మీనాక్షి శేషాద్రికి మళ్లీ ఆపద్బాంధవుడు?
వివాహానంతరం మీనాక్షి శేషాద్రి అమెరికాలోని టెక్సాస్ (ప్లానో) నగరానికి తన మకాం మార్చారు. అక్కడ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఒక సాధారణ గృహిణిగా వైవాహిక జీవితాన్ని గడిపారు.
By: Sivaji Kontham | 19 May 2026 8:00 PM ISTఎనభైలు- తొంబైలలో బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగారు మీనాక్షి శేషాద్రి. కేవలం హిందీలోనే కాకుండా.. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సరసన లెజెండరీ దర్శకుడు కె. విశ్వనాథ్ తెరకెక్కించిన క్లాసిక్ హిట్ `ఆపద్బాంధవుడు`చిత్రంలో అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ హరీష్ మైసూర్‌ను వివాహం చేసుకున్న ఈ సీనియర్ నటి.. ఆ తర్వాత రంగుల ప్రపంచానికి అకస్మాత్తుగా దూరమయ్యారు. పెళ్లి తర్వాత దాదాపు మూడు దశాబ్దాల పాటు సినిమాలకు సుదీర్ఘ విరామం ప్రకటించి... గ్లామర్ రంగానికి పూర్తిగా దూరంగా జరిగిపోవడం అప్పట్లో ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
వివాహానంతరం మీనాక్షి శేషాద్రి అమెరికాలోని టెక్సాస్ (ప్లానో) నగరానికి తన మకాం మార్చారు. అక్కడ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఒక సాధారణ గృహిణిగా వైవాహిక జీవితాన్ని గడిపారు. అయితే వెండితెరకు దూరమైనా.. తనలోని నృత్య కళను మాత్రం వదిలిపెట్టలేదు. టెక్సాస్‌లోనే `చేరశ్ నృత్యశాల` పేరుతో ఒక సొంత డ్యాన్స్ అకాడమీని స్థాపించి విదేశాల్లో ఉన్న వందలాది మంది విద్యార్థులకు భరతనాట్యం, కథక్, ఒడిస్సీ వంటి భారతీయ సాంప్రదాయ నృత్యాలలో శిక్షణ ఇస్తూ మన సంస్కృతిని వ్యాప్తి చేశారు. అలా సుమారు 27 సంవత్సరాల పాటు అమెరికాలో విజయవంతంగా నివసించిన ఈ `ఆపద్బాంధవుడు` నటి.. ఇటీవల తన జీవితంలో ఒక కీలక నిర్ణయం తీసుకుని శాశ్వతంగా భారతదేశానికి (ముంబైకి) తిరిగి వచ్చేశారు.
మాతృభూమికి చేరుకున్న తర్వాత మీనాక్షి శేషాద్రి గ్లామర్ ప్రపంచంలో తన సెకండ్ ఇన్నింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ముంబైలోనే నివసిస్తూ పలు టెలివిజన్ రియాలిటీ షోలలో గెస్ట్‌గా సందడి చేయడంతో పాటు.. పెద్ద పెద్ద సినిమా ఈవెంట్లలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. వయసు రీత్యా ప్రస్తుతం 60 ఏళ్లు దాటినా నవతరం నటీమణులకు పోటీనిచ్చేలా ఎంతో ఫిట్‌గా, చురుగ్గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మీనాక్షి ఈ వయసులోనూ ఇంతటి ఎనర్జీతో మెరిసిపోవడానికి గల అసలు రహస్యం తను పాటిస్తున్న క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, నిరంతర నృత్య సాధన-యోగా అని తెలుస్తోంది.
ఈ సెకండ్ ఇన్నింగ్స్ ప్రయాణంలో మీనాక్షి శేషాద్రి తన ఆరోగ్యం విషయంలో ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. తను ఇప్పుడు పూర్తిగా `వీగన్` (శాకాహారి) లైఫ్‌స్టైల్‌కు మారిపోయారు. జంతువుల నుండి లభించే పాలు, పెరుగు, వెన్న వంటి పాల పదార్థాలను సైతం పూర్తిగా పక్కనబెట్టేసి..కేవలం మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ కఠినమైన ఆహార నియమాలను పాటిస్తున్నారు. ఈ హెల్తీ లైఫ్‌స్టైల్ మార్పులే మీనాక్షిని మానసికంగా, శారీరకంగా మరింత దృఢంగా మార్చాయని, వెండితెరపై పునరాగమనం చేయడానికి తనకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం మీనాక్షి శేషాద్రి వెండితెరపైకి గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చేందుకు అనుకూలమైన అవకాశాల కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు. కేవలం రొటీన్ కమర్షియల్ పాత్రలు కాకుండా... బలమైన కథాబలం- నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దొరికితే సినిమాల్లో నటించడానికి తను సిద్ధంగా ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఓటీటీ వేదికల కోసం రూపొందుతున్న పలు వెబ్ సిరీస్‌లతో పాటు, డిఫరెంట్ జోనర్ సినిమాలకు సంబంధించిన కథలను కూడా మీనాక్షి పరిశీలిస్తున్నారు. `ఆపద్బాంధవుడు` చిత్రంలో చిరంజీవితో కలిసి అద్భుతమైన నటన, నృత్యాలు ప్రదర్శించిన మీనాక్షి శేషాద్రి.. మళ్లీ వెండితెరపై నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవ్వడంపై పాత తరం సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే నటనలోకి రీఎంట్రీ ఇస్తున్న మీనాక్షి శేషాద్రికి మెగాస్టార్ లాంటి అగ్ర నటులు తిరిగి అవకాశం ఇస్తారా లేదా వేచి చూడాలి. మీనాక్షి వయసు రీత్యా ఏవైనా ముఖ్యమైన సహాయక పాత్రల్లో అవకాశాలు దక్కడం ఖాయంగాను కనిపిస్తోంది.
