మారుతి ఖాయమైనట్లేనా?
ఒక మిడ్ రేంజ్ దర్శకుడికి కు ఒక టాప్ స్టార్‌తో సినిమా చేసే అవకాశం వస్తే అదృష్టం అంటే తనదే అన్న అభిప్రాయం కలుగుతుంది.
By: Garuda Media | 29 Jun 2026 7:45 PM ISTఒక మిడ్ రేంజ్ దర్శకుడికి కు ఒక టాప్ స్టార్‌తో సినిమా చేసే అవకాశం వస్తే అదృష్టం అంటే తనదే అన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే జరిగే డ్యామేజ్ కూడా మామూలుగా ఉండదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమా తీసిన పరశురామ్ పెట్ల పరిస్థితి తర్వాత ఏమైందో తెలిసిందే. ఇదే బాటలో మారుతి కూడా ప్రభాస్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు.
వీరి కలయికలో వచ్చిన ‘రాజా సాబ్’ పెద్ద డిజాస్టర్ అయి మారుతి మీద ప్రభాస్ ఫ్యాన్స్‌లో తీవ్ర వ్యతిరేకతను పెంచింది. ఈ మధ్య కాలంలో ఏ దర్శకుడూ ఎదుర్కోనంత ట్రోలింగ్‌ను అతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ట్రోలింగ్ అదీ చూస్తే మారుతితో ఇంకో స్టార్ ఎవరైనా పని చేస్తారా.. పేరున్న నిర్మాతలు ఎవరైనా తనతో సినిమా తీస్తారా అన్న సందేహాలు కలిగాయి. కానీ కొంచెం టైం తీసుకుని అయినా మారుతి మంచి ప్రాజెక్టే సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో మాస్ రాజా రవితేజ హీరోగా మారుతి సినిమా దాదాపు ఓకే అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే బేనర్లో రవితేజ హీరోగా వివేక్ ఆత్రేయ సినిమా చేయొచ్చని వార్తలు వచ్చాయి. బాలయ్యతో సినిమా వర్కవుట్ అయ్యేలా లేకపోవంతో వివేక్ చూపు రవితేజపై పడినట్లు గుసగుసలు వినిపించాయి. కానీ ఇప్పుడు మళ్లీ బాలయ్యతో వివేక్ సినిమా ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు మారుతి చెప్పిన కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. మైత్రీ సంస్థలోనే ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. కాకపోతే రవితేజ లైనప్ ఆల్రెడీ ప్యాక్డ్‌గా ఉండడంతో ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా టైం పట్టొచ్చు. ఐతే ‘రాజాసాబ్’ అనుభవం దృష్ట్యా మారుతి కూడా ఈసారి జాగ్రత్తగా, పకడ్బందీగా స్క్రిప్టును రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆలస్యమైనా అతను అంత వరకు వెయిట్ చేస్తాడనడంలో సందేహం లేదు.
