సెలబ్రిటీ గుర్తింపు దొంగిలించకుండా ఉండాలంటే? మీనాక్షి పాఠం!
సెలబ్రిటీల నకిలీ అకౌంట్ల సమస్య కేవలం వారి వ్యక్తిగత ప్రతిష్టకే కాకుండా... సమాజంలోని సామాన్య నెటిజన్ల భద్రతకు కూడా ముప్పుగా మారుతోంది.
By: Sivaji Kontham | 14 Jun 2026 10:13 AM ISTటాలీవుడ్ టాప్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాలో తన పేరుతో ఉన్న ఒక నకిలీ ఖాతా దుర్వినియోగం అవుతోందని గుర్తించారు. ఈ ఫేక్ అకౌంట్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తులు ఇతరులను మోసం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని చేరవేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో మీనాక్షి చౌదరి తన అభిమానులను, నెటిజన్లను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. తన అధికారిక ఖాతాను మాత్రమే ఫాలో అవ్వాలని, సదరు నకిలీ ప్రొఫైల్స్ నుండి వచ్చే ఎలాంటి సందేశాలను నమ్మవద్దని మీనాక్షి స్పష్టం చేశారు.
ఈ సైబర్ వేధింపులపై మీనాక్షి చౌదరి ఇప్పటికే పోలీసులకు.. సైబర్ క్రైమ్ విభాగంలో అధికారికంగా ఫిర్యాదు చేసారు. సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి.. వారి ఇమేజ్‌ను దెబ్బతీయడంతో పాటు సామాన్య ప్రజల నుండి డబ్బులు గుంజడం లేదా ప్రమోషన్ల పేరిట మోసాలకు పాల్పడటం వంటివి ఇటీవల కాలంలో తీవ్రంగా పెరిగిపోయాయి. సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందుతోందో అదే స్థాయిలో ఈ రకమైన ఐడెంటిటీ థెఫ్ట్ నేరాలు కూడా ఎక్కువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇలాంటి ఫేక్ అకౌంట్ల సమస్యను ఎదుర్కొన్న మొదటి కథానాయిక మీనాక్షి చౌదరి మాత్రమే కాదు. గతంలో టాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర నటీమణులు ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. స్టార్ హీరోయిన్లు పూజా హెగ్డే, రష్మిక మందన్న, కీర్తి సురేష్ వంటి వారు కూడా గతంలో తమ పేరుతో దొంగ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా అభిమానులతో చాటింగ్ చేస్తూ కొందరు మోసాలకు పాల్పడుతున్నారని స్వయంగా ప్రకటించారు. అంతేకాదు రష్మిక మందన్న వంటి నటీమణులు గతంలో డీప్‌ఫేక్ వంటి ప్రమాదకరమైన సైబర్ నేరాల బారిన పడిన ఉదంతాలు ఇండస్ట్రీని కదిలించాయి.
అటు బాలీవుడ్‌లో సైతం ఈ ఫేక్ ప్రొఫైల్స్ కల్చర్ తీవ్రమైన సవాలుగా మారింది. అలియా భట్, కృతి సనన్, జాన్వీ కపూర్ వంటి టాప్ హీరోయిన్ల పేరుతో వందలాది నకిలీ ఖాతాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ ఫేక్ అకౌంట్ల నుండి వచ్చే వివాదాస్పద వ్యాఖ్యల వల్ల సదరు నటీమణులు అనవసరమైన వివాదాల్లో ఇరుక్కోవాల్సి వస్తోంది. దీంతో బాలీవుడ్ భామలు సైతం ఇలాంటి ఐడెంటిటీ దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు సైబర్ సెల్‌ను ఆశ్రయిస్తూ, తమ అధికారిక పేజీలకు ఉన్న `బ్లూ టిక్`ను మాత్రమే నమ్మాలని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
సెలబ్రిటీల నకిలీ అకౌంట్ల సమస్య కేవలం వారి వ్యక్తిగత ప్రతిష్టకే కాకుండా... సమాజంలోని సామాన్య నెటిజన్ల భద్రతకు కూడా ముప్పుగా మారుతోంది. అభిమానం పేరుతో ఆయా అకౌంట్లను ఫాలో అయ్యే యువతను సైబర్ నేరగాళ్లు సులభంగా ట్రాప్ చేసి ఆర్థికంగా దగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీనాక్షి చౌదరి ఉదంతం మరోసారి సోషల్ మీడియా భద్రతపై చర్చను లేవనెత్తింది. నెటిజన్లు ఏ సెలబ్రిటీని ఫాలో అయినా.. సదరు ప్రొఫైల్ వెరిఫై అయిందా లేదా? అనేది క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఒకరి ఐడెంటిటీని ఇతరులు థెఫ్టింగ్ చేయకుండా కోర్టులు మద్ధతుగా నిలుస్తున్నాయి. సెలబ్రిటీల పేర్లు, ఫోటోలు లేదా వారి వాయిస్ ని ఏ రూపాల్లోను ఇతరులు వాడుకోకుండా కోర్టుల నుంచి స్ట్రిక్టు ఆర్డర్లు ఉన్నాయి. నష్టపరిహారాలు చెల్లించాల్సి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ సహా పలువురు ఇప్పటికే ఐడెంటిటీని దొంగతనం చేయకుండా కోర్టు నుంచి రక్షణ పొందారు. ఇకపైనా టాప్ సెలబ్రిటీలు, హీరోయిన్లు కూడా దీనికోసం కోర్టుల నుంచి రక్షణ కోరే వెసులుబాటు ఉంది.
