Begin typing your search above and press return to search.

'రాజా సాబ్' మారుతి.. ఫ్యాన్స్ 'మొర' వింటారా?

అంతే కాదు, ప్రభాస్ ఎలా కోరుకున్నాడో అచ్చంగా అలాగే రాజా సాబ్ ను తీశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పగా.. అది కూడా చాలా మంది అభిమానులకు నచ్చలేదు.

By:  M Prashanth   |   4 Jan 2026 6:10 PM IST
రాజా సాబ్ మారుతి.. ఫ్యాన్స్ మొర వింటారా?
X

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మారుతి ఇప్పుడు రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఆ సినిమా.. సంక్రాంతికి పండుగ కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ముందు రోజు ప్రీమియర్స్ కూడా ఉన్నాయి.

ప్రస్తుతం ఓవైపు రాజా సాబ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్న మారుతి.. మరోవైపు ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆ సమయంలో సినిమాకు సంబంధించిన పలు విషయాలను కూడా పంచుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే వివిధ ఇంటర్వ్యూలు ఇచ్చిన మారుతి.. రాజా సాబ్ మూవీలో ఉపయోగించిన గ్రాఫిక్స్, ఏఐ టెక్నాలజీ, బాడీ డబుల్ వినియోగం, క్లైమాక్స్ సన్నివేశం సహా హీరోకు ఇచ్చిన ప్రాధాన్యత వంటి అనేక అంశాలపై మాట్లాడారు. ఆ సమయంలో చేసిన కామెంట్స్ లో కొన్ని కొందరు ప్రభాస్ అభిమానులకు అంతగా నచ్చినట్లు లేవు.

అంతే కాదు, ప్రభాస్ ఎలా కోరుకున్నాడో అచ్చంగా అలాగే రాజా సాబ్ ను తీశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పగా.. అది కూడా చాలా మంది అభిమానులకు నచ్చలేదు. దర్శకుడిగా తనపై ఉన్న నమ్మకాన్ని చెప్పడం కంటే, మొత్తం క్రెడిట్‌ ను ప్రభాస్ అభిప్రాయాలపైనే పెట్టినట్లుగా ఆ వ్యాఖ్యలు అనిపించాయని పలువురు ఇప్పటికే అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో మారుతి చెప్పాలనుకున్న విషయం ఒకటైతే.. అది బయటకు వచ్చే విధానం మరోలా ఉందన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. చిన్న చిన్న ఇంటర్వ్యూ క్లిప్పులు నెట్టింట ఫుల్ గా వైరల్ అవుతుండటంతో.. అవి ట్రోలర్స్ కు మెటీరియల్ గా మారాయి. దీంతో కొందరు అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇంటర్వ్యూల్లో కొంచెం నెమ్మదిగా మాట్లాడండని, కొన్ని విషయాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలని మారుతిని కోరుతున్నారు. ఇంకొందరు.. సినిమాపై ఇప్పుడు ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ఫలితం మాట్లాడేలా చేయాలని అంటున్నారు. మూవీ హిట్ అయితే.. ఎంత ఫ్రీగా మాట్లాడినా పర్లేదని కామెంట్లు పెడుతున్నారు.

ఎందుకంటే కొన్ని విషయాలు మీమ్స్ గా మారడం వల్ల సినిమాపై ప్రభావం చూపుతాయేమోనని అభిమానులు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. మీమ్స్, ట్రోల్స్ వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు డైరెక్టర్ మారుతి.. రాజా సాబ్ మూవీ విషయంలో డార్లింగ్ ఫ్యాన్స్ 'మొర' వింటారో లేదో వేచి చూడాలి.