Begin typing your search above and press return to search.

మార్చి బాక్సాఫీస్.. ఎలా ఉండనుంది?

పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు మోస్తరు కంటెంట్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాయి

By:  M Prashanth   |   3 March 2026 4:52 PM IST
మార్చి బాక్సాఫీస్.. ఎలా ఉండనుంది?
X

ఫిబ్రవరి నెల టాలీవుడ్‌ కు ఊహించినంతగా కలిసి రాలేదు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు మోస్తరు కంటెంట్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాయి. దీంతో థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, బయర్స్ నిరాశ వ్యక్తం చేశారు. ఇప్పుడు అందరి దృష్టి మార్చి పై పడింది. ఈ నెలైనా ఊరట ఇస్తుందా? అన్న ఆశతో వెయిట్ చేస్తున్నారు.

గత నెలలో విడుదలైన యుఫోరియా సినిమా మంచి కథతో వచ్చినప్పటికీ పెద్దగా కలెక్షన్లు సాధించలేదు. దర్శకుడు గుణశేఖర్ మార్క్ కనిపించినా ప్రేక్షకులు థియేటర్లకు రప్పించలేదు. అలాగే విశ్వక్ సేన్ నటించిన ఫంకీ, సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ, అలాగే శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం సత్తా చాటలేకపోయాయి. దీంతో ఫిబ్రవరి నెల మొత్తం నిరాశపరిచింది.

ఇప్పుడు మార్చి నెలలో వరుసగా సినిమాలు రిలీజ్‌ కు సిద్ధమవుతున్నాయి. మొదటి రెండు వారాల్లో చిన్న, మీడియం రేంజ్ సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వరలక్ష్మీ శరత్‌ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సరస్వతి మూవీ.. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే శ్రీ విష్ణు నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మృత్యుంజయ్ థియేటర్స్ లోకి రాబోతోంది.

మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు శివాజీ నటిస్తున్న సంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని కామెడీతో అలరించనుంది. ఆ చిత్రాలు మంచి టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్‌ కు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. అయితే అసలు సందడి మాత్రం నెలాఖరులో ఉండబోతోంది. భారీ అంచనాలతో వచ్చే పెద్ద సినిమాలే ప్రేక్షకులను ఎక్కువగా థియేటర్లకు రప్పించగలవు.

ముఖ్యంగా ధురంధర్ సీక్వెల్‌ పై యాక్షన్ లవర్స్ లో ఆసక్తి నెలకొంది. యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ దేశవ్యాప్తంగా హైప్ తెచ్చుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా విడుదలైతే థియేటర్లు హౌస్‌ ఫుల్ కావడం ఖాయం. ఏదేమైనా మార్చి నెల టాలీవుడ్‌ కు కీలకంగా మారింది.

అయితే తొలి రెండు వారాల్లో రిలీజ్ అయ్యే చిన్న అండ్ మీడియం రేంజ్ సినిమాలు కూడా మంచి కంటెంట్‌ తో నిలబడితే స్ట్రాంగ్ వసూళ్లు రావచ్చు. ఆ తర్వాత వచ్చే పెద్ద సినిమాలు హిట్ అయితే మాత్రం బాక్సాఫీస్‌ కు నిజమైన ఊపు వస్తుంది. లేదంటే మరోసారి నిరాశ తప్పదు. మరి ఈసారి టాలీవుడ్‌ కు మార్చి నెల ఊపు తీసుకువస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.