'వివాహ భోజనంబు' వెనుక అంతర్జాతీయ స్ఫూర్తి!
తెలుగు సినిమా చరిత్రలో 'మాయాబజార్' ఓ అద్భుతం. ఆరు దశాబ్దాలు దాటినా సినిమాలోని ప్రతి సన్నివేశం, ప్రతి పాట నేటికీ తెలుగు వారి ఇళ్లలో మార్మోగుతూనే ఉంటుంది.
By: Srikanth Kontham | 30 April 2026 5:00 AM ISTతెలుగు సినిమా చరిత్రలో 'మాయాబజార్' ఓ అద్భుతం. ఆరు దశాబ్దాలు దాటినా సినిమాలోని ప్రతి సన్నివేశం, ప్రతి పాట నేటికీ తెలుగు వారి ఇళ్లలో మార్మోగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఎస్.వీ. రంగారావు తన నటనతో, ఆహార్యంతో ఘటోత్కచుడిగా ప్రాణం పోసిన `వివాహ భోజనంబు` పాట ఒక ఐకానిక్ సాంగ్. అయితే ఈ పాట వెనుక ఓ ఆసక్తికర అంతర్జాతీయ స్ఫూర్తి ఉందనే విషయాన్ని దర్శకుడు, నటుడు రవిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించి ఆశ్చర్యపరిచారు. ఈ క్లాసిక్ సాంగ్ రూపకల్పనలో హాలీవుడ్ ప్రభావం ఉందనేది వినడానికి వింతగా అనిపించినా? అది నిజమని రవిబాబు అంటున్నారు.
1935లో అమెరికాలో విడుదలైన `ది లాఫింగ్ పోలీస్‌మ్యాన్` అనే పాట నుండి స్ఫూర్తి పొంది `వివాహ భోజనంబు` పాటను తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. ఆంగ్ల పాటలోని ఆ హుషారు, నవ్వుల మేళవింపును మన నేటివిటీకి, ఘటోత్కచుడి పాత్ర స్వభావానికి తగ్గట్టుగా మార్చి అద్భుతమైన బాణీని కూర్చారన్నారు. సంగీత దర్శకుడు ఘంటసాల గారు ఈ పాటను కంపోజ్ చేసిన విధానం నిజంగా ప్రశంసనీయం. ఒక విదేశీ పాటలోని ఆత్మను గ్రహించి దానికి పింగళి నాగేంద్రరావు గారి అమరమైన సాహిత్యాన్ని జోడించి తెలుగు తనాన్ని అద్దారు.
ముఖ్యంగా పాట మధ్యలో వచ్చే ఆ విలక్షణమైన నవ్వులు, లయబద్ధమైన శబ్దాలు `ది లాఫింగ్ పోలీస్‌మ్యాన్` పాటలోని శైలిని పోలి ఉంటాయి. స్ఫూర్తి ఏదైనా? దానిని మన సంస్కృతికి తగ్గట్టుగా మలచడంలో మన దిగ్గజాలు చూపిన ప్రతిభ అసాధారణమైనది. సాధారణంగా గొప్ప కళాఖండాలు సృష్టించబడే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కళారూపాల నుండి స్ఫూర్తి పొందడం సహజమే. రవిబాబు వెల్లడించిన ఈ రహస్యం సినీ ప్రేమికుల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. అప్పట్లోనే మన దర్శకులు, సంగీత దర్శకులు ప్రపంచ స్థాయి సినిమాలను, సంగీతాన్ని ఎంతగా ఫాలో అయ్యేవారో? వాటిలోని మంచిని మన ప్రేక్షకులకు ఎలా అందించేవారో ? ఈ ఉదాహరణ తెలియజేస్తుంది.
ఆ స్ఫూర్తిని మేళవించి `మాయాబజార్` వంటి ఒక మాస్టర్ పీస్‌ను మనకు అందించారు. `వివాహ భోజనంబు` పాట వెనుక ఈ హాలీవుడ్ లింక్ ఉన్నా? అది నేటికీ పక్కా తెలుగు పాటగానే మన గుండెల్లో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. స్ఫూర్తి పొందిన పాటతో పోలిస్తే వారు చేసిన క్రియేటివ్ మార్పులు ఆ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. దీంతో పాత తరం టెక్నీషియన్ల విజన్ ఎంత గొప్పదో మరోసారి రుజువైంది. `మాయాబజార్` మ్యాజిక్ లో ఇదొక కొత్త కోణమని చెప్పొచ్చు.
