Begin typing your search above and press return to search.

10 ఏళ్లుగా యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నా.. మనోజ్ బాజ్‌పాయ్ షాకింగ్ కామెంట్స్

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన మనోజ్ బాజ్‌పేయి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 Jun 2026 1:00 AM IST
10 ఏళ్లుగా యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నా.. మనోజ్ బాజ్‌పాయ్ షాకింగ్ కామెంట్స్
X

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన మనోజ్ బాజ్‌పేయి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. సత్య సినిమాలో భికు మాత్రే పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, అనంతరం షూల్, అలీగఢ్, భోంస్లే, జోరమ్ వంటి సినిమాల్లో అద్భుత నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే తెరపై కనిపించే విజయాల వెనుక తాను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి గురించి తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మనసు విప్పారు మ‌నోజ్.

గత పదేళ్లుగా ఎన్నోసార్లు యాక్టింగ్‌ను పూర్తిగా వదిలేయాలనే ఆలోచన తనకు వచ్చిందని మనోజ్ వెల్లడించారు. తీవ్రమైన ఎమోష‌న్స్ తో కూడిన పాత్రలను సంవత్సరాల పాటు పోషించడం వల్ల వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. కొన్ని పాత్రలు మనలోని వ్యక్తిత్వాన్ని మార్చేస్తాయి. మూడ్ స్వింగ్స్ ఎక్కువవుతాయి. ఎన్నోసార్లు ఇక నటనకు దూరంగా వెళ్లిపోదామనిపించింది. కానీ ప్రతిసారి ఒక మంచి పాత్ర ఎదురవుతుంది. మళ్లీ అదే ప్రయాణం మొదలవుతుంద‌ని చెప్పారు.

యాక్టింగ్ తనకు ఉద్యోగం కాదని, అది కేవలం అభిరుచి మాత్రమే కావాలని కోరుకుంటున్నట్లు మనోజ్ పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతల కోసం లేదా జీవనోపాధి కోసం నటించడం తనకు ఇష్టం లేదని, కేవలం పాత్రలపై ప్రేమతోనే పనిచేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అందుకే కొన్నిసార్లు ఈ వృత్తి నుంచి పూర్తిగా విరామం తీసుకోవాలనిపిస్తుందని చెప్పారు.

ఇటీవలి కాలంలో తాను డార్క్, సైకాలజికల్ పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మనోజ్ తెలిపారు. గలి గులేయాన్, భోంస్లే, జోరమ్ వంటి సినిమాలు తన నుంచి విపరీతమైన మానసిక శక్తిని తీసుకున్నాయని చెప్పారు. ఇలాంటి పాత్రలు చేయడ‌మంటే మరో మనిషి జీవితంలోకి పూర్తిగా వెళ్లిపోవడం లాంటిద‌ని, ఆ ప్రపంచంలోకి వెళ్లాక బయటకు రావడం చాలా కష్ట‌మ‌ని, ప్రతి డార్క్ పాత్ర ఆత్మలోని కొంత భాగాన్ని తీసుకెళ్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు.

తన కెరీర్‌లో కొన్ని పాత్రలు త‌న‌పై ఎంతగా ప్రభావం చూపాయో కూడా మనోజ్ గుర్తు చేసుకున్నారు. సత్య మూవీలో భికు మాత్రే పాత్ర చేసిన టైమ్ లో కోపం అదుపులో ఉండేదే కాదని, షూల్ సినిమా టైమ్ లో రాత్రిళ్లు నిద్రపట్టక పీడకలలు వేధించాయని చెప్పారు. కొన్ని సినిమాల్లో తాను ఎలా నటించానో కూడా ఇప్పుడు గుర్తులేదని, పాత్రల్లో పూర్తిగా మునిగిపోవడం వల్లే అలా జరుగుతుందని వెల్లడించారు. అయితే ఈ అనుభవాలను కొందరు నటులు అతిశయోక్తిగా భావించినా, తన పని విధానం అలాంటిదేనని మనోజ్ స్పష్టం చేశారు. ఆడియ‌న్స్ తన కళ్లలో పాత్రను చూడగలిగితేనే అది స‌క్సెస్‌ఫుల్ యాక్టింగ్ గా ఆయ‌న చెప్పారు.

కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన కష్టాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. అవకాశాల కోసం తిరుగుతూ అవమానాలు ఎదుర్కొన్న రోజులు, తన టాలెంట్‌పైనే అనుమానం వచ్చిన సందర్భాలు ఇప్పటికీ మర్చిపోలేనివని తెలిపారు. అయితే ఆ పోరాటమే తనను ఈ స్థాయికి తీసుకువచ్చిందని చెప్పారు. యాక్టింగ్‌ను వదిలేయాలనే ఆలోచనలు వచ్చినప్పటికీ, మంచి పాత్రలపై ఉన్న ప్రేమే తనను మళ్లీ కెమెరా ముందుకు తీసుకొస్తోందని మనోజ్ బాజ్‌పేయి మాటలు స్పష్టం చేస్తున్నాయి. అదే ఆయనను భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక నటుడిగా నిలబెట్టిన అసలు బలం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.