గాడ్ ఫాదర్స్ లేరు.. పర్ఫెక్ట్ కథల కోసం ఆగను!
అందాల భామగా విశ్వవేదికపై భారతదేశం తరఫున కిరీటాన్ని దక్కించుకోవడం ఏ యువతికైనా జీవితంలో అత్యున్నత మైలురాయి.
By: Srikanth Kontham | 1 Nov 2026 11:00 PM ISTఅందాల భామగా విశ్వవేదికపై భారతదేశం తరఫున కిరీటాన్ని దక్కించుకోవడం ఏ యువతికైనా జీవితంలో అత్యున్నత మైలురాయి. 20 ఏళ్ల ప్రాయంలోనే మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న మానుషి చిల్లర్ ఆ తర్వాత గ్లామర్ .. ప్రతిభతో బాలీవుడ్ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. అయితే సినిమా రంగంలోకి ప్రవేశించిన కొత్తలో అందరిలాగే తాను కూడా ఎన్నో కలలు కన్నారు. కానీ గడిచిన కొన్ని ఏళ్లలో ఇండస్ట్రీ పోకడలను గమనించిన అమ్మడు సరికొత్త సత్యాన్ని గ్రహించారు. `ప్రతి ప్రాజెక్ట్ మీ డ్రీమ్ జాబ్ కావాలని లేదు. కొన్నిసార్లు అది మిమ్మల్ని మీ లక్ష్యానికి మరింత చేరువ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది` అనే మానుషి స్టేట్‌మెంట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సినీ కుటుంబ నేపథ్యం లేని నటీనటులకు బాలీవుడ్‌లో ప్రయాణం ఎంతటి సవాళ్లతో కూడుకున్నదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి మనకోసమే ప్రత్యేకంగా అద్భుతమైన కథను రాసిపెడతారని ఎదురు చూడటం అత్యాశే అవుతుంది. మానుషి కూడా ఈ వాస్తవాన్ని చాలా త్వరగానే గ్రహించారు. పరిశ్రమలో కెరీర్‌ను నిలబెట్టుకోవడానికి ప్రతి అవకాశాన్ని ఒక మెట్టుగా మలచుకోవాలే తప్ప పర్ఫెక్ట్ రోల్ కోసం ఇంట్లోనే కూర్చుని సమయం వృథా చేయకూడదనే క్లారిటీ తో ఉంది.
కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉత్సాహంలో ఇతరుల సలహాలు, అభిప్రాయాలను వినడం సహజం. కానీ అనుభవం పెరిగేకొద్దీ ఇతరుల అభిప్రాయాలు సొంత ఆలోచనలను ముంచెత్తుతాయని తెలుసుకున్నారు. తన అంతరాత్మ చెప్పిన మాట విని తాను సొంతంగా తీసుకున్న ప్రతి నిర్ణయమే తనకు అసలైన సంతోషాన్ని తెచ్చిపెట్టిందని నమ్ముతారు. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ఇతర వ్యాపార రంగాల ద్వారా తాను సాధించిన ఆర్థిక స్వావలంబనే తనకు నటనపై ఒత్తిడిని తగ్గించిందని కేవలం ఆర్థిక అవసరాల కోసం కాకుండా ఇష్టంతో పనిచేసే స్వేచ్ఛను ప్రసాదించిందని స్పష్టం చేశారు.
సినిమాల విషయానికి వస్తే విక్రాంత్ మాస్సేశ్‌తో కలిసి నటిస్తున్న తాజా చిత్రం తనకెంతో ప్రత్యేకమైన అనుభూతిని మిగిల్చిందని మానుషి తెలిపారు. ముంబైలో చదివిన అత్యంత ఆసక్తికరమైన స్క్రిప్ట్‌లలో ఇదొకటని, ఇందులో వాడిన సరికొత్త సాంకేతికత నటనతో పాటు సినిమా మేకింగ్ మెకానిక్స్ పై కూడా చక్కటి అవగాహన కల్పించిందన్నారు . చివరి క్షణం వరకు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథాంశం అందరినీ కచ్చితంగా ఆకట్టు కుంటుందని ధీమా వ్యక్తం చేసారు.
గ్లామర్ ప్రపంచం వెలుపల ఫ్యాషన్ విషయంలో కూడా మానుషి చాలా క్లారిటీతో ఉన్నారు. ఇతరులను మెప్పించడం కోసం డ్రెస్ చేసుకోవడం కంటే తనకు ఏది సౌకర్యంగా అనిపిస్తుందో అదే ధరించడానికి ఇష్టపడతారు. సాధారణ టీ-షర్ట్, జీన్స్ .. వివిధ సిల్హౌట్‌లలో ఉండే నల్లటి దుస్తులు తన వార్డ్‌రోబ్‌లో ఎప్పటికీ ప్రత్యేకమేనని చెబుతారు. ఫ్యాషన్ బ్లాగర్ల అభిప్రాయాల కోసం కాకుండా తనకంటూ ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌ను ఏర్పరచుకోవడానికే మానుషీ ప్రాధాన్యత ఇస్తారు.
