Begin typing your search above and press return to search.

మారుతి అంత వేస్ట్ చేశాడంటే నమ్మేలా ఉందా?

టాలీవుడ్‌లో నిర్మాతలకు డబ్బులు సేవ్ చేయడంలో దర్శకుడు మారుతికి ఒక ప్రత్యేకమైన పేరుంది.

By:  M Prashanth   |   3 Feb 2026 12:09 PM IST
మారుతి అంత వేస్ట్ చేశాడంటే నమ్మేలా ఉందా?
X

టాలీవుడ్‌లో నిర్మాతలకు డబ్బులు సేవ్ చేయడంలో దర్శకుడు మారుతికి ఒక ప్రత్యేకమైన పేరుంది. 'ప్రేమకథా చిత్రం', 'మంచి రోజులొచ్చాయి' వంటి సినిమాలను తక్కువ బడ్జెట్‌లో, ఒకే లొకేషన్‌లో జెట్ స్పీడ్‌తో ఫినిష్ చేసిన ఘనత ఆయనది. సినిమా మేకింగ్‌లో అనవసరపు ఖర్చును అస్సలు ఇష్టపడని మారుతి, 'ది రాజా సాబ్' విషయంలో మాత్రం సుమారు 50 కోట్ల విలువైన ఒక గంట ఫుటేజ్‌ను వృథా చేశారనే వార్త ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక ఫ్లాప్ ఎదురైనప్పుడు ఇలాంటి లోపాలు మరింత ఎక్కువగా హైలైట్ అవ్వడం సహజం.

నిజానికి మారుతి బడ్జెట్ విషయంలో చాలా సిద్ధహస్తుడు. నిర్మాత జేబుకు చిల్లు పడకుండా ప్లాన్ చేయడంలో ఆయన టాప్ ప్లేస్‌లో ఉంటారు. అయితే 'రాజా సాబ్' స్థాయి వేరు. ఇది ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో చేస్తున్న భారీ ప్రాజెక్ట్. బహుశా ప్రభాస్ ఇమేజ్ కోసం మధ్యలో కథలో చేసిన మార్పులు, గ్రాఫిక్స్ పనుల్లో జరిగిన జాప్యం వల్ల షూటింగ్ అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు సాగి ఉండవచ్చు. దీనివల్ల మారుతి తన రెగ్యులర్ మేకింగ్ స్టైల్‌ను ఫాలో అవ్వలేకపోయారని అర్థమవుతోంది.

సినిమా చూసిన ఆడియన్స్ నుండి కూడా కొన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. కొన్ని సీన్స్ కథకు అసలు సంబంధం లేకుండా ఎందుకు పెట్టారో అర్థం కాలేదనే టాక్ వినిపించింది. సుమారు గంట నిడివి గల ఫుటేజ్‌ను ఎడిటింగ్‌లో తీసేయడం అంటే అది మారుతి లాంటి దర్శకుడికి కచ్చితంగా ఇష్టం ఉండదు. కానీ ప్రభాస్ ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేసే క్రమంలో కొన్ని సీన్లు షూట్ చేయడం, ఆ తర్వాత అవి సరిగ్గా కుదరక పక్కన పెట్టేయడం వల్ల ఈ ఆర్థిక నష్టం వాటిల్లి ఉండవచ్చని తెలుస్తోంది. చివరికి పార్ట్ 2 కోసం వాడాలని అనుకున్నా సినిమా రిజల్ట్ కారణంగా రెండోసారి రిస్క్ చేయకపోవచ్చు.

ఏదేమైనా పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే మారుతి కూడా ఏమి చేయలేని పరిస్థితిలోకి వెళ్లి ఉండవచ్చని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పెద్ద సినిమాల విషయంలో గ్రాఫిక్స్ ఆలస్యమైతే ఆటోమేటిక్ గా వడ్డీలు, కాల్షీట్ల సమస్యలతో బడ్జెట్ పెరిగిపోతుంది. మారుతి ఎప్పుడూ నిర్మాతలకు మేలు చేయాలనే చూస్తారు కానీ, 'రాజా సాబ్' విషయంలో మారిన సమీకరణాల వల్ల ఆయన కంట్రోల్ తప్పినట్లు కనిపిస్తోంది. భారీ ప్రాజెక్టుల ఒత్తిడిలో ఆయన సహజ సిద్ధమైన మేకింగ్ స్పీడ్ ఎఫెక్ట్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక 45 శాతం పైగా థియేట్రికల్ నష్టాలు రావడం ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది. మారుతి వంటి పొదుపు తెలిసిన దర్శకుడి సినిమాలోనే ఇంత వృథా జరిగిందంటే, అది కేవలం పరిస్థితుల ప్రభావమే అని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఈ ఫెయిల్యూర్ నుండి పాఠాలు నేర్చుకుని, మారుతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తన ఓల్డ్ స్టైల్ పక్కా ప్లానింగ్‌తో పట్టాలెక్కిస్తారో లేదో చూడాలి.