Begin typing your search above and press return to search.

మెగా అభిమానుల్లో ఆందోళన.. వరుసగా ఎందుకలా?

మెగా ఫ్యామిలీ అభిమానుల్లో ఇప్పుడు కొంత ఆందోళన కనిపిస్తోంది. కారణం.. అదే కుటుంబానికి చెందిన పలువురు హీరోలు వరుసగా ఆరోగ్య సమస్యలు, గాయాలు ఎదుర్కొనడం.

By:  M Prashanth   |   19 April 2026 10:19 PM IST
మెగా అభిమానుల్లో ఆందోళన.. వరుసగా ఎందుకలా?
X

మెగా ఫ్యామిలీ అభిమానుల్లో ఇప్పుడు కొంత ఆందోళన కనిపిస్తోంది. కారణం.. అదే కుటుంబానికి చెందిన పలువురు హీరోలు వరుసగా ఆరోగ్య సమస్యలు, గాయాలు ఎదుర్కొనడం. 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు మెగా హీరోల్లో ముగ్గురికి శస్త్రచికిత్సలు జరగడం, మరొకరు షూటింగ్‌ లో గాయపడటం వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరడం అభిమానుల్లో ఆందోళన మరింత పెంచింది. శుక్రవారం ఉదయం అధికారులతో సమావేశంలో పాల్గొంటున్న సమయంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు శనివారం సాయంత్రం శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

కనీసం పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఆ వార్త బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అంతకుముందు వరుణ్ తేజ్ కూడా గాయంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మిస్తున్న బరి సినిమా షూటింగ్ సందర్భంగా వాలీబాల్ సాధన చేస్తుండగా ఆయన కాలికి గాయమైంది.

గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటూ, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇటీవల షూటింగ్ సమయంలో గాయపడ్డారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా షూటింగ్‌ లో భాగంగా ఆయన ఎడమ కంటికి స్వల్ప గాయం అయింది.

ఆ సమయంలో ఆయన పుట్టినరోజు వేడుకల్లో కూడా బ్యాండేజ్‌ తో కనిపించడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అయితే ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకుని తిరిగి షూటింగ్‌ లో పాల్గొంటున్నారు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యం గురించి వార్తలు కూడా ఇటీవల వైరల్ అయ్యాయి. ఆయన భుజానికి లేదా మోకాలి సమస్యకు శస్త్రచికిత్స జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను నిర్మాతలు ఖండించారు. అధికారికంగా ఎలాంటి సర్జరీ జరగలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ రూమర్స్ కూడా అభిమానుల్లో కాస్త టెన్షన్‌ కు కారణమయ్యాయి.

మొత్తంగా చూస్తే.. కొద్ది కాలంలోనే పలువురు మెగా హీరోలు గాయాలు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం యాదృచ్ఛికమే అయినా, అభిమానుల్లో మాత్రం చర్చకు దారితీస్తోంది. ఏం జరుగుతుందోనని అంతా మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ప్రతి హీరో త్వరగా కోలుకుని మళ్లీ సెట్స్‌ పైకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అందరూ కోలుకుంటున్నారని సమాచారం రావడంతో అభిమానులు ఊరట చెందుతున్నారు. అయినప్పటికీ వరుస సంఘటనలు మెగా ఫ్యాన్స్‌ లో ఆందోళన రేకెత్తించాయనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.