Begin typing your search above and press return to search.

ఎడిట‌ర్ ఆవేద‌న‌: ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా ప‌ట్టించుకోని శాఖ ఇది!

సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన అంచనాలు తప్పిన సినిమాలు ఎన్టీఆర్ నటించిన ‘శక్తి’, ‘ఆంధ్రావాలా’ అని తెలిపారు. షూటింగ్ సమయంలో కథలో మార్పులు జరగడం వల్లే అవి ఫ్లాప్ అయ్యాయని చెప్పారు. ఫీల్ గుడ్, ఎమోషనల్ డ్రామాలను ఎడిట్ చేయడం కష్టమని, కమర్షియల్ సినిమాలతో పోలిస్తే ప్రతి ఫ్రేమ్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుందని వివరించారు.

By:  Sivaji Kontham   |   9 Nov 2026 9:10 AM IST
ఎడిట‌ర్ ఆవేద‌న‌: ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా ప‌ట్టించుకోని శాఖ ఇది!
X

సినిమా 24 శాఖ‌ల్లో 14 శాఖ‌లు అత్యంత కీల‌క‌మైన‌వి. ఇందులో ఎడిటింగ్ శాఖ ఒక‌టి. కానీ ఈ శాఖ‌కు వేదిక‌ల‌పై ద‌క్కే గుర్తింపు చాలా త‌క్కువ‌. ఏదైనా సినిమా ప్ర‌మోష‌న్ లేదా అవార్డుల వేడుక‌లో ప్ర‌త్యేకించి ఎడిట‌ర్ల‌కు గుర్తింపు ఏదీ ఉండ‌దు. హైప్ అస‌లే ఉండ‌దు. న‌టీన‌టులు, సంగీత ద‌ర్శ‌కుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌ల‌ను హైలైట్ చేసిన‌ట్టుగా వేదిక‌ల‌పై ఎడిట‌ర్లకు గుర్తింపు ద‌క్క‌దు. వీళ్ల‌ను బ్యాక్ బెంచీకే ప‌రిమితం చేస్తుంటారు.

ఇలాంటి కార‌ణాల వ‌ల్ల‌నే తాను క‌నీసం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు లేదా ఫంక్ష‌న్ల‌కు వెళ్ల‌న‌ని చాలా ఇంట‌ర్వ్యూల‌లో చెప్పారు సీనియ‌ర్ ఎడిట‌ర్ మార్తాండ్ కే వెంక‌టేష్. ఎడిట‌ర్ క‌ష్టం ఎలాంటిదో ప‌రిశ్ర‌మ‌కు కానీ, ప్ర‌జ‌ల‌కు కానీ తెలియ‌ద‌ని అంటారాయ‌న‌. ఏదైనా సినిమాకి మొద‌టి ప్రేక్ష‌కుడు ఎడిట‌ర్. అత‌డు సినిమా చూసిన త‌ర్వాతే అది బ‌య‌ట‌కు వెళుతుంది. ఆ సినిమాలో ఏ త‌ర‌హా భావోద్వేగాలున్నాయి. ఏ సినిమా హిట్ట‌వుతుంది? ఏది ఫ్లాప‌వుతుంది? అనేది ముందుగా నిర్ధేశించేది ఎడిట‌ర్. రా ఫుటేజ్ నుంచి ఏది క‌ట్ చేయాలి? ఏది ఉంచాలో నిర్ణ‌యించేది ఎడిట‌రే. ద‌ర్శ‌కుడితో క‌లిసి ఆ ప‌ని చేస్తాడు. తాను ఎడిట్ చేసిన వాటిలో 90శాతం సినిమాల ఫ‌లితాన్ని తాను ముందే ఊహించి చెప్పాన‌ని కూడా మార్తాండ్ కే తెలిపారు.

సినిమాలో ఎమోష‌న‌ల్ కంటెంట్ రేంజు ఎలా ఉందో కూడా ఎడిట‌రే ముందుగా తెలుసుకుంటాడు. ఏ షాట్ ని ఎలా క‌ట్ చేస్తే ఎమోష‌న్ ని పెంచ‌గ‌లం.. థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఎక్కువ సేపు ఎంగేజ్ చేసేలా.. భావోద్వేగానికి గుర‌య్యేలా ఎమోష‌న్ ని సాగ‌దీయ‌డం లేదా సినిమా మేకింగ్ లో ఉన్న చాలా లోపాల‌ను స‌వ‌రించ‌డం కూడా ఎడిట‌ర్ ప‌ని. దీనిని స‌జావుగా నిర్వ‌హిస్తూ ఎన్నో అవార్డులు, రివార్డుల‌ను అందుకున్నారు మార్తాండ్ కే వెంక‌టేష్‌. వంద‌లాది చిత్రాల‌కు ప‌ని చేసిన అనుభ‌వం ఆయ‌న‌కు ఉంది.

తాజా ఇంట‌ర్వ్యూలో మార్తాండ్ కే తాను రెండే రెండు సినిమాల విష‌యంలో రిజ‌ల్ట్ ను త‌ప్పుగా అంచ‌నా వేసానని చెప్పారు. అందులో ఒక‌టి- శ‌క్తి, రెండోది -ఆంధ్రావాలా. ఈ రెండిటి విష‌యంలో మొద‌ట ద‌ర్శ‌కులు చెప్పిన క‌థ ఒక‌టి.. ఎడిటింగ్ టేబుల్ పైకి వ‌చ్చిన ఫుటేజీ ఒక‌టి. క‌థ మారిపోవ‌డం వ‌ల్ల‌నే అవి రెండూ ఫ్లాపుల‌య్యాయ‌ని కూడా మార్తాండ్ కే తెలిపారు. ఆ రెండు సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ లో ఎంత పెద్ద డిజాస్ట‌ర్లో తెలిసిందే. ద‌ర్శ‌కులు ఆన్ సెట్ స్క్రిప్టులో మార్పులు చేయ‌డం వ‌ల్ల‌నే అవి ఫ్లాపయ్యాయి.

ఏ జాన‌ర్‌కి ఎడిటింగ్ చేయ‌డం క‌ష్టం?

వాస్త‌వానికి ఏ జానర్ సినిమాకి ఎడిటింగ్ చేయ‌డం క‌ష్టం? అని మార్తాండ్ కే లాంటి సీనియ‌ర్ ఎడిట‌ర్ ని ప్ర‌శ్నిస్తే.. దానికి స‌మాధానం.. ఫీల్ గుడ్- డ్రామా ల‌ను ఎడిట్ చేయ‌డం చాలా శ్ర‌మ‌తో కూడుకున్న‌ద‌ని అన్నారు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ హంగులు ఉండే సినిమాని ఎడిట్ చేయ‌డం చాలా సులువు. ఇందులో స్టోరీ ర‌న్ అయ్యేది కేవ‌లం 50 నిమిషాలే ఉంటే మిగ‌తా సినిమా అంతా పాట‌లు, ఫైట్లు ఉంటాయి. వాటిని ఎడిట్ చేసి త‌న ప‌నిని త్వ‌ర‌గా ముగించేయ‌డం సులువు అని కూడా తెలిపాడు. అలా కాకుండా ఫీల్ గుడ్ ఎమోష‌న‌ల్ డ్రైవ్ ఉన్న చిత్రాల్లో అయితే ఎడిటింగ్ కోసం ప్ర‌తి ఫ్రేములో చాలా శ్ర‌మించాల్సి ఉంటుంద‌ని వెల్ల‌డించారు.