Begin typing your search above and press return to search.

నా జీవితం.. నా నిబంధనలు: ఎవరికో లెక్కలు చెప్పాల్సిన పనిలేదదు!

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనాక్షి మాట్లాడుతూ `నా జీవితంలో నేను ఎప్పుడూ ఈ లోకానికి .. ఇతరులకు నన్ను నేను నిరూపించుకోవాలని భావించలేదు` అని కుండబద్దలు కొట్టారు.

By:  Srikanth Kontham   |   19 Oct 2026 6:00 PM IST
నా జీవితం.. నా నిబంధనలు: ఎవరికో లెక్కలు చెప్పాల్సిన పనిలేదదు!
X

టాలీవుడ్‌లో తనదైన అభినయంతో.. అందంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. గ్లామర్ ప్రపంచంలో ఎవరో ఒకరికి తమ సత్తా ఏంటో నిరూపించుకోవాల్సిన పోటీ వాతావరణం ఉంటుందని భావిస్తుంటారు. కానీ మీనాక్షి మాత్రం బయటి ప్రపంచానికి ఎవరికీ ఏ నిరూపణలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు అమ్మ‌డు చేసిన వ్యాఖ్య‌లు ఆమె ఆలోచనా విధానాన్ని తెలియ జేస్తున్నాయి.

సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న మీనాక్షి చౌదరి ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. దంతవైద్యురాలిగా (డెంటిస్ట్) కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత అందాల పోటీల వైపు అడుగులు వేసి చివరకు నటిగా మారడం అంత సులభం ఏమీ కాదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రతిసారీ కొందరు విమర్శలు చేయడం .. అంచనాలు పెట్టుకోవడం సహజం. అయితే ఆ అంచనాల ఒత్తిడికి తలవంచకుండా.. కేవలం పనిపైనే దృష్టి పెట్టాలనేదే తన నైజమని ఆమె గతంలోనూ పలుమార్లు తెలిపారు.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనాక్షి మాట్లాడుతూ `నా జీవితంలో నేను ఎప్పుడూ ఈ లోకానికి .. ఇతరులకు నన్ను నేను నిరూపించుకోవాలని భావించలేదు` అని కుండబద్దలు కొట్టారు. ప్రయాణంలో తాను ఎన్నోసార్లు ఇబ్బందు లను.. వైఫల్యాలను ఎదుర్కొన్నానని అయితే ఆ అడ్డంకులు తన లక్ష్యాల వైపు అడుగులు వేయకుండా ఎప్పుడూ ఆపలేకపోయాయని పేర్కొన్నారు. చుట్టూ ఉండే అనవసరమైన శబ్దాన్ని, విమర్శలను పక్కన పెట్టి తన దారి తాను చూసుకుంటూ ముందుకు సాగడమే ఇష్టమన్నారు.

ఇండస్ట్రీలో నటిగా నిలదొక్కుకోవాలంటే అదృష్టమే సరిపోదు. దాని వెనుక ఎంతో కఠినమైన శ్రమ, మానసిక దృఢత్వం ఉండాలి. మీనాక్షి చౌదరి తన ప్రయాణంలో ఎదురైన ఆటుపోట్లను తట్టుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నారు. ఇతరుల కోసం జీవించడం కంటే తన సంతృప్తి కోసం, లక్ష్యాల సాధన కోసం మాత్రమే కష్టపడుతున్నానని మీనాక్షి చెప్పడం విశేషం. ఈ తరహా పరిణతి నటిగా ఆమెను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని అభిమానులు భావిస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీల జీవితాలపై రకరకాల ట్రోల్స్, అంచనాలు ఉండటం సర్వసాధారణం అయిపోయింది. ఈ నేపధ్యంలో ఎవరి ఒత్తిళ్లకు తలవంచకుండా సెల్ఫ్-డౌట్ లేకుండా ముందుకు సాగే తత్వం ప్రతి ఒక్కరికీ అవసరమని మీనాక్షి వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. ఇండస్ట్రీ ట్రెండ్స్‌కు తలవంచకుండా తనకంటూ త‌న ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్న మీనాక్షి శైలి యువతకు స్పూర్తిదాయకంగా నిలుస్తోంది.

మొత్తానికి గ్లామర్ ప్రపంచపు హంగుల వెనుక బలమైన ఆత్మవిశ్వాసం ఉంటేనే రాణించగలమని మీనాక్షి చౌదరి నిరూపించి చూపించారు. ఎవరికో నచ్చడం కోసం కాకుండా తనకంటూ ఒక దైర్యాన్ని ఏర్పరచుకుని సాగుతున్న అమ్మ‌డి స్టేట్‌మెంట్ ఇండ‌స్ట్రీలో జోరుగా వైరల్ అవుతోంది.