ప్రదీప్ రంగనాథన్ ఎదుగుదల చూశారా?
‘లవ్ టుడే’ ఒక్క సినిమాతో యూత్‌లో ఎక్కడ లేని క్రేజ్ సంపాదించాడు తమిళ దర్శకుడు, కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్.
By: Garuda Media | 3 Jan 2026 4:00 PM IST‘లవ్ టుడే’ ఒక్క సినిమాతో యూత్‌లో ఎక్కడ లేని క్రేజ్ సంపాదించాడు తమిళ దర్శకుడు, కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్. కంటెంట్ ఉంటే లుక్స్ గురించి పట్టించుకోకుండా యూత్ బ్రహ్మరథం పడతారు అని అతను రుజువు చేశాడు. ‘లవ్ టుడే’తో దర్శకుడిగా, నటుడిగా అతడి ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయారు.
ఆ తర్వాత అతణ్ని హీరోగా పెట్టి డ్రాగన్, డ్యూడ్ చిత్రాలు రూపొందిస్తే.. అవి కూడా బ్లాక్ బస్టర్లు అయ్యాయి. వరుసగా మూడు వంద కోట్ల సినిమాలతో సంచలనం రేపాడు ప్రదీప్. తన నుంచి కొత్త ఏడాదిలో ‘ఎల్ఐకే’ అనే సినిమా రాబోతోంది. దీని తర్వాత ప్రదీప్ రంగనాథన్ మళ్లీ దర్శకుడిగా అవతారం ఎత్తబోతున్న సంగతి తెలిసిందే. ‘లవ్ టుడే’ తీసిన బేనర్లోనే ఈ సినిమా చేయబోతున్నాడు ప్రదీప్. ఈ సినిమా బడ్జెట్, కాస్టింగ్ అన్నీ కూడా వేరే లెవెల్లో ఉండబోతున్నాయి.
తమ సంస్థకు ‘లవ్ టుడే’తో భారీ లాభాలు అందించిన ప్రదీప్‌తో ఈసారి వంద కోట్ల బడ్జెట్లో సినిమా తీయబోతోందట ఏజీఎస్ సంస్థ. భారీగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ సినిమా కావడంతో బాగా ఖర్చవబోతోంది. ఇక ఈ సినిమాకు పెద్ద పెద్ద నటీనటులను తీసుకోబోతున్నారట. ఈ చిత్రంలో కథానాయికగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఎంపికైనట్లు సమాచారం. ‘ఇచట వాహనములు నిలపరాదు’ అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయమైన మీనాక్షి.. తక్కువ టైంలోనే పెద్ద హీరోయిన్‌గా ఎదిగింది.
రవితేజ, మహేష్ బాబు, వెంకటేష్ లాంటి పెద్ద హీరోల సరసన సినిమాలు చేసింది. సంక్రాంతికి ఆమె ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆమె చేయబోయేది ప్రదీప్ చిత్రమేనట. ఇప్పటిదాకా ఇవానా, అనుపమ పరమేశ్వరన్, కాయదు లోహర్, మామిత బైజు లాంటి చిన్న, మిడ్ రేంజ్ హీరోయిన్లతోనే సినిమాలు చేసిన ప్రదీప్.. ఈసారి మీనాక్షి లాంటి టాప్ హీరోయిన్‌తో జట్టు కట్టబోతున్నాడు. మీనాక్షి తన కెరీర్ ఆరంభంలో కొలై (హత్య) అనే చిన్న తమిళ చిత్రంలో నటించింది. అది సరిగా ఆడలేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఎదిగాక, ప్రదీప్ లాంటి క్రేజీ హీరో సినిమాతో తమిళంలోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది మీనాక్షి. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రాబోతోందట.
