Begin typing your search above and press return to search.

బిగ్ డే.. మారుతి నిలబడతాడా?

13 ఏళ్ల ముందు డిజిటల్ కెమెరాతో కేవలం రూ.40 లక్షల ఖర్చుతో ‘ఈ రోజుల్లో’ అనే చిన్న సినిమా తీసి పెను సంచలనమే సృష్టించాడు మారుతి.

By:  Garuda Media   |   8 Jan 2026 6:02 PM IST
బిగ్ డే.. మారుతి నిలబడతాడా?
X

13 ఏళ్ల ముందు డిజిటల్ కెమెరాతో కేవలం రూ.40 లక్షల ఖర్చుతో ‘ఈ రోజుల్లో’ అనే చిన్న సినిమా తీసి పెను సంచలనమే సృష్టించాడు మారుతి. ఆ సినిమా ఏకంగా రూ.15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీకి పెద్ద షాకే ఇచ్చింది. రెండో సినిమా ‘బస్ స్టాప్’ దీన్ని మించి సక్సెస్ అయింది. ఐతే ఈ రెండు సినిమాలతో విజయాలు అందుకున్నప్పటికీ.. బూతు డైరెక్టర్ అని ఒక ముద్ర వేయించుకున్నాడు మారుతి.

తన స్క్రిప్టుతో రూపొందిన ‘ప్రేమకథా చిత్రమ్’తో ఇంకా పెద్ద సంచలనం రేపి.. ఆపై నానితో ‘భలే భలే మగాడివోయ్’ లాంటి క్లీన్ ఎంటర్టైనర్ తీసి ముందు ఉన్న ఇమేజ్ మొత్తం చెరిగిపోయేలా చేసుకున్నాడు మారుతి. విక్టరీ వెంకటేష్ లాంటి పెద్ద హీరో తనతో ‘బాబు బంగారం’ చేశాడు. అది ఆడకపోయినా మహానుభావుడు, ప్రతిరోజూ పండగే సినిమాలతో విజయాలు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం అతడికి కలిసి రాలేదు. మంచి రోజులు వచ్చాయి, పక్కా కమర్షియల్ డిజాస్టర్లు అయ్యాయి.

నాలుగేళ్ల ముందు మారుతి ఉన్న ఫాంలో అతడితో మిడ్ రేంజ్ హీరోలు సినిమాలు చేయడమే కష్టమే అనిపించింది.

అలాంటిది ప్రభాస్‌తో ‘రాజాసాబ్’ లాంటి భారీ చిత్రం చేసే అవకాశాన్ని అందుకున్నాడు. అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగానే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు భయపడి ప్రారంభోత్సవం కూడా జరపలేదు. కానీ ఈ సినిమా ప్రోమోలు చూశాక వాళ్ల భయాలన్నీ తొలగిపోయాయి. మారుతిని తిట్టడం ఆపేసి పొగడ్డం మొదలుపెట్టాడు. ప్రభాస్ రేంజికి తగ్గ భారీ చిత్రాన్ని తీసి అభిమానుల్లో అంచనాలు పెంచాడు. సినిమా మొదలైనపుడు మారుతి స్థాయిలో ప్రభాస్ ఏదో మిడ్ రేంజ్ మూవీ చేస్తాడనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా రేంజే మారిపోయింది.

కల్కి లాంటి భారీ చిత్రానికి ఏమాత్రం తీసిపోని స్కేల్ కనిపిస్తోంది. అంచనాలూ తక్కువ లేవు. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర అనుకోకుండా అన్నీ కలిసొస్తున్నాయి. వరల్డ్ వైడ్ ఎవ్వరూ ఊహించనంత స్థాయిలో భారీగా సినిమా రిలీజవుతోంది. మారుతి ఇంత పెద్ద సినిమా తీస్తాడని.. దానికింత హైప్ వస్తుందని.. ఇంత భారీ స్థాయిలో రిలీజవుతుందని కొన్నేళ్ల ముందు ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ సినిమాతో అతను అంచనాలను అందుకుంటే, సినిమా విజయవంతం అయితే.. మిడ్ రేంజ్ దర్శకులు కూడా భారీ కలలు కనొచ్చని.. వెండితెరపై అద్భుతాలు ఆవిష్కరించవచ్చనే కాన్ఫిడెన్స్ వస్తుంది. నిర్మాతల్లో కూడా అలాంటి దర్శకులపై నమ్మకం పెరుగుతుంది. మరి బిగ్ డేకి ప్రభాస్ అభిమానులు కోరుకున్న సినిమాను మారుతి డెలివర్ చేస్తాడా?