నాని- సుజీత్ మూవీ.. అప్పుడే డీల్ ఫిక్స్ అయిందా?
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 31 Dec 2025 8:15 AM ISTటాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. నిజానికి సుజీత్ తన గత మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ కన్నా ముందే నాని సినిమాను ప్రకటించారు. ఆ తర్వాత ఏడాది దాటినా ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు.
దీంతో సినిమా రద్దు అయిందని రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని ఓజీ ప్రమోషన్స్ లో సుజీత్ ఖండించారు. నానితో తాను మూవీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమాకు సంబంధించి పలు విషయాలు పంచుకున్నారు. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.
మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం నాని.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ది ప్యారడైజ్ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అది కంప్లీట్ అయ్యాక.. సుజీత్ మూవీ సెట్స్ లోకి నాని అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వినికిడి.
అయితే ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి ఓ వార్త.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూవీ షూటింగ్ మొదలవ్వకముందే ఓటీటీ డీల్ ఫిక్స్ అయిందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్.. రీసెంట్ గా నాని- సుజీత్ మూవీ డిజిటల్ రైట్స్ ను దక్కించుకుందని ఇప్పుడు రూమర్లు వినిపిస్తున్నాయి.
అది కూడా రికార్డు ధరకు ఒప్పందం కుదరిందని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా నిజంగా డీల్ సెట్ అయితే.. సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే అది జరగడం విశేషమనే చెప్పాలి. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాతోపాటు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. సినిమాపై క్రేజ్ అలా ఉందని నెటిజన్లు చెబుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. బ్లడీ రోమియో అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రన్ రాజా రన్ స్టైల్ లో మూవీ ఉంటుందని ఇప్పటికే సుజీత్ తెలిపారు. డార్క్ కామెడీకి కాస్త యాక్షన్ జోడించి చేస్తున్నట్లు చెప్పారు. కొత్త మోడల్ కథ అని పేర్కొన్నారు. 2026 డిసెంబర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా రీసెంట్ గా తెలిపారు.
హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో యాక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. హీరోయిన్ ను త్వరలో ఫిక్స్ చేయనున్నారట. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో చిత్రీకరణ మొదలవ్వనుందని వినికిడి.
