మహేష్ హీరోయిన్‌కి మరో అరుదైన గౌరవం..!
మహేష్ బాబు హీరోగా నటించిన 'వంశీ' సినిమా హీరోయిన్ అనగానే అందరికీ నమ్రత శిరోద్కర్ మాత్రమే గుర్తుకు వస్తుంది.
By: Srikanth Kontham | 2 Sept 2025 7:00 PM ISTమహేష్ బాబు హీరోగా నటించిన 'వంశీ' సినిమా హీరోయిన్ అనగానే అందరికీ నమ్రత శిరోద్కర్ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆ సినిమా సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు, ఆ ప్రేమ పెళ్లికి దారి తీసింది. దాంతో వారు ఎప్పుడూ వంశీ గురించి మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. అందుకే వంశీ సినిమా చూసిన వారు కూడా ఆ సినిమాలో మరో హీరోయిన్ ఉంది అనే విషయాన్ని మర్చి పోయారు. వంశీ సినిమాలో నమ్రత కాకుండా మరో హీరోయిన్ కూడా ఉంది.. ఆమె బాలీవుడ్ హీరోయిన్ మయూరి కాంగో. బాలీవుడ్‌లో వరుస సినిమాలతో హిట్ కొడుతుంది అనే ఉద్దేశంతో దర్శకుడు బి గోపాల్ ఆమెను ఈ సినిమాకు తీసుకు వచ్చాడు. నమ్రత స్థాయి పాత్ర కాకున్నా కాస్త తక్కువ పాత్ర అయినా కూడా మయూరికి చాలా వెయిట్ ఉన్న పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు.
బాలీవుడ్ హీరోయిన్ మయూరి..
నటిగా మయూరి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చాలా తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. నటిగా తనను తాను నిరూపించుకోవడం ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు, ప్రతిభ ఉన్న కారణంగా మయూరిని ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండేవారు. అలాంటి మయూరి ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమయంలోనే సినిమాలకు దూరం అయింది. కేవలం అయిదు సంవత్సరాలు మాత్రమే మయూరి సినిమా ఇండస్ట్రీలో కొనసాగింది. ఆమె 2000 సంవత్సరంలో ఏకంగా ఐదు సినిమాలు చేసిందంటే ఏ స్థాయిలో ఆమె బిజీగా ఉండేది, ఎంతగా ఆమెకు క్రేజ్ దక్కిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మయూరి సినిమాలు వదిలేసి ఉన్నత చదువు చదివి ఇప్పుడు అత్యున్నత ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
గూగుల్ ఇండియాలో కీలక పోస్ట్
మయూరి 2003లో ఆదిత్య ధిల్లాన్ ను వివాహం చేసుకుని, అతడితో యూఎస్ వెళ్లి పోయింది. సినిమాల కారణంగా మధ్యలో వదిలేసిన చదువును అక్కడ కంటిన్యూ చేసింది. అక్కడే ఉద్యోగం చేయడం మొదలు పెట్టింది. ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన గూగుల్ లో కీలక పదవులు నిర్వర్తించడం ద్వారా పవర్ ఫుల్ ఉమెన్‌గా గుర్తింపు దక్కించుకున్నారు. గూగుల్ లో ఇండియా నుంచి అత్యున్నత పొజీషన్‌కి వెళ్లిన మొదటి లేడీ అంటూ ఈమెను చెబుతూ ఉంటారు. మయూరి గూగుల్ లో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చిన సమయంలో ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. 2019 నుంచి గూగుల్ ఇండియాలో చేరి ఇండస్ట్రీ హెడ్‌గా మయూరి కొనసాగారు. ఎంతో మంది కోరుకునే ఆ పొజీషన్‌ను మయూరి దక్కించుకోవడం అంత సులభం ఏమీ కాలేదు. ఆమె కష్టానికి ఆ గౌరవం దక్కిందని ఆమె సన్నిహితులు అంటూ ఉంటారు.
సీఈఓగా బాధ్యతలు చేపట్టిన మయూరి
ప్రస్తుతం పబ్లిసిస్ గ్రూప్‌లోని గ్లోబల్ డెలివరీ డివిజన్‌కి అత్యంత కీలకమైన సీఈవో బాధ్యతలు చేపట్టింది. ఇది ఖచ్చితంగా మయూరికి దక్కిన అతి పెద్ద గౌరవం అంటూ వాణిజ్య వర్గాల వారు అంటున్నారు. సినిమాల నుంచి సీఈఓ బాధ్యతలు చేపట్టే వరకు ఆమె సాగించిన జర్నీ ఎంతో మందికి ఆదర్శం అనడంలో సందేహం లేదు. సినిమాల్లో చేసినప్పుడు ది బెస్ట్ ఇచ్చిన మయూరి వరుస ఆఫర్లు దక్కించుకుంది. ఇప్పుడు అలాగే ఒక కంపెనీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో తన పూర్తి కష్టంను పెడుతున్న కారణంగా కంపెనీలో ఆమెకు సముచిత స్థానం లభిస్తుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగ బాధ్యతలతో తలమునకలై ఉన్న మయూరి భవిష్యత్తులో సినిమాల్లో నటిస్తుందేమో చూడాలి.
