2015 NEET లీక్ బాధితురాలు ఈ హీరోయిన్.. దేశంలో పరీక్ష పేపర్ల లీకేజీలపై సంచలన వ్యాఖ్యలు!
అవినీతి అనేది సమాజాన్ని పట్టిపీడిస్తున్న అంతం లేని ఒక పెద్ద జాడ్యం. ఈ అవినీతి వ్యవస్థ వల్ల అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజలు, విద్యార్థులే.
By: Sivaji Kontham | 1 Aug 2026 1:29 PM ISTఅవినీతి అనేది సమాజాన్ని పట్టిపీడిస్తున్న అంతం లేని ఒక పెద్ద జాడ్యం. ఈ అవినీతి వ్యవస్థ వల్ల అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజలు, విద్యార్థులే. అందులోనూ విద్యా వ్యవస్థలో చోటుచేసుకునే పరీక్ష పేపర్ల లీకులు, స్కామ్‌లు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా నీట్ (NEET) లీకేజీ వ్యవహారం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి లీకేజీల ఉదంతాలు భారతదేశంలో ఇప్పుడే కొత్త కాదని 2015లోనే తాను కూడా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ బాధితురాలినని మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ హీరోయిన్ మానుషి చిల్లర్ వెల్లడించారు.
సోహా అలీ ఖాన్ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మానుషి చిల్లర్.. 2015లో నీట్ పేపర్ లీక్ అయినప్పుడు తాను ఎదుర్కొన్న మానసిక ఆందోళనలను.. కష్టాల గురించి వెల్లడించారు. పరీక్ష కోసం సిద్ధమవుతున్న సమయంలో తనకు ఎంతో ఇష్టమైన కుచిపూడి నృత్యం, పెయింటింగ్‌లతో పాటు సంతోషాన్నిచ్చే ప్రతి విషయాన్ని దాదాపు ఏడాది పాటు పక్కనబెట్టాల్సి వచ్చిందని చెప్పారు. అలా ఎంతో కష్టపడి పరీక్ష రాసిన తర్వాత... పేపర్ లీక్ కావడంతో మళ్లీ 45 రోజుల పాటు రీ-ఎగ్జామ్ కోసం సిద్ధమవ్వాలని చెప్పినప్పుడు ఆ క్షణం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని.. అది తన జీవితంలోనే అత్యంత కష్టమైన దశలలో ఒకటని గుర్తుచేసుకున్నారు.
అయితే తన కంటే ఎంతోమంది నిరుపేద విద్యార్థులు ఈ లీకేజీల వల్ల నరకం అనుభవించారని మానుషి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను కోచింగ్ సెంటర్లకు పంపడానికి తల్లిదండ్రులు స్థోమతకు మించి అప్పులు చేయడం...చిన్న చిన్న పీజీ గదుల్లో ఉంటూ అహోరాత్రులు కష్టపడటం తాను స్వయంగా చూశానని తెలిపారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే కావడంతో తనకు కుటుంబ మద్దతు, మానసిక ధైర్యం లభించాయని.. రోజూ ఒక గంట సేపు వ్యాయామం చేయడం వల్ల తన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగానని.. కానీ మిగిలిన పేద విద్యార్థులకు ఆ సౌలభ్యం లేకపోవడం విచారకరమని మానుషి పేర్కొన్నారు.
హర్యానాలో జన్మించిన మానుషి చిల్లర్, డాక్టర్ కావాలనే లక్ష్యంతో వైద్య విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 2017లో మిస్ వరల్డ్ (ప్రపంచ సుందరి) కిరీటాన్ని కైవసం చేసుకుని భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. ఈ ఘనత సాధించిన ఆరో భారతీయురాలిగా చరిత్రకెక్కారు. ఆ తర్వాత 2022లో అక్షయ్ కుమార్ సరసన `సమ్రాట్ పృథ్వీరాజ్` చిత్రంలో రాజకుమారి సంయోగిత పాత్రతో బాలీవుడ్ వెండితెరకు పరిచయమయ్యారు.
ఆ తర్వాత `ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ`, `బడే మియాన్ ఛోటే మియాన్` వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. అరుణ్ గోపాలన్ దర్శకత్వంలో 2012 ఇజ్రాయెల్ దౌత్యవేత్తలపై జరిగిన దాడుల నేపథ్యంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ `తెహ్రాన్` చిత్రంలో మానుషి చివరిగా కనిపించారు. ఈ సినిమా ఓటీటీలో కూడా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఏది ఏమైనా దేశంలో ఎంతటి ప్రతిభావంతులైనా పరీక్ష పేపర్ల లీకేజీల వ్యవస్థకు బలవ్వాల్సి వస్తుందనడానికి మానుషి చిల్లర్ అనుభవమే ప్రత్యక్ష నిదర్శనం.
దక్షిణాది సెలబ్రిటీల మద్ధతు:
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ లేదా అక్రమాల వల్ల ప్రధానంగా నష్టపోయింది దేశవ్యాప్తంగా వైద్య విద్యను అభ్యసించాలని నిరంతరం కష్టపడిన సాధారణ విద్యార్థులు.. వారి కుటుంబాలే. అయితే ఈ లీకేజీ ఉదంతం వల్ల తీవ్రంగా చలించిపోయిన పలువురు సినీ, రాజకీయ - సామాజిక రంగానికి చెందిన ప్రముఖులు విద్యార్థుల పక్షాన నిలబడి తమ గళాన్ని విప్పారు. తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్, సూర్య, జ్యోతిక, శివకార్తికేయన్, ప్రకాష్ రాజ్ వంటి నటులతో పాటు రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ వంటి ప్రముఖ రాజకీయ నాయకులు ఈ అక్రమాలను తీవ్రంగా ఖండించారు. నీట్ వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతూ... నష్టపోయిన లక్షలాది మంది అర్హులైన విద్యార్థులకు న్యాయం జరగాలని...ఈ పరీక్ష విధానాన్ని సమీక్షించాలని వారు బహిరంగంగా డిమాండ్ చేశారు.
