నటుడి ఎన్నికల ప్రచార వీడియో... ఇదిగో క్లారిటీ
బీహార్ అభివృద్ది కేవలం లాలూ ప్రసాద్ యాదవ్ వారసులతో సాధ్యం అన్నట్లుగా ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
By: Ramesh Palla | 17 Oct 2025 8:00 PM ISTబాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తీరు చాలా విభిన్నంగా ఉంటుంది. ఆయన నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక ఆయన నటుడిగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు, అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వివాదాస్పదం అవుతూ ఉంటాడు. కొన్ని సార్లు తన ప్రమేయం లేకుండానే సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. బీహార్‌కి చెందిన మనోజ్ బాజ్‌పాయి గురించి ప్రస్తుతం జాతీయ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. అందుకు కారణం ఆయన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లాలూప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్‌జేడీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లుగా వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీహార్ అభివృద్ది కేవలం లాలూ ప్రసాద్ యాదవ్ వారసులతో సాధ్యం అన్నట్లుగా ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ఆర్‌జేడీకి మద్దతుగా మనోజ్ బాజ్‌పాయి ప్రచారం
తన పేరుతో వచ్చిన వీడియోల్లో ఉన్నది తాను కాదు అంటూ స్వయంగా మనోజ్ బాజ్‌పాయి మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చాడు. స్వయంగా లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ ముఖ్య నేత అయిన తేజస్వీ యాదవ్ ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా చాలా మంది రాజకీయాల్లో మనోజ్ బాజ్‌పాయి పూర్తిగా దిగాడని, ఆయన ఆర్‌జేడీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నాడని అనుకుంటున్నారు. కొందరు మాత్రం ఆయన్ను ఈ విషయమై విమర్శిస్తున్నారు. నటుడిగా అందరి వాడిలా ఉండాల్సిన ఈయన ఎందుకు ఆర్‌జేడీ పార్టీలో చేరి కొందరి వాడు అయ్యాడు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆయన వద్దకు చేరడంతో అసలు ఆ వీడియో నాది కాదు బాబోయ్ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు అప్పుడప్పుడు రావడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయింది.
లాలూ ప్రసాద్ యాదవ్ పై అభిమానంతో..
ఆర్‌జేడీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లుగా వీడియో గురించి మనోజ్ బాజ్‌పాయి స్పందిస్తూ... ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలోనూ లేను, నా మద్దతు ఏ రాజకీయ పార్టీకి లేదు. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, నాకు ఏ రాజకీయ నాయకుడితో సన్నిహిత సంబంధాలు లేవు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొందరు నా పేరుతో షేర్ చేస్తున్న వీడియోలో ఉన్నది నేను కాదు, అది ఫేక్ వీడియో, ఆర్‌జేడీ ఐటీ సెల్ వారు దాన్ని క్రియేట్ చేశారు. దాన్ని వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా అనుమతి లేకుండా నా ఫోటోలు, నా వీడియోలను, పేరును వినియోగించినందుకు గాను చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతాను అంటూ హెచ్చరించాడు. ఇప్పటికే ఆర్‌జేడీ అధికారిక ఖాతాల నుంచి ఆ వీడియోలు తొలగించారు. అయితే ఇప్పటికీ ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం ఆ వీడియోను తెగ షేర్ చేస్తూ ఉన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో..
గతంలో ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యంతో ఉన్న సమయంలో ఒక సారి మనోజ్ బాజ్‌పాయి ఆయన్ను పరామర్శించాడు. ఆ సమయంలోనే ఆర్‌జేడీలో మనోజ్ బాజ్‌పాయి చేరుతాడు అనే ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలను ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తూ వచ్చిన మనోజ్ బాజ్‌పాయికి ఆ తలనొప్పి తప్పలేదు. గత మూడు ఏళ్లుగా ఆయనను లాలూ మనిషి అని పిలుస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇంతగా ప్రచారం జరిగింది కదా ఎందుకు మీరు ఆర్‌జేడీలోకి వెళ్లకూడదు అని కొందరు ప్రశ్నించిన సమయంలో తనకు రాజకీయాలు సరిపోవు అని, నటన విషయంపైనే పూర్తి దృష్టి ఉంది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఎప్పుడూ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని అన్నాడు. ఏ పార్టీకి మద్దతుగా తాను మాట్లాడటం లేదని క్లారిటీ ఇచ్చాడు.
