ఆ విషయంలో పోటీ పడుతున్న చిరు, చరణ్..!
ఈ మధ్య కాలంలో సినిమాలకు బజ్ క్రియేట్ చేయడంలో పాటలు ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. అందుకే సినిమా విడుదలకు కొన్ని నెలల ముందు నుంచే పాటలను ఒకొక్కటిగా విడుదల చేయడం మనం చూస్తూ ఉన్నాం.
By: Ramesh Palla | 6 Dec 2025 5:18 PM ISTఈ మధ్య కాలంలో సినిమాలకు బజ్ క్రియేట్ చేయడంలో పాటలు ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. అందుకే సినిమా విడుదలకు కొన్ని నెలల ముందు నుంచే పాటలను ఒకొక్కటిగా విడుదల చేయడం మనం చూస్తూ ఉన్నాం. పాటలను విడుదల చేస్తూ సినిమాకు బజ్ క్రియేట్ చేయడంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక పాట హిట్ అయితే సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. గతంలో పలు సందర్భాల్లో ఈ విషయం నిరూపితం అయ్యింది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మినిమం బజ్ క్రియేట్ కావడంతో మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అందుకే మొదటి సింగిల్, రెండో సింగిల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన మీసాల పిల్ల, చికిరి సాంగ్స్ ఆయా సినిమాలపై అంచనాలు ఏ స్థాయిలో పెంచాయో మనం చూస్తూనే ఉన్నాం.
చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు...
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకరవర ప్రసాద్ గారు సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సినిమాకు దాదాపుగా అయిదు వారాల సమయం ఉంది. ఇప్పటికే సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అందుకు కారణం మీసాల పిల్ల అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీసాల పిల్ల భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సినిమాను చూడాలని కోరుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. దాదాపు రెండు నెలల క్రితం వచ్చిన మీసాల పిల్ల పాటకు అప్పుడే యూట్యూబ్ ద్వారా ఏకంగా 77 మిలియన్ వ్యూస్ నమోదు అయ్యాయి. వేలాది మంది ఈ పాటకు రీల్స్ చేయడం కూడా జరిగింది. దాంతో పాట గత రెండు నెలలుగా వైరల్ అవుతూనే ఉంది. ఎక్కడో ఒక చోట ఈ పాట వినిపిస్తూనే ఉంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరియోల్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే.
రామ్ చరణ్ పెద్ది సినిమా చికిరి...
ఇక ఈ మధ్య కాలంలో ప్రముఖంగా వినిపిస్తున్న పాటల్లో చికిరి ఒకటి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమా నుంచి వచ్చిన మొదటి సింగిల్ చికిరి కి ఓ రేంజ్‌లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. సినిమాలో చరణ్ ఎలా ఉండబోతున్నాడు, హీరోయిన్ జాన్వీ కపూర్‌ను ఎలా చూపించబోతున్నారు అనే విషయాలను చూపిస్తూ చరణ్ డాన్స్ మూవ్స్ ను అద్భుతంగా చూపించడంతో పాటకు మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో ఈ పాట విడుదలై కేవలం నెల రోజులు అయింది. ఇంకా చెప్పాలంటే నెల రోజులకు రెండు మూడు రోజులు తక్కువే అయింది. అయినా ఇప్పటికే పాట ఏకంగా 84 మిలియన్‌ల వ్యూస్‌ను దక్కించుకుంది. యూట్యూబ్ లో ఈ పాట సాధిస్తున్న వ్యూస్ ను చూసి అంతా షాక్ అవుతున్నారు. అదే సమయంలో సినిమాకు బజ్ విపరీతంగా పెరుగుతోంది.
మీసాల పిల్ల వర్సెస్ చికిరి సాంగ్
ఇతర సినిమాల పాటలు ఈ రెండు సినిమాల పాటలకు ఆమడ దూరంలో ఉన్నాయి. మూడో స్థానంలో రాజాసాబ్ సినిమా నుంచి వచ్చిన రెబల్ సాబ్ పాట ఉంది. ఆ పాటకు యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 20 మిలియన్‌ల వ్యూస్ నమోదు అయ్యాయి. మొన్నటి వరకు టాప్ లో ఉన్న మీసాల పిల్ల పాటను చికిరి సాంగ్ వచ్చి రెండో స్థానంకు నెట్టి వేసింది. తక్కువ సమయంలోనే చికిరి సాంగ్ మీసాల పిల్ల రికార్డ్ వ్యూస్ ను బ్రేక్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీత సారధ్యంలో వచ్చిన చికిరి సాంగ్ కి యూత్ లో మంచి స్పందన దక్కింది. అందుకే ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా చికిరి అంటూ స్టెప్స్ వేస్తున్నారు. యూట్యూబ్‌లో చికిరి, మీసాల పిల్ల పాటలు పోటీ పడుతున్నాయి. చిరు మూవీ సంక్రాంతికి రానుండగా, పెద్ది సినిమా మాత్రం సమ్మర్ ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ రెండు సినిమాలు వసూళ్ల విషయంలో పోటీ పడుతాయా అనేది చూడాలి.
