Begin typing your search above and press return to search.

మెగా బ్ర‌ద‌ర్స్ బ‌ర్త్ డే మొద‌టి నెంబ‌ర్!

తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కుటుంబం నుంచి వచ్చిన ముగ్గురు అన్నదమ్ములు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , నాగబాబు తెలుగు సినీ రంగాన్ని దశాబ్దాలుగా ఏలుతున్నారు.

By:  Srikanth Kontham   |   23 July 2026 3:29 PM IST
మెగా బ్ర‌ద‌ర్స్ బ‌ర్త్ డే మొద‌టి నెంబ‌ర్!
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ఉన్న ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కుటుంబం నుంచి వచ్చిన ముగ్గురు అన్నదమ్ములు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , నాగబాబు తెలుగు సినీ రంగాన్ని దశాబ్దాలుగా ఏలుతున్నారు. అయితే ఈ అగ్ర తారల పుట్టినరోజులకు సంబంధించి ఓ ఆసక్తికర..ఆశ్చర్యపరిచే అరుదైన సంఖ్యా పరమైన యాదృచ్ఛికం ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. ముగ్గురు సోదరుల జన్మదిన తేదీలను గమనిస్తే? విచిత్రంగా ప్రతీ పుట్టినరోజు మొదటి అంకె `2` తోనే ప్రారంభం కావడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం ఆగస్టు 22 కాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. అలాగే నాగబాబు జన్మదినం అక్టోబర్ 29గా ఉంది. ఈ మూడు తేదీలలోనూ `2` అనే అంకె ముందు రావ‌డం యాదృచ్ఛికం మాత్రమే కాదు. ఇదొక అద్భుతమైన సెంటిమెంట్ అని అభిమానులు భావిస్తున్నారు. మరింత విచిత్రమైన విషయం ఏమిటంటే? ఈ ముగ్గురు మెగా బ్రదర్స్ పుట్టిన నెలలు కూడా వరుస క్రమంలో రావడం మరో విశేషం. చిరంజీవి పుట్టిన నెల ఆగస్టు (8వ నెల) కాగా, పవన్ కల్యాణ్ పుట్టిన నెల సెప్టెంబర్ (9వ నెల), అలాగే నాగబాబు పుట్టిన నెల అక్టోబర్ (10వ నెల). ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అనే మూడు నెలలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా రావడం కుటుంబం ప్రత్యేకతను మరింత పెంచుతోంది.

ఇలా తేదీలలో `2` అనే నెంబర్ కామన్‌గా ఉండటం .. నెలలు వరుస క్రమంలో అమరి ఉండటం జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర చర్చలకు కూడా తావిస్తోంది. ఒకే కుటుంబంలో పుట్టిన ముగ్గురు అన్నదమ్ముల పుట్టినరోజుల మధ్య ఇలాంటి అరుదైన యాదృచ్ఛిక సమన్వయం ఉండటం బహుశా చలనచిత్ర చరిత్రలోనే అరుదైన ఘట్టంగా చెప్పొచ్చు. ఈ అద్భుతమైన గణాంకాలు మెగా అభిమానులకు పండుగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయి.

సినిమా రంగంలో తమకంటూ సరికొత్త చరిత్ర సృష్టించి కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న మెగా బ్రదర్స్ వ్యక్తిగత జీవితంలోనూ ఇలాంటి ప్రత్యేకతలను కలిగి ఉండటం విశేషం. తెలుగు సినిమా పరిశ్రమకు వారు అందించిన సేవలు, సాధించిన విజయాల వెనుక ఎలాంటి అదృష్టం ఉందో తెలియదు కానీ వారి పుట్టిన రోజుల సంఖ్యలు మాత్రం ఎప్పుడూ గుర్తుండిపోయేలా ఉన్నాయి. మెగా బ్రదర్స్ బర్త్ డేల చుట్టూ తిరుగుతున్న నెంబర్ల గారడీ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ అరుదైన యాదృచ్ఛికం సినిమా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ మెగా కుటుంబంపై వారికున్న అభిమానాన్ని మరింత చాటుకునేలా చేస్తోంది.