దాయాదీని సైతం కదిలించిన ఇండియన్ బయోపిక్!
బయోపిక్‌లు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాదు. ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపుతుంటాయి.
By: Srikanth Kontham | 1 Aug 2026 9:00 PM ISTబయోపిక్‌లు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాదు. ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపుతుంటాయి. సమాజంలో మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించే కథలు సరిహద్దులు దాటి మరెన్నో ప్రాణాలకు స్ఫూర్తిని ఇస్తుంటాయి. బాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన అథ్లెటిక్ బయోపిక్ చిత్రం `మేరీ కోమ్` ఎంతటి సంచలనాత్మక విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ సినిమా దాయాదీ దేశమైన పాకిస్థాన్‌కు చెందిన ఒక యువతి జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశవుతోంది.
పాకిస్థాన్ దేశం నుంచి తొలి మహిళా కామన్వెల్త్ గేమ్స్ (CWG) బాక్సింగ్ పతక విజేతగా చరిత్ర సృష్టించిన ఫాతిమా జెహ్రా తన విజయానికి అసలు కారణం `మేరీ కోమ్` సినిమానే అని వెల్లడించారు. సాంప్రదాయ కట్టుబాట్లు .. క్రీడలలో మహిళలకు తగినంత ప్రోత్సాహం లేని కఠినమైన వాతావరణం నుంచి వచ్చిన ఫాతిమా చిన్నతనంలో ఈ సినిమాను చూసిన తర్వాతే బాక్సింగ్ వైపు అడుగులు వేశారు. తెరపై మేరీ కోమ్ పడిన కష్టాలు, ఆమె పోరాట పటిమ ఈ యువతిని అమితంగా ఆకట్టుకున్నాయి.
సినిమా చూసి స్ఫూర్తి పొందడమే కాకుండా ఫాతిమా జెహ్రా బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుని కఠినమైన శిక్షణ మొదలు పెట్టారు. సమాజం నుంచి ఎన్నో విమర్శలు, కుటుంబపరమైన సవాళ్లు ఎదురైనప్పటికీ ఫాతిమా వెనకడుగు వేయలేదు. సినిమాలోని రియల్ లైఫ్ పాత్ర తనలో నింపిన ఆత్మవిశ్వాసంతో గ్లోబల్ వేదికలపై పాకిస్థాన్ జెండాను ఎగరేయాలనే కసితో ముందుకు సాగారు. ప్రతిరోజూ జిమ్‌లో చెమటోడ్చిన కష్టం చివరకు ఆమెను ఒక అథ్లెటిక్‌గా దేశం గర్వించదగ్గ స్థాయికి చేర్చింది.
అనుకున్నట్లుగానే ఫాతిమా జెహ్రా అంకితభావం ఆమెను అగ్రగామిగా నిలబెట్టింది. కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్ విభాగంలో పాకిస్థాన్ తరఫున పతకం సాధించిన మొట్టమొదటి మహిళా బాక్సర్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఫాతిమా సాధించిన ఈ చారిత్రక విజయం కేవలం ఆమె కుటుంబానికే కాకుండా పాకిస్థాన్‌లోని క్రీడా రంగంలో సరికొత్త చరిత్రను సృష్టించింది. ఒక సినిమా ఒక సాధారణ యువతిని ఏ స్థాయికి తీసుకువెళ్లగలదో? అనడానికి ఫాతిమా ప్రయాణం సజీవ సాక్ష్యంగా నిలిచింది.
ఈ అద్భుతమైన విజయం వెనుక ఉన్న స్ఫూర్తిని గుర్తించిన నెటిజన్లు ప్రియాంక చోప్రా నటనను , ఆ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తున్నారు. కళకు, మంచి కథలకు కులమతాలు, సరిహద్దులు లేవని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు అని ఫాతిమా నిరూపించగా అలాంటి కసిని నింపే శక్తి మంచి సినిమాలకు ఉంటుందని మరోసారి రుజువైంది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పేరును గర్వపడేలా చేసిన ఒక సినిమా శత్రు దేశంలో ఇలాంటి విప్లవం సృష్టించడం విశేషం.
ముగింపుగా ప్రియాంక చోప్రా నటించిన `మేరీ కోమ్` కమర్షియల్ బయోపిక్‌గా మాత్రమే మిగిలిపోకుండా, సరి హద్దులు దాటి ఒక యువతికి ధైర్యాన్నిచ్చిన అద్భుతమైన శక్తిగా నిలిచింది. ఫాతిమా జెహ్రా సాధించిన విజయం ప్రతి ఒక్కరికీ ఇన్‌స్పిరేషన్. కళా సృష్టి సమాజంలో ఎంతటి సానుకూల మార్పును తీసుకురాగలదో? చెప్పడానికి ఈ సంఘటన చక్కటి నిదర్శనం.
