డైరెక్టర్ మారుతి ఈ టెస్ట్‌ని పాసవుతాడా?
`బాహుబలి` తరువాత ప్రతి హీరో.. కొంత మంది డైరెక్టర్లు మినహా యంగ్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా జపం చేస్తూ ఇండియా వైడ్‌గా తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.
By: Tupaki Entertainment Desk | 19 Dec 2025 12:03 PM IST`బాహుబలి` తరువాత ప్రతి హీరో.. కొంత మంది డైరెక్టర్లు మినహా యంగ్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా జపం చేస్తూ ఇండియా వైడ్‌గా తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. తమకు వచ్చిన అవకాశాన్ని పాన్ ఇండియాగా మలుస్తూ కొంత మంది సక్సెస్ అవుతుంటే మరి కొంత మంది మాత్రం విఫలమవుతున్నారు. రాజమౌళి నుంచి యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల వరకు పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకున్నారు. తమ తదుపరి సినిమాలని కూడా పాన్ ఇండియా అంటూ హంగామా చేస్తున్నారు.
వీరి తరహాలోనే డైరెక్టర్ మారుతి ఇప్పుడు పాన్ ఇండియా ఫీట్‌కు రెడీ అయిపోయాడు. ఆయన డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ `ది రాజా సాబ్`. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడమే కాకుండా ఈ ప్రాజెక్ట్‌పై మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. కానీ ప్రాజెక్ట్ డిలే కావడం.. అప్ డేట్‌లు కూడా ఆలస్యంగా బయటికి రావడంతో ప్రభాస్ అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి.
మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ పాన్ ఇండియా సినిమా అన్నప్పుడు ఫ్యాన్స్ ఒకింత షాక్‌కు గురయ్యారు. మారుతి అంత పెద్ద బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించగలడా? ప్రభాస్ క్రేజ్ కు తగ్గట్టుగా సినిమాని రూపొందించగలడా? అనే అనుమానాల్ని వ్యక్తం చేశారు. ఫస్ట్ టీజర్ రిలీజ్ తరువాత గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని నెట్టింట ట్రోల్ చేశారు. ఇప్పటికే `ది రాజా సాబ్` ఏదో ఒక విషయంలో ట్రోలింగ్ కు గురవుతూనే ఉంది. ఈ స్థాయిలో `ఆదిపురుష్` తరువాత ప్రభాస్ సినిమా ట్రోలింగ్‌కు గురి కావడం ఇది రెండవ సారి.
తాజాగా ఈ మూవీకి సంబంధించి `సహనా..సహనా..` అంటూ సాగే పాటని మేకర్స్ రిలీజ్ చేస్తే దీనిపై కూడా ట్రోలింగ్ మొదలైంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు మారుతిపై నెట్టింట ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. మారుతికి `ది రాజా సాబ్` ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్. అంతే కాకుండా హ్యూజ్ మార్కెట్ ఉన్న స్టార్ హీరోతో మారుతి చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. భారీ బడ్జెట్, స్టార్ హీరో సినిమా, అందులోనూ ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో డైరెక్టర్‌గా మారుతి అత్యంత క్లిష్టమైన ఈ టెస్ట్‌ని పాసవుతాడా? అని సర్వత్రా చర్చ జరుగుతోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యంత భారీ స్థాయిలో, భారీ కాస్టింగ్‌తో రూపొందిన ఈ సినిమా బిజినెస్ మాత్రం ప్రభాస్ క్రేజ్‌కు తగ్గట్టే జరుగుతోంది. అయితే మారుతి ప్రభాస్ క్రేజ్‌కు తగ్గట్టుగా `ది రాజా సాబ్`ని తెరపైకి తీసుకొచ్చాడా? తీసుకొస్తే మాత్రం అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ల జాబితాలో చేరిపోవడం గ్యారంటీ అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
