పిక్‌టాక్ : రాజాసాబ్ సెట్‌లో మారుతి... ఫ్యాన్స్‌కి ఎప్పుడో?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
By: Ramesh Palla | 13 Oct 2025 10:09 AM ISTప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయాల్సి ఉన్నా కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ముఖ్యంగా సినిమా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అవన్నీ ఒట్టి పుకార్లే అని మేకర్స్ తేల్చి పారేశారు. మూడు ఏళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు గాను రాజాసాబ్ రెడీ అవుతున్నాడు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదు అంటూ ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మారుతి సైతం అదే జోష్ తో ఉన్నాడు. ప్రస్తుతం యూరప్ లో ఈ సినిమాకి సంబంధించిన చివరి దశ షూటింగ్ జరుగుతున్నట్లు మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది.
ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ అప్‌డేట్
ఇటీవల రాజాసాబ్ సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్ ఫోటోలు బయటకు వచ్చాయి. యూరప్ లో అందమైన లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని బలంగా కోరుకున్నప్పటికీ అది సాధ్యం కావడం లేదు. ఆయన ఫ్యాన్స్‌కి ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో నిరాశ తప్పడం లేదు. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ రాజాసాబ్ సినిమా వచ్చి ఉంటే ఖచ్చితంగా ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్ దక్కేది. అయితే వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో ఆలస్యం అవుతున్న కారణంగా సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు సినిమాను ముగించి వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకు వచ్చే ఉద్దేశంతో దర్శకుడు మారుతి వీఎఫ్‌ఎక్స్ వర్క్ వేగవంతం చేయడంతో పాటు, బ్యాలన్స్ షూటింగ్ వర్క్‌ను ముగించే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుతి ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
మారుతి టీ షర్ట్ పై ప్రభాస్ ఫోటో
ప్రభాస్ రాజాసాబ్ పోస్టర్‌ను కలిగి ఉన్న టీ షర్ట్ ను మారుతి ధరించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగానే మారుతి చాలా విభిన్నంగా సినిమాను ప్రమోట్ చేస్తాడు అంటారు. అలాంటి మారుతి ఇప్పుడు ఇలాంటి ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ధరించిన రాజాసాబ్ ఫ్యాన్స్ కి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది సర్ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఇలాంటి టీ షర్ట్స్ కావాలని డిమాండ్ మొదలు పెట్టారు. అంతే కాకుండా సినిమా నుంచి అప్‌డేట్స్ కావాలని కోరుతున్నారు. మొత్తానికి రాజాసాబ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరగడంలో మారుతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రమోషన్ మొదలు పెట్టకుండానే సినిమాకు బోలెడంత పబ్లిసిటీ దక్కే విధంగా మారుతి చేశాడు అనడంలో సందేహం లేదు.
మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్‌గా
ఈ హర్రర్ థ్రిల్లర్ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచాయి. ప్రభాస్ కామెడీ టైమింగ్‌ను చాలా కాలం తర్వాత చూడబోతున్నామని ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతుంది. అంతే కాకుండా ఈ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చే విధంగా హర్రర్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని అంటున్నారు. మొత్తానికి వెయ్యి కోట్ల మెటీరియల్ రెడీ అవుతోంది. ప్రభాస్ కు మరో ట్రేడ్ మార్క్ మూవీగా రాజాసాబ్ నిలుస్తుందని అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధించబోతున్న రికార్డ్‌లను నమోదు చేయడం కోసం బాక్సాఫీస్ వర్గాల వారు రెడీగా ఉండాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ లు హీరోయిన్స్‌గా నటించగా, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
