేసారు ప్రసాద్ లాబ్స్ లో ఇది ఒక సాధారణ సినిమా వేడుకగా లా కాకుండా, కుటుంబ ఐక్యతకు, రాజకీయ విమర్శలకు దీటైన సమాధానంగా నిలిచింది. ముఖ్యంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల వల్ల తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఈ మెగా ఫ్యామిలీ గెట్-టుగెదర్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

మెగా పవర్ షో: ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్‌కు అండగా

సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో 'ఓజీ' స్పెషల్ స్క్రీనింగ్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ వంటి యువ హీరోలు హాజరయ్యారు. చిరంజీవి మనవరాళ్లు, పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆద్య కూడా పాల్గొనడం అభిమానులకు ప్రత్యేక ఆనందాన్నిచ్చింది.

బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలతో మెగా ఫ్యాన్స్ భగ్గుమన్నారు. బాలయ్య క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక వైసీపీ అయితే తన అన్నయ్య చిరంజీవిని బాలయ్య అన్ని మాటలు అన్నా పవన్ కళ్యాణ్ స్పందించడం లేదంటూ మీడియా, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్ని వైపులా ఒత్తిడి పెరిగిపోయిన ఈ రాజకీయ అనిశ్చితి, విమర్శలు పవన్ చుట్టూ పెరిగిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్కచోట చేరిన ఈ దృశ్యం.. 'తామంతా పవన్ కళ్యాణ్‌కు అండగా ఉన్నాం' అనే సందేశాన్ని బలంగా పంపించింది అని సినీ, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

'పెద్దనయ్యా' ఆశీస్సులు: చిరంజీవి–పవన్ కళ్యాణ్–చరణ్ ఒకే ఫ్రేమ్‌లో

స్క్రీనింగ్ అనంతరం బయటకు వస్తున్న సమయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లు నవ్వుతూ మాట్లాడుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో ఎన్ని విమర్శలు ఎదురైనా, అన్నయ్య చిరంజీవి ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటారనే సంకేతాలను ఈ భేటీ స్పష్టం చేసింది. సినిమా విజయం ద్వారా పవన్ సాధించిన తాజా ఊపుకు మెగాస్టార్ ఆశీస్సులు అదనపు బలాన్ని చేకూర్చాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ 'పెద్దనయ్యా' ఆశీర్వచనం ఫ్రేమ్... కేవలం సినీ విజయాన్ని మాత్రమే కాక, రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఫ్యామిలీ సపోర్ట్‌ను కూడా ప్రతిబింబిస్తోందని విశ్లేషణలు చెబుతున్నాయి.

అసెంబ్లీ వివాదం: చిరంజీవి 'కూల్' కౌంటర్, మౌనమే తుది సమాధానమా?

'ఓజీ' విజయోత్సవం ఒకవైపు ఉంటే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తలెత్తిన వివాదం మరోవైపు మెగా ఫ్యామిలీపై దృష్టిని మళ్లించింది. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, గత సీఎం జగన్ ను కలిసిన సమయంలో నాటి విషయాలను ప్రస్తావిస్తూ చిరంజీవిపై కామెంట్స్ చేశారు. గతంలో సినీ ప్రముఖులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవడంపై చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు దుమారం రేపాయి.

బాలయ్య వ్యాఖ్యలు – చిరంజీవి స్పందన

బాలకృష్ణ "ఎవడు అక్కడ గట్టిగా అడగలేదు.. ఆయనేదో గట్టిగా అడిగితే వచ్చాడట" అంటూ పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. దీనిపై మెగాస్టార్ చిరంజీవి వెంటనే స్పందిస్తూ తాను గౌరవం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో మాట్లాడానని, అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే వెళ్లానని వివరించారు. "నేను గట్టిగా మాట్లాడితే జగన్ దిగివచ్చారన్నది అబద్ధం.. సీఎం అయినా, సామాన్యుడైనా నా సహజ ధోరణిలో గౌరవం ఇచ్చి పుచ్చుకునేలా మాట్లాడతా" అని చిరంజీవి స్పష్టం చేశారు. ముఖ్యంగా, "నా చొరవ వల్లే టికెట్ల రేట్లు పెరిగాయి. అందుకు అక్కడున్నవారంతా సాక్షులే. నా వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలకు టికెట్లు పెరిగాయి" అని బాలకృష్ణ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

చిరంజీవి పాత లేఖే తుది సమాధానమా?

గతంలో బాలకృష్ణ వ్యాఖ్యలు చేసినప్పుడు చిరంజీవి ఒక బహిరంగ లేఖ విడుదల చేసి, తన అభిప్రాయాన్ని, ఆవేదనను తెలియజేశారు. తాజాగా మీడియా ఈ అంశాన్ని మరోసారి విదేశాల నుంచి వచ్చిన చిరంజీవి వద్ద ప్రస్తావించినప్పుడు, చిరంజీవి కొత్తగా వ్యాఖ్యానించకుండా "చెప్పాల్సింది చెప్పాను" అని మాత్రమే పేర్కొనడం గమనార్హం.

ఈ వ్యాఖ్యతో తన పాత లేఖనే ఈ వివాదానికి తన తరపున తుది సమాధానంగా మెగాస్టార్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ అంశంపై మరింత చర్చకు, వివాదానికి ఆయన తావివ్వదలుచుకోలేదని తెలుస్తోంది. చిరంజీవి తన కూల్‌ అండ్ సింపుల్ స్టైల్‌తో ఈ వివాదాన్ని మళ్లీ రగల్చకుండా ముగించే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అభిమానుల డిమాండ్: బాలయ్య క్షమాపణ చెప్పాల్సిందే!

చిరంజీవి లేఖ విడుదలైన తర్వాత మెగా అభిమానులు బాలకృష్ణ తన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా ఏపీ వ్యాప్తంగా 300 పోలీస్ స్టేషన్లలో బాలయ్యపై ఫిర్యాదుకు రెడీ అయ్యి ఈ వివాదాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాలని చూశారు. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యారు. అయితే చిరంజీవి వెంటనే తన అభిమాన సంఘం నేతలకు ఫోన్ చేసి ప్రతీకారాలు వద్దంటూ ఫిర్యాదులను ఆపించేశారు.

అయితే ఈ అంశంపై బాలకృష్ణ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. సినీ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠ... బాలకృష్ణ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలని సినీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.

'ఓజీ' ప్రస్థానం: బజ్ పెంచిన మెగా కుటుంబం

'ఓజీ' సినిమా విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ నటన, సుజీత్ దర్శకత్వం, థమన్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమాకు, మెగా ఫ్యామిలీ ఈ ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొనడం మరింత బజ్ పెంచింది.

మొత్తం మీద, ఈ మెగా ఫ్యామిలీ గెట్-టుగెదర్ పవన్ కళ్యాణ్ సినీ విజయాన్ని ఉత్సవంగా జరుపుకుంటూనే, రాజకీయ విమర్శలకు కుటుంబ ఐక్యతతో బదులిచ్చిన 'పవర్ ఫుల్ షో'గా నిలిచింది.