Begin typing your search above and press return to search.

దూసుకెళ్తున్న 'మయసభ'.. తెలుగులో మొట్టమొదటిది ఇదే!

రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా మయసభ సిరీస్ ను రూపొందించగా.. ఇప్పుడు భాషా సరిహద్దుల్ని చెరిపేస్తూ అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది మయసభ.

By:  M Prashanth   |   23 Aug 2025 1:48 PM IST
దూసుకెళ్తున్న మయసభ.. తెలుగులో మొట్టమొదటిది ఇదే!
X

తెలుగులో అనేక వెబ్ సిరీస్ లు రూపొందుతూనే ఉన్నాయి. మన దగ్గర కూడా మెల్లగా సిరీస్ ల కల్చర్ పెరుగుతోంది. అదే సమయంలో పొలిటికల్ జోనర్ ను మాత్రం పెద్దగా మేకర్స్ టచ్ చేయడం లేదు. కానీ రీసెంట్ గా డైరెక్టర్ దేవా కట్టా.. మయసభతో ట్రై చేశారు. ఇప్పుడు మంచి హిట్ అందుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు.


రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా మయసభ సిరీస్ ను రూపొందించగా.. ఇప్పుడు భాషా సరిహద్దుల్ని చెరిపేస్తూ అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది మయసభ. దేవా కట్టా, కిరణ్ జే కుమార్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఆ సిరీస్‌ లో యాక్టర్స్ ఆది పినిశెట్టి, చైతన్య రావు కీలక పాత్రలు పోషించారు.

హిట్‌ మెన్, ప్రూడోస్ ప్రొడక్షన్స్ LLP బ్యానర్‌ పై రూపొందిన ఆ సిరీస్ లో దివ్యా దత్తా, సాయి కుమార్, నాజర్, శత్రు, రవీంద్ర విజయ్, తాన్య రవిచంద్రన్ వంటి స్టార్ నటీనటులు కనిపించారు. అందరూ తమ నటనతో ఆకట్టుకున్నారు. కాకర్ల కృష్ణమ నాయుడుగా ఆది పినిశెట్టి, ఎంఎస్ రామి రెడ్డిగా చైతన్య రావు తమ యాక్టింగ్ తో మెప్పించారు.

ఉత్కంఠభరితమైన కథాంశం, డిఫరెంట్ పాత్రలు, ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాతో ఉన్న మయసభ సిరీస్.. ఇప్పుడు ప్రముఖ సోనీ లివ్ ఓటీటీలో దూసుకుపోతోంది. 2025 ఆగస్టు 11- 17 వారానికి గాను ప్రముఖ ఓర్మాక్స్ మీడియా రీసెంట్ గా సర్వే వెల్లడించింది. అప్పటికే ఆ సిరీస్ 2.8 మిలియన్ల వ్యూస్ ను అందుకున్నట్లు ప్రకటించింది.

దేశంలో అత్యధికంగా వీక్షించిన స్ట్రీమింగ్ షోల జాబితాలో మయసభ 3వ స్థానంలో ఉన్నట్లు కూడా చెప్పింది. అయితే ఓర్మాక్స్ మే 2024లో అన్ని భాషా కంటెంట్‌ ను చేర్చడం ప్రారంభించినప్పటి నుంచి టాప్ 3లోకి ప్రవేశించిన మొట్టమొదటి తెలుగు షోగా మయసభ నిలిచింది. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే మయసభ: రైజ్ ఆఫ్ టైటాన్స్.. సోనీ లివ్ ఓటీటీలో తెలుగు కథను సుస్థిరం చేసేలా ఒక మైలురాయిని జరుపుకుంటుంది. అదే సమయంలో మయసభ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ ఫామ్ రంగంలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. మరి మెచ్చుకుంటున్న ఆ సిరీస్‌ ను మీరు చూశారా? మీకు ఎలా అనిపించింది?