మెగా హీరోలంతా వెయిటింగ్ దానికోసమే.. ఏం చేస్తారో?
మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు వచ్చిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 14 Aug 2025 11:00 PM ISTమెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు వచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవి నుంచి వైష్ణవ్ తేజ్ వరకు.. ఇప్పటికే పలువురు కథానాయకులు ఎంట్రీ ఇచ్చారు. తమ టాలెంట్ తో అందరినీ మెప్పించారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. పలు హిట్స్ కూడా అందుకున్నారు.
సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకు అయినా హిట్లు, ఫ్లాపులు సహజం. ఆడియన్స్ ను మెప్పించేందుకే సినిమాలు తీసినా.. ఎంతో కష్టపడినా.. కొన్నిసార్లు అనుకున్నది జరగదు. ఇప్పుడు మెగా హీరోల విషయంలో కూడా అదే జరిగింది. కొంతకాలంగా ఫ్లాపులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు.
చిరంజీవి చివరగా భోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ సరైన హిట్ ను అందుకోలేకపోయారు. ఇప్పుడు విశ్వంభరతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో అనిల్ రావిపూడితో మూవీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ముందుగా విశ్వంభరతో వచ్చి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ ను అందుకోవాలని చూస్తున్నారు.
అదే సమయంలో పవన్ కళ్యాణ్.. రీసెంట్ గా హరిహర వీరమల్లు మూవీతో థియేటర్స్ లో సందడి చేశారు. కానీ ఆ సినిమాతో మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకున్నారు. ఇప్పుడు ఓజీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన సినిమా రిలీజ్ కానుండగా.. సరైన హిట్ దక్కించుకోవాలని చూస్తున్నారు.
రీసెంట్ గా గేమ్ ఛేంజర్ తో డిజాస్టర్ ను ఫేస్ చేసిన రామ్ చరణ్.. ఇప్పుడు ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ ను సొంతం చేసుకోవాలని కష్టపడుతున్నారు. పెద్ది మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఆ మూవీ.. వచ్చే ఏడాది చరణ్ బర్త్ డే కానుకగా రిలీజ్ కానుంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వరుసగా ఫ్లాపులు మూటగట్టుకుంటున్నారు. ఇప్పుడు కొరియన్- ఇండియా జోనర్ లో రూపొందుతున్న మూవీలో నటిస్తున్నారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ది కూడా అదే పొజిషన్. సంబరాల ఏటి గట్టు మూవీతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు.
మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. ఆదికేశవ సినిమా తర్వాత అసలు సినిమాలే చేయలేదు. మొత్తానికి మెగా ఫ్యామిలీ హీరోలంతా సూపర్ హిట్స్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు. మరి మెగా హీరోలంతా ఎలాంటి విజయాలు సొంతం చేసుకుంటారో వేచి చూడాలి.
