'ఫ్యామిలీమ్యాన్ 3' స్ట్రీమింగ్ తేదీ ఇదే
ఓటీటీ స్పేస్‌లో అత్యంత ప్రభావవంతమైన దర్శకరచయితలుగా రాజ్ అండ్ డీకే పాపులరయ్యారు
By: Sivaji Kontham | 28 Oct 2025 8:00 PM ISTఓటీటీ స్పేస్‌లో అత్యంత ప్రభావవంతమైన దర్శకరచయితలుగా రాజ్ అండ్ డీకే పాపులరయ్యారు. ఓటీటీల కోసం ఈ తెలుగు కుర్రాళ్లు పట్టిందల్లా బంగారమే. విజయం నల్లేరుపై నడకలా సాగిపోతోంది. ఫ్యామిలీమ్యాన్, ఫ్యామిలీమ్యాన్ 2, ఫర్జీ లాంటి వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో గొప్ప ఆదరణ దక్కించుకున్నాయి. తదుపరి రక్త్ బ్రహ్మాండ్ చిత్రీకరణ దశలో ఉండగా, ఇప్పుడు ఫ్యామిలీమ్యాన్ -3 ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న అభిమానులకు తాజాగా రిలీజ్ తేదీపై శుభవార్త అందింది.
మోస్ట్ అవైటెడ్ `ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3` త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. సిరీస్ లో ఈ మూడో భాగం మొదటి రెండు భాగాలను మించి విజువల్ ట్రీట్ అవుతుందని రాజ్ అండ్ డీకే కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. అవతార్, అవతార్ 2 లను మించి అవతార్ 3 విజయం సాధిస్తుందని దర్శకుడు కామెరూన్ `అవతార్ 3` గురించి చెబుతున్నారు. అంతే కాన్ఫిడెంట్ గా రాజ్ అండ్ డీకే కూడా `ఫ్యామిలీమ్యాన్ 3` గురించి వేదికలపై మాట్లాడుతున్నారు.
తాజా సమాచారం మేరకు `ది ఫ్యామిలీ మ్యాన్` సీజన్ 3 నవంబర్ 21న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. ఈ షో 240 కంటే ఎక్కువ దేశాలు, ప్రాంతాలలో ప్రసారం అవుతుంది. అమెజాన్ ప్రైమ్ తాజాగా విడుదల తేదీని ధృవీకరిస్తూ కొత్త వీడియోని రిలీజ్ చేయగా అది అంతర్జాలంలో వేగంగా దూసుకుపోతోంది. తాజా వీడియో క్లిప్ లో శ్రీకాంత్ తివారీ కంబ్యాక్ ప్రకటన విజువల్ ఎంతో ఫన్నీగా ఆకట్టుకుంది.
ఎప్పటిలాగే మనోజ్ బాజ్‌పేయి అండర్ కవర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారీగా కనిపిస్తారు. సీజన్ 3లో అతడు బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోబోతున్నాడు. జైదీప్ అహ్లవత్ (రుక్మా) , నిమ్రత్ కౌర్ (మీరా) విలన్లుగా కనిపిస్తారు. శ్రీకాంత్ తివారీకి దేశం లోపలి నుంచి దేశం వెలుపలి నుంచి బెదిరింపులు ఎదురవుతుంటాయి. అతడు భయానకమైన శత్రువులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
షరీబ్ హష్మి (జెకె తల్పాడే), ప్రియమణి (సుచిత్ర తివారీ), ఆశ్లేష ఠాకూర్ (ధృతి తివారీ), వేదాంత్ సిన్హా (అథర్వ్ తివారీ), శ్రేయ ధన్వంతరి (జోయా), గుల్ పనాగ్ (సలోని) తదితరులు ఈ సిరీస్ లో నటించారు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కి రాజ్ అండ్ డికె లతో కలిసి సుమన్ కుమార్ స్క్రిప్టు అందించారు. సంభాషణలు సుమిత్ అరోరా రాశారు. మూడవ సీజన్ కి రాజ్ & డికె లతో పాటు సుమన్ కుమార్, తుషార్ సేథ్ దర్శకత్వం వహించారు.
కొన్నేళ్లుగా ఫ్యామిలీమ్యాన్ సిరీస్ ను ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తున్నారు. రెండు సీజన్లు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సిరీస్ నుంచి కొత్త సీజన్ రాక కోసం అందరూ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో నవంబర్ 21న రిలీజ్ అంటూ మేకర్స్ పేర్కొనడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓపిగ్గా వేచి ఉన్న అభిమానులనుద్ధేశించి రాజ్ అండ్ డీకే మాట్లాడుతూ.... ఫ్యామిలీమ్యాన్ సిరీస్‌పై మీ ప్రేమాభిమానాలు, ఆదరణకు ధన్యవాదాలు. మీరంతా ఓపికగా వేచి ఉన్నారని మాకు తెలుసు. ఈ సీజన్‌లో మరింత హై ఆక్టేన్ యాక్షన్, ఆకర్షణీయమైన కథనం, ఉత్కంఠభరితమైన ప్రదర్శనలు చూస్తారు. సీట్ ఎడ్జ్ థ్రిల్స్ ని అనుభిస్తారు. అందుకే ఈసారి మూడో భాగాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దాము అని తెలిపారు. శ్రీకాంత్ తివారీ ఈసారి బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాడు. శ్రీకాంత్, అతడి కుటుంబం చిక్కులలో పడటమే కాదు... అతడి కెరీర్ కూడా ట్రబుల్స్ ని ఎదుర్కొంటుందని తాజా ప్రకటనలో హింట్ ఇచ్చారు. నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు `ఫ్యామిలీమ్యాన్ -3` ట్రీటినుంది.
