Begin typing your search above and press return to search.

ఆయ‌న అంద‌రి హీరోల కంటే డిఫ‌రెంట్..

సెట్స్‌లో ఒక స్టార్‌ హీరో ఉంటే సాధారణంగా క్రమశిక్షణ, సీరియస్‌ వాతావరణం కనిపిస్తుంటుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   20 April 2026 6:00 PM IST
ఆయ‌న అంద‌రి హీరోల కంటే డిఫ‌రెంట్..
X

సెట్స్‌లో ఒక స్టార్‌ హీరో ఉంటే సాధారణంగా క్రమశిక్షణ, సీరియస్‌ వాతావరణం కనిపిస్తుంటుంది. కానీ మోహ‌న్ బాబు విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. ఆయన సెట్స్‌లో అడుగుపెట్టగానే వాతావరణం ఒక్కసారిగా ఉత్సాహంగా మారిపోతుందని సహనటులు చెబుతుంటారు. తాజాగా సీనియర్‌ నటి మీనా చెప్పిన ఎక్స్‌పీరియెన్స్ చూస్తే, మోహన్‌బాబు సెట్స్‌లో ఉండే ప్రత్యేక శైలి ఎంత ప్రత్యేకమో మరోసారి స్పష్టమవుతోంది.

మీనా తన కెరీర్‌ ప్రారంభ దశలో తెలుగుభాషపై పూర్తి పట్టు లేకపోవడంతో ఎక్కువగా మాట్లాడకుండా ఉండేదాన్నని చెప్పారు. సెట్స్‌లో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా అర్థం కాకపోయేదని, తర్వాత ఎవరో మీ గురించే మాట్లాడుకుంటున్నారంటే ఏమంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించేదాన్నని ఆమె గుర్తు చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో మోహన్‌బాబు లాంటి వ్యక్తి సెట్స్‌లో ఉండటం తనకు మొదట్లో కొంత భయానకంగా అనిపించిందని మీనా తెలిపారు. ఆయన గంభీర స్వరం, క్రమశిక్షణ కలిసివచ్చి, తనను నిజంగానే మందలిస్తున్నారేమో అనిపించేదట.

ఆయ‌న స్టైలే వేరు

అయితే అదే సమయంలో ఆయన స్టైల్‌ పూర్తిగా భిన్నమని, సెట్స్ లోని అందరినీ ఒరేయ్ రారా, పోరా అంటూ పిలుస్తూ ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని సృష్టించేవారని మీనా చెప్పారు. ఇతర హీరోలతో పోలిస్తే మోహన్‌బాబు సెట్స్‌లో చాలా ఫ్రీగా, అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. సాధారణంగా స్టార్ హీరోలు ఒక గౌరవ దూరం పాటిస్తుంటే, మోహన్‌బాబు మాత్రం ఆ గ్యాప్‌ను తొలగించి, యూనిట్‌తో ఒక కుటుంబ వాతావరణాన్ని సృష్టిస్తారని ఆమె వివరించారు.

సెట్స్ లో ఆడుకునేదాన్ని

ప్రత్యేకంగా అల్ల‌రి మొగుడు షూటింగ్ టైమ్ లో జరిగిన సంఘటనలను మీనా గుర్తు చేసుకున్నారు. అప్పటికి చిన్న వయసులో ఉన్న ఆమె, మంచు లక్ష్మీ, విష్ణులతో కలిసి సెట్స్‌లో అల్లరి చేస్తూ గేమ్స్‌ ఆడేదట. ఆ సమయంలో తన అల్లరి ఎక్కువైందని భావించిన మోహన్‌బాబు తన గంభీర స్వరంతో హెచ్చరించారని, దాంతో తాను నిజంగానే భయపడ్డానని ఆమె చెప్పారు. కానీ తర్వాత అది ఆయన వ్యక్తిత్వంలో భాగమని, బయటకు కఠినంగా కనిపించినా లోపల ఎంతో సున్నితమైన మనసు ఉందని తెలుసుకున్నానని చెప్పారు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలతో కలిసి పనిచేసిన మీనా, వారందరిలో మోహన్‌బాబు ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పడం గమనార్హం. ఒకవైపు క్రమశిక్షణను కట్టుదిట్టంగా పాటిస్తూ, మరోవైపు సెట్స్‌లో సరదా వాతావరణాన్ని కొనసాగించడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. అదే సమయంలో, ఆయన మాట తీరు కొందరికి కఠినంగా అనిపించినా, అది పూర్తిగా ప్రేమతో కూడినదే అని సహనటులు చెబుతుంటారు.