Begin typing your search above and press return to search.

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న ‘ప్రళయ్’ సినిమా షూటింగ్ ముంబైలో వివాదానికి దారితీసింది. ఆజాద్ మైదాన్‌లో చిత్రీకరణ వల్ల అండర్-14, అండర్-16 క్రికెట్ మ్యాచ్‌లకు అంతరాయం కలిగిందని ముంబై క్రికెట్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకున్నాకే షూటింగ్ నిర్వహించామని దర్శకుడు హన్సల్ మెహతా స్పష్టం చేశారు. ఈ ఘటనతో క్రీడా మైదానాల వినియోగంపై చర్చ మొదలైంది.

By:  Srikanth Kontham   |   7 Nov 2026 8:00 PM IST
ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!
X

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `ప్రళయ్` షూటింగ్ ముంబైలో శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా చారిత్రాత్మక ఆజాద్ మైదాన్‌లో జరిగిన ఓ షెడ్యూల్ వివాదానికి తెర తీసింది. చిత్రీక‌ర‌ణ కారణంగా స్థానిక యువ క్రికెటర్ల మ్యాచ్‌లు అండర్-14, అండర్-16 టోర్నమెంట్‌లు అంతరాయానికి గురయ్యాయని ముంబై క్రికెట్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రీడాకారుల ప్రాక్టీస్ వేదిక అయిన మైదాన్‌ను కమర్షియల్ సినిమా షూటింగ్‌ల కోసం వాడటం పట్ల క్రికెట్ వర్గాలు మండిపడ్డాయి.

మైదాన్‌లో భారీ సెట్లు వేయడం వల్ల ఆటగాళ్లకు నష్టం జరుగుతోందని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినంగా ఉండాల‌ని ఎంసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేశారు. క్రీడా మైద‌నాల‌ను వాణిజ్య ప్ర‌యోజ‌నాల కోసం వాడుకోవ‌డం స‌రికాద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఈ వివాదం పై ద‌ర్శ‌కుడు హ‌న్స‌ల్ మెహ‌తా క్రికెట్ బాడీ ఆరోప‌ణ‌లు పూర్తిగా ఖండించారు. త‌మ సినిమా యూనిట్ ఎలాంటి నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌లేద‌న్నారు. ప్ర‌భుత్వానికి సంబం ధించిన అన్ని అనుమ‌తుల‌ను అధికారుల నుంచి ముందుగానే తీసుకున్నామ‌ని స్ప‌ష్టం చేసారు.

ఇదే సంద‌ర్భంలో ముంబైలో లో షూటింగ్ లు జ‌ర‌గ‌డంపై ఉన్న అవాంత‌రాల‌పైనా అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. బ్యూరో క్రాటిక్ అడ్డంకుల కార‌ణంగా ముంబై న‌గ‌రం సినిమా షూటింగ్ ల‌కు ప్ర‌వేశం లేని ప్రాంతంగా మారిపోయిం ద‌ని ఆరోపించారు. ఇలాంటి అన‌వ‌ర‌స‌ర రాద్దాంతాలు ప‌రిశ్ర‌మ‌ను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని మండి ప‌డ్డారు.

అలాగే మ‌హారాష్ట్ర క్రీడా శాఖ ఈ అంశంపై స్పందించింది. ప్ర‌భుత్వ నిబంధ‌ల‌న ప్ర‌కార‌మే అనుమ‌తులు మంజూరు అయ్యాయ‌ని స‌మ‌ర్దించుకుంది. నిబంధ‌న‌ల ప్ర‌కారం క్రీడాయేత‌ర కార్య‌క్ర‌మాలు నిర్దిష్ట రోజుల పాటు అనుమ‌తించే వెసులు బాటు ఉంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది.

ఏదేమైనా ఇలాంటి ప‌రిణ‌మాలు ప‌రిశ్ర‌మ‌ను ముంబై నుంచి బ‌య‌ట‌కు వెళ్లేలా ప్రేరేపిస్తున్నాయ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అనుమ‌తులు సాధించ‌డం లో ఎదుర‌య్యే రెడ్ టేపిజం..షూటింగ్ స‌మ‌యంలో ఎదుర‌య్యే స్థానిక వివాదాల వ‌ల్ల న‌గ‌రంలో స‌మ‌యం, బ‌డ్జెట్ భారీగా పెరుగుతుంద‌ని మేక‌ర్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ముంబై కి ప్ర‌త్యామ్నాయంగా మ‌రో ప్రాంతంలో ప‌రిశ్ర‌మ‌ను డెవ‌ల‌ప్ చేయాల‌న్న‌ వాద‌న తెర‌పైకి వ‌స్తుంది.

అలాగే క్రీడా మైద‌నాలు క్రీడాకారుల సాధ‌న‌కే ప‌రిమితం కావాల‌నే వాద‌న‌కు కూడా క్రీడా వర్గాల నుంచి బ‌ల‌మైన మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. భ‌విష్య‌త్ లో ఇలాంటి వివాదాలు త‌లెత్త‌కుండా ఉండాలంటే? షూటింగ్ ల కోసం ప్ర‌త్యేకంగా స్టూడియోల సంఖ్య తో పాటు కొత్త స్థ‌లాలు కూడా కేటాయించాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు.