మరోసారి విల్లా నెం.17 కి ఫ్యాన్స్ వెళ్లాల్సిందేనా?
విల్లా నె.17, కొల్లా లగ్జూరియా, కొండాపూర్, హైదరాబాద్... ఈ అడ్రస్‌కి ఈ ఏడాది ఆరంభంలో ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే.
By: Ramesh Palla | 25 Oct 2026 3:00 PM ISTవిల్లా నె.17, కొల్లా లగ్జూరియా, కొండాపూర్, హైదరాబాద్... ఈ అడ్రస్‌కి ఈ ఏడాది ఆరంభంలో ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఈ అడ్రస్ ఇప్పటికే ఎవరిదో గుర్తుకు వచ్చి ఉంటుంది. ఔను... దర్శకుడు మారుతి ఇంటి అడ్రస్ ఇది. రాజాసాబ్ సినిమా ప్రమోషన్ సమయంలో మారుతి ఈ సినిమా కచ్చితంగా అందరినీ మెప్పిస్తుంది, ఒకవేళ సినిమా నచ్చక పోతే నా ఇంటికి వచ్చి అడగండి అంటూ తన అడ్రస్‌ను ఆ సమయంలో మారుతి ఇవ్వడం జరిగింది. సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఫలితం ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ఆ సమయంలో మారుతిని ఏ స్థాయిలో ట్రోల్ చేశారో, ఏ స్థాయిలో ఆయన్ను రోస్ట్ చేశారో చూశాం. కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ ఏకంగా మారుతి ఇచ్చిన అడ్రస్ కి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయడం మనం చూశాం. కొల్లా లగ్జూరియా వద్ద రెండు రోజులు ఓ రేంజ్ లో హడావిడి నడిచింది.
మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ...
ఈ ఏడాది ఆరంభంలో ప్రభాస్ సినిమా రాజాసాబ్‌తో మారుతి వచ్చాడు. సినిమా వచ్చి దాదాపు ఏడాది కావస్తుంది. కానీ ఇప్పటి వరకు మారుతి కొత్త సినిమాను ప్రకటించలేదు. రాజాసాబ్ ఫెయిల్ అయినా ఆయన నుంచి వచ్చిన పలు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో మారుతికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది. ఆయన మార్క్ సినిమాలను ఇష్టపడే వారు ఆయన నుంచి కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఆయన కొత్త సినిమా ప్రకటన ఉంటుందని, అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని రెండు నెలల క్రితం ఇండస్ట్రీలో చర్చ జరిగింది. ఒక యంగ్ స్టార్ హీరోతో మారుతి సినిమా ఉంటుందని, కథ దాదాపుగా ఫైనల్ అయింది, స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన తర్వాత సినిమాను ప్రకటిస్తారని అంతా ఎదురు చూశారు. కానీ ఇప్పటి వరకు ఆ సినిమా అప్‌డేట్ లేదు.
ప్రభాస్ రాజాసాబ్ ఫలితం...
దర్శకుడు మారుతి దర్శకుడిగా వరుస సినిమాలు చేశాడు. రాజాసాబ్ కాస్త ఆలస్యం అయింది కానీ, అంతకు ముందు ఆయన నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చాయి. కానీ రాజాసాబ్ ఫలితం కారణంగా మారుతి కొత్త సినిమాకు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. రాజాసాబ్ వల్లే ఎక్కువ సమయం వృధా అయింది అంటే ఇప్పుడు మరింత సమయం ను మారుతి వృధా చేస్తున్నాడు అంటూ ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజులు చూసి మారుతి ఫ్యాన్స్ ఆయన గతంలో చెప్పిన విల్లా నెం.17కి వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన సినిమాలంటే ఇష్టపడేవారు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అసహనంతో ఆయన ఇంటికి వెళ్లినా ఆశ్చర్యం లేదు అనిపిస్తుంది.
దర్శకుడు మారుతి కొత్త సినిమా సంగతి ఏంటి?
మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ హిట్ అనే అభిప్రాయం ఉండేది. రాజాసాబ్ సినిమాకు ముందు వరకు మారుతి ఒక మంచి దర్శకుడిగా అందరితోనూ ప్రశంసలు దక్కించుకున్నాడు. ఎప్పుడైతే ప్రభాస్‌తో రాజాసాబ్ సినిమాను చేశాడో అప్పటి నుంచి ఆయన్ను రెబల్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ వస్తున్నారు. వారికి ధీటుగా మారుతి ఫ్యాన్స్ సమాధానం చెబుతూ వస్తున్నారు. రాజాసాబ్ ఫలితంను పక్కన పెట్టి, ఆ ఫ్లాప్ నుంచి బయటకు వచ్చి మారుతి కొత్త సినిమా చేయాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. వారి కోసం అయినా మారుతి కొత్త సినిమాను మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. 2026 మారుతికి కలిసి రాలేదని, అందుకే 2027లో ఆయన కొత్త సినిమా ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు ఇండస్ట్రీకి చెందిన వారు మాట్లాడుతున్నారు. అదే నిజం అయితే 2027 సంక్రాంతికి మారుతి కొత్త సినిమా ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విషయమై మారుతి నుంచి రియాక్షన్ ఏంటో చూడాలి.
